సూర్య సూపర్..భారత్ కు సూపర్ -4!

ధూమ్ ధామ్ టీ-20 ల్లో భారత నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీల బ్యాటింగ్ జోరుతో భారత్ ఆసియాకప్ సూపర్-4 రౌండ్ కు అర్హత సంపాదించింది.

Advertisement
Update:2022-09-01 08:00 IST

ధూమ్ ధామ్ టీ-20 ల్లో భారత నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీల బ్యాటింగ్ జోరుతో భారత్ ఆసియాకప్ సూపర్-4 రౌండ్ కు అర్హత సంపాదించింది. హాంకాంగ్ ను 40 పరుగులతో చిత్తు చేయడం ద్వారా గ్రూప్- ఏ టాపర్ గా నిలిచింది.

ఏడుసార్లు విజేత భారత్ 2022 ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ కు అలవోకగా చేరుకొంది. గ్రూప్-ఏ లీగ్ లో రెండుకు రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా గ్రూప్ టాపర్ గా నాలుగుజట్ల సూపర్ -4 రౌండ్లో అడుగుపెట్టింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం ముగిసిన ఏకఫక్ష సమరంలో హాంకాంగ్ ను 40 పరుగుల తేడాతో అలవోకగా ఓడించింది.

విరాట్- సూర్య షో...

ఈ మ్యాచ్ లో..టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారతజట్టు ఒకే ఒక్కమార్పుతో పోటీకి సిద్ధమయ్యింది. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చి...తుదిజట్టులో రిషభ్ పంత్ కు చోటు కల్పించింది.

రోహిత్ శర్మ- రాహుల్ లతో కలసి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ను పవర్ ప్లే ఓవర్లలో హాంకాంగ్ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ 13 బాల్స్ లో 2 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 21 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో భారత్ 38 పరుగుల స్కోరు వద్ద తొలివికెట్ నష్టపోయింది.

3500 పరుగుల రోహిత్...

హాంకాంగ్ తో మ్యాచ్ లో 21 పరుగుల స్కోరు సాధించడం ద్వారా...రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 3500 పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచాడు.

తన కెరియర్ లో వరుసగా 7వ ఆసియాకప్ టోర్నీలో ఆడుతున్న 34 సంవత్సరాల రోహిత్ అరుదైన ఈ మైలురాయిని చేరగలిగాడు. రోహిత్ మొత్తం 134 టీ-20 మ్యాచ్ ల్లో

4 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 3500 పరుగుల రికార్డును పూర్తి చేయగలిగాడు.

రోహిత్ స్థానంలో వచ్చిన విరాట్ కొహ్లీతో కలసి మరో ఓపెనర్ రాహుల్ పరుగుల జోరు పెంచడానికి ప్రయత్నించాడు. రాహుల్ 39 బాల్స్ లో 2 సిక్సర్లతో 36 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో 94 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది.

ఆట చివరి 7 ఓవర్లు మాత్రమే మిగిలిఉండగా..360 డిగ్రీల షాట్ల స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి అడుగుపెట్టాడు.

విరాట్ జోరు...సూర్య హోరు...

ఆట మొదటి 13 ఓవర్లలో భారత బ్యాటర్లకు పగ్గాలు వేసిన హాంకాంగ్ బౌలర్లకు సూర్యకుమార్ తన మెరుపుషాట్లతో చుక్కలు చూపించాడు. తొలిబంతి నుంచే దూకుడుగా ఆడుతూ పరుగుల మోత మోగించాడు.

ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ అన్నతేడా లేకుండా తనదైన శైలిలో..ఉత్కంఠభరితమైన షాట్లతో రెచ్చిపోయాడు. అప్పటి వరకూ ఆచితూచి ఆడుతూ వచ్చిన కొహ్లీ సైతం సూర్యప్రతాపం చూసి...తాను సైతం అన్నట్లుగా బ్యాట్ ఝళిపించాడు.

ఈ ఇద్దరూ 3వ వికెట్ కు 98 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.

విరాట్ 31వ హాఫ్ సెంచరీ..

తన కెరియర్ లో 101వ టీ-20 మ్యాచ్ ఆడుతున్న విరాట్ కొహ్లీ 44 బాల్స్ లో ఓ బౌండ్రీ , 3 సిక్సర్లతో 59 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. కొహ్లీకి అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో ఇది 31వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు గత ఆరుమాసాలలో ఇదే తొలిఅర్థశతకం.

మరోవైపు...సూర్యకుమార్ కేవలం 22 బాల్స్ లోనే సుడిగాలి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 4 సిక్సర్లు బాదడం ద్వారా భారతస్కోరు 192 చేరడంలో ప్రధానపాత్ర వహించాడు.

కొహ్లీతో కలసి ఆఖరి 7 ఓవర్లలో 98 పరుగుల అజేయభాగస్వామ్యం నమోదు చేసిన సూర్య 26 బాల్స్ లో 68 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.సూర్య ఆరు బౌండ్రీలు, ఆరు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడు.

హాంకాంగ్ 6 వికెట్లకు 152 పరుగులు

ఆ తరువాత 193 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన హాంకాంగ్ ప్రారంభ ఓవర్లలోనే కెప్టెన్ నిజాఖత్ ఖాన్, యాసిమ్ ముర్తాజా వికెట్లు కోల్పోయినా..వన్ డౌన్ బాబర్ హయాత్ (41 ), రెండోడౌన్ కించిత్ షా ( 30 ),మిడిలార్డర్ ఆటగాడు జీషన్ అలీ 26 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచినా హాంకాంగ్ 6 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత యువఫాస్ట్ బౌలర్లు అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన తమ కోటా 8 ఓవర్లలో 98 పరుగులు ఇవ్వడం భారత టీమ్ మేనేజ్ మెంట్ ను తీవ్రనిరాశకు గురి చేసింది. స్పిన్ జోడీ చహాల్, జడేజా పొదుపుగా బౌల్ చేయగలిగారు.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ విజయంతో సూపర్ -4 రౌండ్ చేరిన రెండోజట్టుగా భారత్ నిలిచింది. గ్రూప్- బీ లీగ్ లో ఆప్ఖనిస్థాన్ రెండుకు రెండుమ్యాచ్ లూ నెగ్గడం ద్వారా సూపర్-4 రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.

సూపర్ -4 రౌండ్ లో భాగంగా ఆదివారం జరిగే మరో సూపర్ ఫైట్ లో భారత్, పాక్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Tags:    
Advertisement

Similar News