ఇంగ్లండ్ తో మొదటి రెండుటెస్టులకూ విరాట్ డుమ్మా!

సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకూ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ దూరమయ్యాడు.

Advertisement
Update:2024-01-22 17:45 IST

ఇంగ్లండ్ తో పాంచ్ పటాకా టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ కు గట్టి దెబ్బ తగిలింది. సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకూ స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ దూరమయ్యాడు.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఈ నెల 25 నుంచి ఇంగ్లండ్ తో జరుగనున్న ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తొలి బంతి పడక ముందే భారత్ కు అనుకోని ఘాతం తగిలింది.

వందకు పైగా టెస్టుల మొనగాడు, పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ లేకుండానే ఆతిథ్య భారత్ మొదటి రెండుటెస్టుల్లో పాల్గొనక తప్పని పరిస్థితి నెలకొంది.

విరాట్...ఎందుకిలా?

ఫిట్ నెస్ కు, నిలకడగా ఆడటానికీ పెట్టింది పేరైన విరాట్ కొహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ లోని మొదటి రండు ( హైదరాబాద్, విశాఖ ) టెస్టులకూ దూరమయ్యాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా జరిగే తొలిటెస్టుతో పాటు.. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరిగే రెండోటెస్టుకూ తాను ఎందుకు దూరమవుతోందీ విరాట్ తన కెప్టెన్ రోహిత్ శర్మకు తెలిపాడని వివరించింది.

ఇటీవలే అప్ఘనిస్థాన్ తో జరిగిన తీన్మార్ టీ-20 సిరీ్స్ లోని తొలి మ్యాచ్ కు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న విరాట్...ఇంగ్లండ్ తో కీలక టెస్టు సిరీస్ లో మాత్రం రెండుటెస్టులకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

అయితే..భారతజట్టుకు క్రమం తప్పకుండా ఆడుతూ వస్తున్న విరాట్ కొహ్లీ అంకితభావాన్ని తాము తప్పు పట్టబోమని, వ్యక్తిగత కారణాలతో దూరం కావాలని కోరుకోడాన్ని గౌరవిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. విరాట్ కొహ్లీ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత అభిమానులు, మీడియాదేనంటూ బీసీసీఐ స్పష్టం చేసింది.

విరాట్ స్థానంలో ఎవరికో చోటు?

దూకుడుమీదున్న ఇంగ్లండ్ జట్టుతో జరిగే కీలక సిరీస్ లోని మొదటి రెండు టెస్టులకూ 'పరుగుల యంత్రం' విరాట్ కొహ్లీ దూరం కావటం భారత్ కు కోలుకోలేని దెబ్బే.

అయితే విరాట్ కు బదులుగా తుదిజట్టులోకి ఎవరిని తీసుకొంటారన్నది చర్చనీయాంశంగా మారింది.

భారత బ్యాటింగ్ ఆర్డర్లో విరాట్ లాంటి కీలక బ్యాటర్ లేకపోడంతో యువబ్యాటర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ , శ్రేయస్ అయ్యర్ ల పైన తీవ్రఒత్తిడి పడే అవకాశం ఉంది.

విరాట్ లేని లోటును పూడ్చగల దమ్ము, అనుభవం ఉన్న బ్యాటర్లు చతేశ్వర్ పూజారా, మాజీ కెప్టెన్ అజింక్యా రహానే మాత్రమే కనిపిస్తున్నారు. ప్రస్తుత రంజీ సీజన్లో నిలకడగా ఆడుతూ 20వేల పరుగుల మైలురాయిని చేరిన వెటరన్ చతేశ్వర్ పూజారాకు విరాట్ స్థానంలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ఒకటి రెండురోజుల్లోనే విరాట్ స్థానంలో ఎవరిని ఎంపిక చేసేది తేలిపోనుంది.

విరాట్ సెంచరీల రికార్డుకు విఘాతమే...

సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న 100 అంతర్జాతీయ శతకాల రికార్డును విరాట్ అధిగమించాలంటే రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో భారత్ ఆడే ప్రతి టెస్టూ కీలకమే. అయితే విరాట్ మాత్రం వ్యక్తిగత కారణాలతో టెస్టుమ్యాచ్ లను చేజార్చుకోడం వంద శతకాల రికార్డును మరింత క్లిష్టం చేస్తుందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

భారత్ తరపున ఇప్పటి వరకూ ఆడిన 113 టెస్టుల్లో విరాట్ 8848 పరుగులు సాధించాడు. మరో 152 పరుగులు సాధించగలిగితే 9వేల టెస్టు పరుగులు సాధించిన నాలుగో భారత బ్యాటర్ గా విరాట్ నిలువగలుగుతాడు.

మాస్టర్ సచిన్ 15వేల 921, మిస్టర్ వాల్ రాహుల్ ద్రావిడ్ 13వేల 288 పరుగులు, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ 10, 122 పరుగులతో మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నారు.

దక్షిణాఫ్రికాతో ఇటీవలే ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ వరకూ ఆడిన 113 టెస్టుల్లో విరాట్ 29 శతకాలు, 7 ద్విశతకాలు, 30 అర్థశతకాలు సాధించాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి 80 శతకాలు బాదిన విరాట్...మాస్టర్ సచిన్ వంద వందల రికార్డును అధిగమించాలంటే మరో 21 సెంచరీలు సాధించాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News