ఆసియాకప్ ఫైనల్లో భారత్ తో శ్రీలంక ఢీ
మహిళల టీ-20 ఆసియాకప్ టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. సిల్హౌట్ స్టేడియం వేదికగా శనివారం జరిగే ఫైనల్లో భారత్, శ్రీలంకజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.
మహిళల టీ-20 ఆసియాకప్ టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. సిల్హౌట్ స్టేడియం వేదికగా శనివారం జరిగే ఫైనల్లో భారత్, శ్రీలంకజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.
హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
బంగ్లాదేశ్ వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2022 ఆసియాకప్ మహిళా టీ-20 టోర్నీలో ఆఖరాటకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మొత్తం ఆరుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ దశ నుంచి హాట్ ఫేవరెట్ భారత్, మాజీ చాంపియన్ శ్రీలంక చేరుకొన్నాయి.
భారత్ అలా...శ్రీలంక ఇలా...
రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించడం ద్వారా టాపర్ గా సెమీస్ కు అర్హత సాధించిన భారత్...తొలి సెమీఫైనల్లో థాయ్ లాండ్ ను 74 పరుగులతో చిత్తు చేయడం ద్వారా వరుసగా ఎనిమిదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
రౌండ్ రాబిన్ లీగ్ దశలో అలవోకగా థాయ్ లాండ్ ను ఓడించిన భారత్ కు సెమీస్ లోనూ ఎదురేలేకపోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ, స్పిన్ జోడీ దీప్తి శర్మ, రాజేశ్వరి గయక్వాడ్ ల జోరు ముందు థాయ్ జట్టు నిలువలేకపోయింది.
పాక్ పై శ్రీలంక సంచలన విజయం..
పాకిస్థాన్- శ్రీలంకజట్ల మధ్య రెండో సెమీఫైనల్ నువ్వానేనా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా సాగింది. లోస్కోరింగ్ గా సాగిన ఈ నాకౌట్ పోరులో ఆధిక్యత ఆఖరి ఓవర్ ఆఖరు బంతి వరకూ చేతులు మారుతూ వచ్చింది. విజయం సాధించాలంటే చివరి బంతికి ఒక్కపరుగు చేయాల్సిన పాక్ విఫలమయ్యింది. దీంతో శ్రీలంకజట్టు ఒక్క పరుగుతో సంచనల విజయం సాధించడం ద్వారా ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.
గత ఎనిమిదిటోర్నీలలో వరుసగా ఫైనల్స్ చేరుతూ వచ్చిన భారతజట్టు...శనివారం జరిగే ఫైనల్స్ లో టైటిల్ గెలుచుకోడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి శ్రీలంకజట్టుకు సైతం అత్యంత ప్రమాదకరమైనజట్టుగా పేరుంది.
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగే మహిళా టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా ప్రస్తుత ఆసియాకప్ టోర్నీని ఆసియాక్రికెట్ మండలి నిర్వహించింది.