విరాట్ కొహ్లీకి న్యూజిలాండ్ పేసర్ల గండం!

భారత్ -న్యూజిలాండ్ జట్ల సూపర్ సండే ఫైట్ లో భాగంగా రన్ మెషీన్ విరాట్ కొహ్లీకి, కివీ బౌలర్లకు నడుమ ఈ రోజు టగ్-ఆఫ్-వార్ జరుగనుంది.

Advertisement
Update:2023-10-22 09:34 IST

భారత్ -న్యూజిలాండ్ జట్ల సూపర్ సండే ఫైట్ లో భాగంగా రన్ మెషీన్ విరాట్ కొహ్లీకి, కివీ బౌలర్లకు నడుమ ఈ రోజు టగ్-ఆఫ్-వార్ జరుగనుంది...

ప్రపంచకప్ ను వీక్షిస్తున్న కోట్లాదిమంది అభిమానులకు ఈ రోజు భారత్- న్యూజిలాండ్ జట్ల నడుమ జరిగే రౌండ్ రాబిన్ లీగ్ పోరు పసందైన క్రికెట్ విందే కానుంది.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి నాలుగురౌండ్లలో తిరుగులేని విజయాలతో టేబుల్ టాపర్లుగా నిలిచిన న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగే 5వ రౌండ్ పోరు పట్టుగా ..రసపట్టుగా సాగే అవకాశం ఉంది.

విరాట్ కు కివీ పగ్గాలు వేసేనా?

భారత బ్యాటింగ్ ఆర్డర్ కు వెన్నెముకలాంటి విరాట్ కొహ్లీ ను కట్టడి చేయటానికి న్యూజిలాండ్ పేస్, స్పిన్ జోడీతో ద్విముఖ వ్యూహాన్ని అనుసరించనుంది.

2018 సీజన్ తర్వాత అత్యుత్తమ ఫామ్ లో ఉన్న విరాట్..బంగ్లాదేశ్ తో ముగిసిన 4వ రౌండ్ మ్యాచ్ లో 48వ వన్డే శతకాన్ని పూర్తి చేయడం ద్వారా అజేయంగా నిలిచాడు. మరో 8 ఓవర్లు మిగిలిఉండగానే భారత్ కు విరాట్ 7 వికెట్ల విజయం అందించాడు.

257 పరుగుల లక్ష్యసాధన కోసం చేజింగ్ కు దిగిన భారత్ కు విరాట్ కొండంత అండగా నిలిచాడు. 97 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల తో 103 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు.

దూకుడుమీదున్న విరాట్.....

ప్రస్తుత ప్రపంచకప్ మొదటి నాలుగురౌండ్లలో ఆస్ట్ర్రేలియా పైన 85 పరుగులు, అప్ఘనిస్థాన్ పై 55, పాకిస్థాన్ పై 16 పరుగుల స్కోర్లు సాధించిన విరాట్ ..నాలుగోరౌండ్లో అజేయ శతకం సాధించగలిగాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో విరాట్ కొహ్లీ బ్యాటింగ్ తీరు చూస్తుంటే 2018 సీజన్ ను గుర్తుకు తెస్తోందని క్రికెట్ పండితులు అంటున్నారు. 2018 వన్డే క్రికెట్ సీజన్లో 14 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 1202 పరుగులతో అత్యుత్తమంగా రాణించాడు. విరాట్ కెరియర్ లో ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నమోదయ్యింది. 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో విరాట్ చెలరేగిపోయాడు.

2023 సీజన్లోనూ అదేజోరు....

2018 సీజన్లో రాణించిన తీరునే ప్రస్తుత 2023 సీజన్లోనూ విరాట్ కొనసాగిస్తున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 17 మ్యాచ్ ల్లో విరాట్ 871 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు, 4 అర్థశతకాలు ఉన్నాయి.

ప్రస్తుత ప్రపంచకప్ లో భారత టాపార్డర్ కు కవచంలా మారిన విరాట్ కళ్లు చెదిరే స్థాయిలో 67.00 సగటు నమోదు చేశాడు. చేజ్ మాస్టర్ గా పేరున్న విరాట్ కొహ్లీ సత్తాకు న్యూజిలాండ్ బౌలర్లు, ప్రధానంగా స్వింగ్ బౌలర్ టిమ్ సౌథీ, లెఫ్టామ్ స్పిన్నర్ మిషెల్ సాంట్నర్ల నుంచి గట్టిపరీక్ష ఎదురుకానుంది.

విరాట్ కొహ్లీని ఇప్పటికే ఆరుసార్లు అవుట్ చేసిన ఘనత సీనియర్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీకి ఉంది. ఇక ప్రస్తుత సీజన్లో లెఫ్టామ్ స్పిన్నర్ సాంట్నర్ కు విరాట్ ఇప్పటికే రెండుసార్లు చిక్కాడు.

ట్రెంట్ బౌల్ట్ నుంచీ ముప్పు?

న్యూజిలాండ్ ఓపెనింగ్ బౌలర్, లెఫ్టామ్ స్వింగ్ స్పెషలిస్ట్ ట్రెంట్ బౌల్ట్ నుంచీ విరాట్ కొహ్లీకి ముప్పు పొంచి ఉంది. వన్డే మ్యాచ్ ల్లో బౌల్ట్ బౌలింగ్ లో విరాట్ మూడుసార్లు దొరికిపోయాడు.

బౌల్ట్ బౌలింగ్ లో 11 ఇన్నింగ్స్ లో 121 పరుగులు సాధించడం ద్వారా విరాట్ 40.33 సగటుతో నిలిచాడు. ఈ రోజు జరిగే ప్రపంచకప్ పోరులో సైతం బౌల్ట్ రూపంలో విరాట్ కు ముప్పు పొంచి ఉంది.

టాపార్డర్లో విరాట్ రాణించడం పైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా విరాట్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకోక తప్పదు.

Tags:    
Advertisement

Similar News