ధర్మశాలలో నేటినుంచే 'రికార్డుల' టెస్ట్!

భారత్- ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ పతాకస్థాయికి చేరింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా నేటినుంచే ఐదురోజులపాటు రికార్డుల మోతతో ఆఖరిపోరు సాగనుంది.

Advertisement
Update:2024-03-07 08:15 IST

భారత్- ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ పతాకస్థాయికి చేరింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా నేటినుంచే ఐదురోజులపాటు రికార్డుల మోతతో ఆఖరిపోరు సాగనుంది.

భారతగడ్డపై గత నెలరోజులుగా ఇంగ్లండ్- భారతజట్ల నడుమ సాగుతున్న ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ పోరు ఉత్కంఠభరిత స్థితికి చేరింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ మొదటి నాలుగు టెస్టులు ముగిసే సమయానికే 3-1తో ఆతిథ్య భారత్ సిరీస్ ఖాయం చేసుకొన్నా నేటినుంచే జరిగే ఆఖరి టెస్టు సైతం ఎనలేని ఉత్కంఠను రేపుతోంది.

హిమాలయ పాదాల చెంత....

ప్రపంచంలోని అత్యంత సుందరమైన క్రికెట్ వేదికల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ స్టేడియం ప్రస్తుత ఈ సిరీస్ లోని ఆఖరిటెస్టుకు ఆతిథ్యమిస్తోంది. హిమాలయ పర్వతపాదాల చెంత..దౌలాధర్ శ్రేణులలో మంచు పర్వతాల నడుమ, ప్రకృతి రమణీయకతతో నిండిన ఈ స్టేడియంలో నేటినుంచి రికార్డుల మహాయుద్ధమే జరుగనుంది.

హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రస్తుత సిరీస్ తొలి టెస్టులో 28 పరుగుల పరాజయం తరువాత నుంచి భారత్ వరుసగా మూడు ( విశాఖపట్నం, రాజకోట, రాంచీ ) టెస్టు విజయాలు సాధించడం ద్వారా సిరీస్ విజయం ఖాయం చేసుకోగలిగింది.

ధర్మశాల వేదికగా జరిగే ఈ ఆఖరి టెస్టులో సైతం భారత్ నెగ్గితే 4-1తో ఐదుమ్యాచ్ ల సిరీస్ నెగ్గిన రెండోజట్టుగా టెస్టు చరిత్రలో నిలిచిపోగలుగుతుంది.

ఎముకలు కొరికే శీతల వాతావరణంలో...

360 డిగ్రీల కోణంలో చుట్టూ మంచు పర్వతాల నడుమ నిర్మించిన ధర్మశాల స్టేడియం వాతావరణం ఇంగ్లండ్ కు ఎంతో అనుకూలంగా కనిపిస్తోంది.శీతల వాతావరణంలో తమ పేస్ బౌలింగ్ ఎటాక్ తో భారత్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.

వెటరన్ స్వింగ్ బౌలర్ జేమ్స్ యాండర్సన్, మెరుపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ తో పాటు స్పిన్ జోడీ టామ్ హార్ట్ లే, షోయబ్ బషీర్ లతో కూడిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్ భారత బ్యాటర్లకు సవాలు విసురుతోంది. స్పిన్నర్ల సంగతి అలాఉంచి..రెండుజట్లకు చెందిన పేస్, స్వింగ్ బౌలర్లు ప్రధానపాత్ర వహించనున్నారు.

బుమ్రా ఇన్...కుల్దీప్ అవుట్?

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు మాత్రం తుదిజట్టు కూర్పు కోసం ఎప్పటిలానే తంటాలు పడుతోంది. ఓ మ్యాచ్ విశ్రాంతి తరువాత తిరిగి జట్టులో చేరిన యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా రాకతో..స్పిన్ జాదూ కుల్దీప్ యాదవ్ లేదా బ్యాటర్ రజత్ పాటిదార్ లలో ఒకరు బెంచ్ కే పరిమితం కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్, అశ్విన్, జడేజాలతో భారత్ బౌలింగ్ ఎటాక్ తో బరిలో నిలిచే అవకాశం ఉంది. కర్నాటక యువబ్యాటర్ దేవదత్ పడిక్కల్ కు ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్యాప్ దక్కినా ఆశ్చర్యపోనక్కరలేదు.

టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగోసారి!

ప్రస్తుత ఈ టెస్టుమ్యాచ్ ద్వారా రెండుజట్ల తరపున చెరో ఆటగాడు తమ వందో టెస్టు క్యాప్ ను అందుకోనున్నారు. భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో తమ కెరియర్ లో వందో మ్యాచ్ ఆడబోతున్నారు.

దశాబ్దాల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్లో రెండు వేర్వేరు జట్లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఒకే మ్యాచ్ ద్వారా వందో టెస్టు ఆడనుండడం ఇది నాలుగోసారి మాత్రమే.

