భారత్ కు డూ ఆర్ డై..నేడే ఆఖరి టీ-20!
భారత్ -దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. జోహెన్స్ బర్గ్ వేదికగా ఈరోజు జరిగే ఆఖరిపోరు..టాప్ ర్యాంకర్ భారత్ కు డూ ఆర్ డైగా మారింది.
భారత్ -దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. జోహెన్స్ బర్గ్ వేదికగా ఈరోజు జరిగే ఆఖరిపోరు..టాప్ ర్యాంకర్ భారత్ కు డూ ఆర్ డైగా మారింది.
ధూమ్ ధామ్ టీ-20 టాప్ ర్యాంకర్ భారత్, 6వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాజట్ల మూడుమ్యాచ్ ల సిరీస్ ముగింపుదశకు చేరింది. వరుడు దోబూచులాడుతున్న ఈ సిరీస్ లోఇప్పటికే తొలిమ్యాచ్ వానదెబ్బతో రద్దు కాగా..వర్షం అంతరాయం నడుమ ముగిసిన రెండోమ్యాచ్ లో ఆతిధ్య దక్షిణాఫ్రికాజట్టు 5 వికెట్ల విజయం సాధించడం ద్వారా 1-0తో సిరీస్ పై పట్టు బిగించింది.
సూర్యసేన సత్తాకు సవాల్....
ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన భారత్ సఫారీగడ్డపై చావో బతుకో పరీక్షకు సిద్ధమయ్యింది. మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ ను సమం చేయాలంటే జోహెన్స్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరి టీ-20లో నెగ్గితీరాల్సి ఉంది.
గ్విబెరా వేదికగా ముగిసిన రెండో టీ-20 పోరు బ్యాటింగ్ లో రాణించినా బౌలింగ్ విభాగంలో విఫలం కావడం ద్వారా భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దానికితోడు ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ ..ఇద్దరూ డకౌట్లు కావడం భారత్ ను దెబ్బతీసింది.
అయితే..కీలక ఆఖరిపోరులో మాత్రం శుభ్ మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గయక్వాడ్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. మ్యాచ్ కు వేదికగా ఉన్న వాండరర్స్ స్టేడియం పిచ్ పేస్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు అనువుగా ఉండే అవకాశం ఉండడంతో హైస్కోరింగ్ పోరుగా జరిగే అవకాశం ఉంది.
సూర్య, రింకూల వైపే భారత్ చూపు!
సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ నెగ్గాలంటే భారత బ్యాటర్లు పూర్తిస్థాయిలో సత్తా చాటుకోవాల్సి ఉంది. ఓపెనింగ్ జోడీ ఇచ్చే ఆరంభంతో పాటు కెప్టెన్ సూర్య, సూపర్ హిట్టర్ రింకూసింగ్ ల బ్యాటింగ్ సైతం కీలకం కానుంది.
స్ట్ర్రోక్ ప్లేకు అనువుగా ఉండే వాండరర్స్ ఫాస్ట్,బౌన్సీ పిచ్ పైన సూర్యకుమార్ భారీస్కోరు సాధించే అవకాశం లేకపోలేదు. బ్యాటర్లకు తోడు..బౌలర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే భారత్ విజేతగా నిలువగలుగుతుంది.
నాకౌట్ పంచ్ కు సఫారీలు రెడీ..
రెండోటీ-20 మ్యాచ్ లో భారత్ ను 5 వికెట్లతో చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో సఫారీటీమ్..ఆఖరి మ్యాచ్ లో సైతం విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. మర్కరమ్ నాయకత్వంలోని సఫారీజట్టులో రీజా హెండ్రిక్స్, స్టబ్స్, మిల్లర్ లాంటి సూపర్ హిట్టర్లతో పాటు పలువురు మెరుపు ఫాస్ట్ బౌలర్లు సైతం ఉన్నారు.
గత 8 టీ-20 మ్యాచ్ ల్లో ఆరు హాఫ్ సెంచరీలు బాదిన రీజా భారత్ పై 27 బంతుల్లోనే 49 పరుగుల స్కోరు సాధించడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.
దూకుడుమీదున్న సఫారీ హిట్టర్ల నుంచి భారత బౌలర్లకు గట్టి పరీక్షే ఎదురుకానుంది.
కీలక ఫాస్ట్ బౌలర్ల జోడీ మార్కో జాన్సన్, గెరాల్డ్ కోట్జేలకు విశ్రాంతినివ్వడంతో వారికి బదులుగా యువఆటగాళ్లు నాండ్రే బర్గర్, ఓట్టీనీల్ బార్ట్ మాన్ లు దక్షిణాఫ్రికా తరపున అరంగేట్రం చేయనున్నారు.
సిరీస్ లో సమఉజ్జీగా నిలిచేనా?
దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ప్రస్తుత సిరీస్ కు ముందు వరకూ ఆడిన మొత్తం 15 ( మూడు ఫార్మాట్లలో ) సిరీస్ ల్లో రెండంటే రెండుసార్లు మాత్రమే విజేతగా నిలువగలిగింది. ఈసిరీస్ లోని ఆఖరిమ్యాచ్ నెగ్గడం ద్వారా 1-1 సిరీస్ ను సమం చేయగలిగితే సూర్యసేనకు అది గొప్ప ఘనతే అవుతుంది. వాండరర్స్ స్టేడియంలోసఫారీజట్టుకు 65.98 శాతం విజయాలున్నాయి.
2018లో చివరిసారిగా భారత్ టీ-20 సిరీస్ నెగ్గింది. అయితే..రెండుజట్ల బలబలాలు, వాండరర్స్ పిచ్ పరిస్థితులను బట్టి చూస్తే భారత్ కే విజయావకాశాలు హెచ్చుగా ఉన్నాయి. పైగా భారత్ కు 5 విజయాలు, 5 పరాజయాల రికార్డు సైతం ఉంది.
వానముప్పు లేనట్లేనా?
సిరీస్ లోని ఈ కీలకపోరుకు సైతం వానముప్పు తప్పదని గతంలోనే వాతావరణశాఖ ప్రకటించింది. అయితే..వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలిగే అవకాశంలేదని, మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని , దట్టమైన మేఘాల నడుమే మ్యాచ్ కొనసాగుతుందని ప్రకటించారు.
ఒక విధంగా చెప్పాలంటే సిరీస్ లోని ఈ కీలక పోరు 6వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాకు చెలగాటం, టాప్ ర్యాంకర్ భారత్ కు సిరీస్ సంకటంగా మారింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్య నాయకత్వంలోని భారత్ ..వాండరర్స్ మ్యాచ్ లో వండర్ చేస్తుందా? తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.