నేడే భారత్- పాక్ 'సూపర్ ' ఫైట్!

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో సూపర్ డూపర్ ఫైట్ కి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మూడోరౌండ్ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

Advertisement
Update:2023-10-14 09:04 IST

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో సూపర్ డూపర్ ఫైట్ కి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మూడోరౌండ్ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఢీ అంటే ఢీ అంటున్నాయి...

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో మరో అతిపెద్ద సమరానికి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిలిచింది.

ఈ రోజు జరిగే' సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్' ఫైట్ లో మాజీ చాంపియన్లు భారత్, పాక్ సై అంటే సై అంటున్నాయి. మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తున్న ఈ రెండుజట్ల పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

భారత తుదిజట్టులో శుభ్ మన్ గిల్?

డెంగ్యూజ్వరంతో రౌండ్ రాబిన్ లీగ్ మొదటి రెండురౌండ్ల మ్యాచ్ లకు దూరంగా ఉన్న యువఓపెనర్ శుభ్ మన్ గిల్ పూర్తిగా కోలుకొని నెట్ ప్రాక్టీసులో చురుకుగా పాల్గొనగలగడంతో భారత టీమ్ మేనేజ్ మెంట్ ఊపిరి పీల్చుకొంది.

పాక్ తో జరిగే ఈ కీలక పోరులో కెప్టెన్ రోహిత్ కలసి శుభ్ మన్ గిల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గిల్ అందుబాటులోకి వస్తే..స్టాప్ గ్యాప్ ఓపెనర్ గా మొదటి రెండుమ్యాచ్ ల్లో పాల్గొన్న ఇషాన్ కిషన్ బెంచ్ కే పరిమితం కాక తప్పదు.

కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్లు విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉండడంతో భారత బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. మొదటి రెండు రౌండ్లలో విరాట్ హాఫ్ సెంచరీలు సాధిస్తే..కంగారూజట్టుపై రాహుల్ 97 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

తొలిమ్యాచ్ లో డకౌటైన రోహిత్..అప్ఘనిస్థాన్ తో జరిగిన రెండోరౌండ్లో మెరుపుశతకంతో రికార్డుల మోత మోగించాడు. 131 పరుగుల భారీస్కోరుతో ప్రపంచకప్ చరిత్రలోనే 7 శతకాలు బాదిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.

పాక్ తో ఇటీవలే ముగిసిన ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ మ్యాచ్ లో భారతజోడీ రాహుల్- విరాట్ 3వ వికెట్ కు 233 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అదేజోరును ప్రస్తుత ప్రపంచకప్ లోనూ ఇటు విరాట్, అటు రాహుల్ కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నారు.

మిడిలార్డర్లో రవీంద్ర జడేజా, అశ్విన్ లేదా శార్దూల్ ఠాకూర్ లాంటి బౌలింగ్ ఆల్ రౌండర్లు సైతం కీలకం కానున్నారు.

సిరాజ్ స్థానంలో మహ్మద్ షమీ...

ప్రస్తుతం సమతూకంతో కనిపిస్తున్న భారత బౌలింగ్ ఎటాక్ లో ..పిచ్ తో పాటు ప్రత్యర్థిజట్లను బట్టి టీమ్ మేనేజ్ మెంట్ మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది.

రివర్స్ స్వింగ్ కు అనువైన అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ కు బదులుగా మహ్మద్ షమీని తుదిజట్టులో చేర్చుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ కావాలనుకొంటే వెటరన్ అశ్విన్ ను ..లేదా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఉండాలను కొంటే శార్దూల్ ఠాకూర్ ను తుదిజట్టులో చేర్చుకొనే అవకాశం ఉంది.

బుమ్రా, షమీ, పాండ్యాలతో కూడిన పేస్, జడేజా, కుల్దీప్, అశ్విన్ లతో కూడిన స్పిన్ బౌలింగ్ తో పాక్ టాపార్డర్ కు భారత్ సవాలు విసురుతోంది.

దూకుడుమీదున్న పాకిస్థాన్ జట్టు..

