ఇంగ్లండ్ ను తొలిరోజే చుట్టేసిన భారత స్పిన్ త్రయం!
భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోల కెరియర్ లో 100వ టెస్టుగా నిలిచిన ఈ రికార్డుల మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలింది.
ధర్మశాల టెస్ట్ తొలిరోజుఆట టీ-విరామానికి ముందే ఇంగ్లండ్ కుప్పకూలింది. భారత స్పిన్నర్ల ముప్పేటిదాడిలో గల్లంతయ్యింది.
భారత పర్యటనలో ఇంగ్లండ్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో వేదిక మారినా ఇంగ్లండ్ తలరాత మాత్రం మారడం లేదు.
ఇప్పటికే 1-3తో సిరీస్ చేజార్చుకొన్న ఇంగ్లండ్..ధర్మశాల వేదికగా ప్రారంభమైన ఆఖరి (5వ) టెస్టులో సైతం కీలక టాస్ నెగ్గినా విఫలం కాక తప్పలేదు.
పేస్, స్వింగ్ బౌలర్లకు అనువుగా ఉన్న వాతావరణం , పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్నా ఇంగ్లండ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.
భారత స్పిన్నర్ల ముప్పేటదాడి.....
భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోల కెరియర్ లో 100వ టెస్టుగా నిలిచిన ఈ రికార్డుల మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలింది.
టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ కు దిగిన భారత పేసర్లు బుమ్రా, సిరాజ్ అద్భుతంగా బౌల్ చేసినా ఇంగ్లండ్ ఓపెనర్లు నిలదొక్కుకోగలిగారు. క్రాలే- డకెట్ జోడీ మొదటి వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తరువాతే భారత్ తొలి వికెట్ పడగొట్టగలిగింది.
డకెట్ మొత్తం 58 బంతులు ఎదుర్కొని 4 బౌండ్రీలతో 27 పరుగుల స్కోరుకు స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్ లో గిల్ పట్టిన క్యాచ్ కు చిక్కాడు. ఆ తరువాత వన్ డౌన్ ఓలీ పోపీతో కలసి క్రాలే స్కోరును 100 పరుగులకు చేర్చాడు.
కుల్దీప్ స్పిన్ మ్యాజిక్......
భారత లెఫ్టామ్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ మాయలో వన్ డౌన్ పోపీ, ఓపెనర్ క్రాలే గల్లంతయ్యారు. పోపీ 11 పరుగులకే స్టంపౌట్ కాగా...108 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్ తో 79 పరుగుల స్కోరుకు క్రాలే అవుటయ్యాడు. కుల్దీప్ బౌలింగ్ లో క్రాలే క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు.
ఒకదశలో 175 పరుగుల స్కోరుకు 3 వికెట్లు మాత్రమే నష్టపోయిన ఇంగ్లండ్ ఆ వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 194 స్కోరుకే 8 వికెట్లు నష్టపోయింది.
సీనియర్ బ్యాటర్ జో రూట్ 26, 100వ టెస్ట్ ఆడుతున్న బెయిర్ స్టో 29, కెప్టెన్ స్టోక్స్ డకౌట్ గా అవుటయ్యారు.
ఇంగ్లండ్ కెప్టెన్ ను పెవీలియన్ దారి పట్టించడం ద్వారా కుల్దీప్ 5 వికెట్ల రికార్డుతో పాటు 50 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.
రూట్ ను జడేజా అవుట్ చేయగా..లోయర్ ఆర్డర్ బ్యాటర్లు టామ్ హార్ట్ లే, మార్క్ వుడ్, వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్, జిమ్మీ యాండర్సన్ లను అశ్విన్ అవుట్ చేశాడు.
భారత స్పిన్నర్లలో కుల్దీప్ కు 5, అశ్విన్ కు 4, జడేజాకు 1 వికెట్ దక్కాయి.
ఇంగ్లండ్ తన ఆఖరి 5 వికెట్లు కేవలం 7 ఓవర్ల వ్యవధిలో 8 పరుగులకే నష్టపోడంతో..218 పరుగుల స్కోరుకే కుప్పకూలక తప్పలేదు.
భారత ఓపెనర్ల బ్యాటింగ్ జోరు...
తొలిరోజు ఆఖరి సెషన్ ప్రారంభంలోనే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియడంతో..భారత ఓపెనింగ్ జోడీ రోహిత్- యశస్వీ జోరుగా పరుగుల వేట మొదలు పెట్టారు.
యశస్వి 3, రోహిత్ 2 సిక్సర్లు బాదడం ద్వారా ఇంగ్లండ్ బౌలర్లను ఒత్తిడిలో పడేశారు.
యువ ఓపెనర్ యశస్వి 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో ముందుగా అర్థశతకం సాధించడం ద్వారా తొలి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యంతో భారీస్కోరుకు పునాది వేయగలిగాడు. 57 పరుగుల స్కోరుకే బాషిర్ బౌలింగ్ లో యశస్వి స్టంపౌట్ కావడంతో భారత్ 104 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది.
తొలిఇన్నింగ్స్ లో భారత్ 150కి పైగా పరుగుల ఆధిక్యత సాధించగలిగితే వరుసగా నాలుగో టెస్ట్ విజయంతో పాటు 4-1తో సిరీస్ ను కైవసం చేసుకోగలుగుతుంది.
మొత్తం మీద పేస్- స్వింగ్ బౌలర్ల అడ్డాలో భారత స్పిన్ త్రయం తమ సత్తా చాటుకోడం ధర్మశాల టెస్టు తొలిరోజు ఆట హైలైట్ గా మిగిలిపోతుంది.