హైదరాబాద్ టెస్టులో భారత్ ను ఊరిస్తున్న విజయం!

హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలిటెస్టులో ఆతిథ్యభారత్ ను విజయం ఊరిస్తోంది.

Advertisement
Update:2024-01-28 13:15 IST

హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలిటెస్టులో ఆతిథ్యభారత్ ను విజయం ఊరిస్తోంది. 231 పరుగుల విజయలక్ష్యంతో భారత్ రెండోఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడుతోంది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా సిరీస్ లోని తొలి టెస్టులో ఆతిధ్య భారత్ ను విజయం ఊరిస్తోంది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేయటం ద్వారా భారత్ ఎదుట 231 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.

ఓలీ పోపే డబుల్ సెంచరీ మిస్.....

తొలిఇన్నింగ్స్ లో 246 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఓపెనర్ ఓలీ పోపే ఫైటింగ్ బ్యాటింగ్ తో 420 పరుగుల భారీస్కోరుతో పుంజుకోగలిగింది.

ఇంగ్లండ్ సాధించిన మొత్తం స్కోరులో పోపే సాధించినవే 196 పరుగులున్నాయి. పోపే మొత్తం 278 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లతో 196 పరుగుల స్కోరుకు భారత వైస్ కెప్టెన్ బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. డబుల్ సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో పోపే వెనుదిరిగాడు.

ఇంగ్లండ్ ఇతర బ్యాటర్లలో ఓపెనర్ జాక్ క్రాలే 31, వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్ 34, రేహాన్ అహ్మద్ 24, టామ్ హార్ట్ లే 34 పరుగుల స్కోర్లతో పోపేకి అండగా నిలిచారు.

పోపే 196 పరుగులు చేయడం ద్వారా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా అత్యధిక స్కోరు సాధించిన విదేశీ బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, జడేజా 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒకవికెట్ పడగొట్టారు.

భారత్ ఎదుట 231 పరుగుల లక్ష్యం....

తొలిఇన్నింగ్స్ లో 170 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ఎదుట ఇంగ్లండ్ 231 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే..స్పిన్ బౌలర్లకు అనువుగా మారిన ఆఖరి రెండురోజుల పిచ్ పైన భారత్ లక్ష్యం చేరాలంటే అత్యుత్తమంగా రాణించక తప్పదు.

ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ మొదటి వికెట్ కు 11.4 ఓవర్లలోనే 42 పరుగుల భాగస్వామ్యంతో శుభరంభాన్ని ఇచ్చారు. అయితే..ఓపెనర్ యశస్వి 15, వన్ డౌన్ శుభ్ మన్ గిల్ డకౌట్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది.

కెప్టెన్ రోహిత్ శర్మ 26, అశ్విన్ 4 పరుగులతో క్రీజులో నిలవడంతో భారత్ విజయానికి 183 పరుగుల దూరంలో నిలిచింది. గెలుపు కోసం భారత టాపార్డర్ చెమటోడ్చక, తుదివరకూ పోరాడక తప్పదు.

హైదరాబాద్ టెస్టుమ్యాచ్ నాలుగోరోజు ఆటకు 25వేల మందికి పైగా అభిమానులు హాజరు కావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News