బాబర్ అజమ్ నాయకత్వంలోని పాక్ జట్టు సైతం మొదటి రెండురౌండ్లలో నెదర్లాండ్స్, శ్రీలంకజట్లను చిత్తు చేయడం ద్వారా దూకుడు మీద కనిపిస్తోంది.

శ్రీలంకతో ముగిసిన హైస్కోరింగ్ పోరులో ప్రపంచ రికార్డు విజయం సాధించిన పాక్ బ్యాటర్లలో ఇప్పటికే ఓపెనర్ షపీఖ్, వికెట్ కీపర్ రజ్వాన్ శతకాలు బాదడం ద్వారా భారత్ తో కీలక సమరానికి సిద్ధమయ్యారు.

షాహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్, నసీమ్ ఖాన్, షదాబ్ ఖాన్, హసన్ అలీలతో కూడిన పాక్ బౌలింగ్ ఎటాక్ కు భారత టాపార్డర్ నుంచి గట్టి పరీక్ష ఎదురుకానుంది.

ఇటీవలే ముగిసిన ఆసియాకప్ టోర్నీలో పాక్ తో రెండుసార్లు తలపడిన భారత్ రెండుసార్లూ పైచేయి సాధించడం ద్వారా మరో విజయానికి ఉరకలేస్తోంది.

ప్రారంభ ఓవర్లలో పాక్ ఓపెనింగ్ బౌలర్లు కీలక వికెట్లు పడగొట్టలేక పోతే భారత్ విజయం నల్లేరు మీద బండి నడకే అని చెప్పక తప్పదు.

ప్రపంచకప్ లో తిరుగులేని భారత్..

ప్రపంచకప్ వన్డే టోర్నీల చరిత్రలో పాకిస్థాన్ ప్రత్యర్థిగా భారత్ కు తిరుగులేని రికార్డే ఉంది. ఏడుకు ఏడుసార్లూ పాక్ ను చిత్తు చేయడం ద్వారా భారత్ 7-0 రికార్డుతో పైచేయి సాధించింది.

ఓవరాల్ గా ఈ రెండుజట్లు వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకూ 134సార్లు తలపడితే పాక్ 73 విజయాలతో భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉంది.

1992 నుంచి 2019 ప్రపంచకప్ వరకూ..

1992 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై 43 పరుగులతో నెగ్గిన భారత్ 1996 ప్రపంచకప్ లో 39 పరుగులు, 1999 ప్రపంచకప్ లో 47 పరుగులు, 2003 ప్రపంచకప్ లో 6 వికెట్లు, 2011 ప్రపంచకప్ లో 29 పరుగులు, 2015 ప్రపంచకప్ లో 76 పరుగులు, 2019 ప్రపంచకప్ లో 89 పరుగుల విజయాలతో నిలిచింది. నూటికి నూరుశాతం విజయాలతో ఉన్న భారత్ ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం హాట్ ఫేవరెట్ గా పోరుకు దిగుతోంది.

మ్యాచ్ లో భాగంగా ప్రారంభ వేడుకలు..

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ఒకటిగా ఉన్నఅహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లక్షమంది అభిమానులతో కిటకిటలాడనుంది. గత సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రస్తుత ప్రపంచకప్ లో మొదటి వారం రోజుల పోటీలు ముగిసిన అనంతరం ప్రారంభ వేడుకలను ఈ రోజు భారత్- పాక్ జట్ల బ్లాక్ బస్టర్ ఫైట్ ప్రారంభానికి ముందు నిర్వహించనున్నారు.

ప్రపంచకప్ లో పాక్ ప్రత్యర్థిగా భారత్ వరుసగా ఎనిమిదో విజయం సాధిస్తుందా? లేక భారత్ పై ప్రపంచకప్ తొలివిజయం సాధించడం ద్వారా పాక్ జట్టు చరిత్ర సృష్టిస్తుందా? తెలుసుకోవాలంటే ఈ రోజు జరిగే సూపర్ సండే ఫైట్ ను తొలి ఓవర్ నుంచి మలి ఓవర్ వరకూ వీక్షించడమో లేదా ఫాలో కావడమో చేసి తీరక తప్పదు.

Tags:    
Advertisement

Similar News