2011లో భారత్ తరపున తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన 37 సంవత్సరాల అశ్విన్ గత 13 సంవత్సరాలుగా ఆడిన 99 టెస్టుల్లో 507 వికెట్లతో పాటు 3 సెంచరీలు సైతం బాదాడు.

భారత్ కు పలు సిరీస్ విజయాలు అందించడమే కాదు..డజన్ల కొద్ది రికార్డులు సైతం నెలకొల్పిన ఘనత అశ్విన్ కు ఉంది. వందో టెస్టు మ్యాచ్ ఆడటం ద్వారా ఈ ఘనత సాధించిన భారత 14వ ఆటగాడిగా అశ్విన్ చరిత్రలో నిలిచిపోనున్నాడు.

ఇంగ్లండ్ కు ఆఖరి టెస్టులోనైనా ...

2012 లో చివరిసారిగా భారత గడ్డపై భారత్ ను కంగుతినిపించిన ఇంగ్లండ్..గత పుష్కరకాలంలో ఒక్క టెస్టు మ్యాచ్ లో మాత్రమే నెగ్గగలిగింది. అదీ ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టులో మాత్రమే. అయితే..మూడు వరుస పరాజయాలతో తరువాత ధర్మశాల టెస్టును నెగ్గడం ద్వారా సిరీస్ ను 2-3తో ముగించాలన్న పట్టుదలతో ఉంది.

ధర్మశాల స్టేడియం పిచ్ పైన కొద్దిరోజుల క్రితమే ఢిల్లీ- హిమాచల్ జట్ల నడుమ ముగిసిన రంజీమ్యాచ్ లో రెండుజట్ల పేసర్లు కలసి 36కు 34 వికెట్లు పడగొట్టిన రికార్డు చూస్తే..ఈ టెస్టు మ్యాచ్ లో సైతం పేస్ బౌలర్ల హవానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

ఈ టెస్టు మ్యాచ్ జరిగే ఐదురోజులూ ఉదయం వేళల్లో మంచుపడటం ఖాయమని వాతావరణశాఖ ప్రకటించింది. మ్యాచ్ తొలి సెషన్ లో బంతి స్వింగ్ కావడంతో బ్యాటర్లకు అసలుసిసలు పరీక్షకానుంది.

వాతావరణం తేమ, మంచుతో ఉండే పక్షంలో తాము ముగ్గురు పేసర్లతో కూడిన ఎటాక్ తో పోటీకి దిగుతామని భారత కెప్టెన్ ఇప్పటికే ప్రకటించడం చూస్తే..ఓ బ్యాటర్ ను పక్కన పెట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

యాండర్సన్ ను ఊరిస్తున్న 700వ వికెట్...

ఇంగ్లండ్ వెటరన్ పేసర్, 41 ఏళ్ళ జేమ్స్ యాండర్సన్ ధర్మశాల వేదికగా మరో 2 వికెట్లు పడగొట్టగలిగితే టెస్టు చరిత్రలో 700 వికెట్లు మైలురాయి చేరిన మూడో బౌలర్ గా రికార్డుల్లో చేరగలుగుతాడు.

గతంలో 700 వికెట్లు పడగొట్టిన టెస్టు బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ మాత్రమే ఉన్నారు. తన సుదీర్ఘ కెరియర్ లో ప్రస్తుత సిరీస్ లోని రాంచీ టెస్టు వరకూ 185 మ్యాచ్ లు ఆడిన జేమ్స్ యాండర్సన్ 698 వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు..అశ్విన్ 37 సంవత్సరాల 172 రోజుల వయసులో వందోటెస్టు ఆడిన భారత తొలి క్రికెటర్ గా నిలువనున్నాడు.

700 పరుగుల క్లబ్ లో చోటుకు యశస్వీ...

ఐదుమ్యాచ్ ల ద్వైపాక్షిక సిరీస్ లో 700 పరుగులు సాధించే అరుదైన అవకాశం భారత కుర్రఓపెనర్, 22 ఏళ్ల యశస్వి జైశ్వాల్ ను ఊరిస్తోంది. ప్రస్తుత సిరీస్ లోని మొదటి నాలుగు టెస్టుల్లోనే రెండు డబుల్ సెంచరీలు బాదిన యశస్వి మరో 29 పరుగులు సాధించగలిగితే అత్యంత వేగంగా వెయ్యి టెస్టు పరుగులు సాధించిన భారత రెండో బ్యాటర్ గా నిలువగలుగుతాడు.

గతంలో వినోద్ కాంబ్లీ కేవలం 9 ఇన్నింగ్స్ లోనే 1000 పరుగుల రికార్డు నెలకొల్పితే..యశస్వీ మాత్రం 14 ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ టెస్టులో సైతం టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం సాహసమే అవుతుంది. పేస్ బౌలర్ల హవాతో సాగనున్న ఈ టెస్టు మ్యాచ్ ప్రస్తుత సిరీస్ కు అందమైన ముగింపే కానుంది.

Tags:    
Advertisement

Similar News