నేడే రెండో వన్డే...భారత్ కు చెలగాటం, సఫారీలకు సిరీస్ సంకటం!

దక్షిణాఫ్రికా- భారతజట్ల తీన్మార్ వన్డే సిరీస్ లోని కీలక రెండోమ్యాచ్ ఈరోజు సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగనుంది.

Advertisement
Update:2023-12-19 13:10 IST

దక్షిణాఫ్రికా- భారతజట్ల తీన్మార్ వన్డే సిరీస్ లోని కీలక రెండోమ్యాచ్ ఈరోజు సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగనుంది. 1-0 ఆధిక్యంతో ఉన్న భారత్ వరుసగా రెండో గెలుపుతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న లక్ష్యంతో పోటీకి దిగుతోంది.

దక్షిణాఫ్రికాగడ్డపై వన్డే సిరీస్ విజయానికి కెఎల్ రాహుల్ నాయకత్వంలోని భారత్ ఉరకలేస్తోంది. మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలివన్డేలో సాధించిన భారీవిజయం జోరుతో వరుసగా రెండో గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.

క్వెబరాలోని సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియం వేదికగా భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక పోరు భారత్ కు చెలగాటం, ఆతిథ్య సఫారీజట్టుకు సిరీస్ సంకటంగా మారింది.

తీవ్రఒత్తిడిలో దక్షిణాఫ్రికా....

న్యూవాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన తొలివన్డేలో 116 పరుగులకే కుప్పకూలటాన్ని సఫారీ కెప్టెన్ మర్కరమ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు.

భారత పేస్ జోడీ అర్షదీప్ సింగ్ 5 వికెట్లు, ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టడంతో సఫారీ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది.

లెఫ్టామ్ పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ 37 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా దక్షిణాఫ్రికాను ఓ ఆటాడుకొన్నాడు.

స్పిన్ బౌలర్లకు అనువైన పిచ్ పైన...

తొలివన్డేకు ఆతిథ్యమిచ్చిన వాండరర్స్ స్టేడియం పిచ్ పేస్ , స్వింగ్ బౌలర్లకు అనుకూలిస్తే..రెండో వన్డే వేదికగా మాత్రం స్పిన్ బౌలర్ల అడ్డాకానుంది. రెండుజట్లు ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

భారత్ తరపున చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్, సఫారీజోడీ కేశవ్ మహారాజ్, తబ్రిజ్ షంషీ తమజట్ల తరపున కీలకపాత్ర పోషించనున్నారు.

ఈమ్యాచ్ కు వానముప్పు లేనట్లేనని, మ్యాచ్ ప్రారంభానికి ముందే కురవాల్సిన వర్షం కురిచేస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇగే గ్రౌండ్ వేదికగా ఆడిన గత మూడు వన్డేలలో సఫారీజట్టుకు 2 విజయాలు, ఓ పరాజయం రికార్డు ఉన్నాయి.

సఫారీ బ్యాటింగ్ ఆర్డర్లో రీజా హెండ్రిక్స్, టోనీ జార్జి, రాస్ వాన్ డెర్ డ్యూసెన్, మర్కరమ్, క్లాసెన్ లాంటి మేటిబ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా బ్యాట్ చేయగలిగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.

తుదిజట్టులో రింకూకు చోటు దక్కేనా?

టీ-20 ఫార్మాట్లో అత్యుత్తమంగా రాణిస్తున్న రింకూ సింగ్ వన్డే క్యాప్ కోసం ఎదురుచూస్తున్నాడు. టీమ్ మేనేజ్ మెంట్ కరుణించే పక్షంలో ఈ రోజు జరిగే మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు.

మిడిలార్డర్ లో సంజు శాంసన్ సైతం తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు. ఓపెనర్ గా సాయి సుదర్శన్ తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగాడు.

దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా ఆడిన తన 7 వన్డేలలో నాలుగింట మూడుకు పైగా వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ ఈరోజు జరిగే మ్యాచ్ లో సైతం మ్యాచ్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉంది.

తొలివన్డే గెలుపు జోరునే భారత్ కొనసాగించేనా?

న్యూవాండరర్స్ స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో సఫారీజట్టును భారత్ 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూల్చింది. సమాధానంగా 117 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 200బంతులు మిగిలి ఉండగానే చేధించగలిగింది.

ఓపెనర్ సాయి సుదర్శన్ 41 బంతుల్లో 55 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 52 పరుగుల స్కోర్లతో తమజట్టుకు అలవోక విజయం అందించారు. రెండో వన్డేలో సైతం అదేజోరు కొనసాగించడం ద్వారా సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.

విజయమే లక్ష్యంగా సఫారీ టీమ్..

తొలివన్డే ఓటమితో కంగుతిన్న సఫారీటీమ్..ఆరునూరైనా రెండోవన్డే నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉంది. పైగా సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఆడిన 35 మ్యాచ్ ల్లో 21 విజయాలు, 13 పరాజయాల రికార్డుతో దక్షిణాఫ్రికా ఉంది.

భారతజట్టుకు మాత్రం ఇదే స్టేడియం వేదికగా ఆడిన గత ఆరుమ్యాచ్ ల్లో 5 పరాజయాలు, ఒకే ఒక్క గెలుపు రికార్డు మాత్రమే ఉండటం విశేషం. దక్షిణాఫ్రికాజట్టు సగటున 224 పరుగుల చొప్పున సాధిస్తే..భారత్ 180కి మించి పరుగులు సాధించలేకపోయింది.

2018 సిరీస్ లో భాగంగా ఇదే వేదికగా ఆడిన మ్యాచ్ లో భారత్ అత్యధికంగా 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగుల స్కోరు చేయడంతో పాటు..సఫారీజట్టుపై 73 పరుగుల విజయం నమోదు చేయగలిగింది.

భారత్- దక్షిణాఫ్రికాజట్లు సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఇప్పటి వరకూ ఆడిన 5 మ్యాచ్ ల్లో ఆతిథ్యజట్టు 4-1 రికార్డుతో ఉంది.

దక్షిణాఫ్రికాదే పైచేయి...

భారత్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఆడిన 92 వన్డేలలో దక్షిణాఫ్రికా 50 విజయాలు, 39 పరాజయాల రికార్డుతో ఉంది. అయితే..ఈ రెండుజట్లు తలపడిన గత ఐదు వన్డేలలో భారత్ నాలుగు విజయాలు, దక్షిణాఫ్రికా ఓ గెలుపు రికార్డుతో ఉన్నాయి.

సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా భారత్ తో తలపడిన గత ఐదుమ్యాచ్ ల్లో 4విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా ఈరోజు జరిగే కీలక రెండో వన్డేలో హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది.

ఈమ్యాచ్ లో భారత్ నెగ్గితే 2-0తో సిరీస్ ఖాయం చేసుకోగలుగుతుంది. అదే సఫారీటీమ్ గెలిస్తే 1-1తో సిరీస్ ను సమం చేయడంతో పాటు..సిరీస్ విజయావకాశాలను సజీవంగా నిలుపుకోగలుగుతుంది.

Tags:    
Advertisement

Similar News