ఓవల్ లో భారత వ్యూహం బెడిసి కొట్టిందా?

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ వ్యూహం బెడిసి కొట్టినట్లే కనిపిస్తోంది.కంగారూ జోడీ స్టీవ్ స్మిత్- ట్రావిస్ హెడ్ 4వ వికెట్ కు 251 పరుగుల అజేయభాగస్వామ్యంతో తమజట్టును పటిష్టస్థితిలో నిలిపారు.

Advertisement
Update: 2023-06-08 05:31 GMT

ఓవల్ లో భారత వ్యూహం బెడిసి కొట్టిందా?

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ వ్యూహం బెడిసి కొట్టినట్లే కనిపిస్తోంది.కంగారూ జోడీ స్టీవ్ స్మిత్- ట్రావిస్ హెడ్ 4వ వికెట్ కు 251 పరుగుల అజేయభాగస్వామ్యంతో తమజట్టును పటిష్టస్థితిలో నిలిపారు.....

ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ప్రారంభమైన ప్రపంచ టెస్టు లీగ్ చాంపియన్షిప్ ఫైనల్లో నలుగురు ఫాస్ట్ బౌలర్ల భారత వ్యూహం బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది.

తొలిరోజు ఆట లంచ్ విరామం తర్వాత నుంచి ఎండకాయటంతో భారత బౌలర్లు నీరుకారిపోడం, కంగారూ మిడిలార్డర్ బ్యాటర్లు చెలరేగిపోడం జరిగిపోయాయి.

అశ్విన్ ను పక్కనపెట్టి భారీమూల్యం చెల్లించారా?

ఇంగ్లండ్ వాతావరణాన్ని తప్పుగా అంచనావేసి భారత్ మరోసారి భారీమూల్యం చెల్లించే ప్రమాదం కొని తెచ్చుకొంది. ఓవల్ వేదికగా ప్రారంభమైన ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్ తొలిరోజుఆటను..టాస్ నెగ్గడం ద్వారా భారత్ చక్కగా ప్రారంభించింది. దీనికితోడు ఆస్ట్ర్రేలియా ఓపెనింగ్ జోడీ ఉస్మాన్ క్వాజా- డేవిడ్ వార్నర్ లతో పాటు వన్ డౌన్ లబుషేన్ లను సైతం తక్కువ స్కోర్లకే పెవీలియన్ దారి పట్టించడం ద్వారా మ్యాచ్ పై భారత్ పట్టు బిగించినట్లే కనిపించింది. అయితే..కంగారూజోడీ స్టీవ్ స్మిత్- ట్రావిడ్ హెడ్ నాలుగో వికెట్ కు అజేయ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో భారత్ పై పైచేయి సాధించగలిగారు.

టెస్టుజరిగే ఐదురోజుల్లో మూడురోజులపాటు శీతలవాతావరణం ఉండడంతో పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో..ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల వ్యూహాన్ని పక్కనపెట్టి..నలుగురు పేసర్లు, సింగిల్ స్పిన్నర్ వ్యూహాన్ని భారత్ ఎంచుకొంది. ఈ వ్యూహం ప్రకారం తుదిజట్టులో జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కకుండా పోయింది.

స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ కు బదులుగా తుదిజట్టులో పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు చోటు కల్పించారు. లంచ్ విరామం తర్వాత నుంచి వాతావరణం బ్యాటింగ్ కు అనువుగా మారిపోడంతో..కంగారూజోడీ స్మిత్- హెడ్ శివమెత్తిపోయారు.

నాలుగో వికెట్ కు 251 పరుగుల అజేయభాగస్వామ్యంతో భారత బౌలింగ్ ఎటాక్ ను ఓ ఆటాడుకొన్నారు.

ట్రావిడ్ హెడ్ సూపర్ సెంచరీ.....

ఐదో డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ట్రావిడ్ హెడ్ దూకుడుగా ఆడుతూ భారత బౌలింగ్ ఎటాక్ ను కకావికలు చేశాడు. వికెట్ నుంచి ఎలాంటి మద్దతు లేకపోడంతో భారత బౌలింగ్ ఎటాక్ చేష్టలుడిగిపోయింది.

లంచ్ విరామానికి ముందే..సిరాజ్, షమీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టినా ..ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్, జట్టులోని ఏకైక స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

ట్రావిస్‌ హెడ్‌ ధాటిగా ఆడుతూ 156 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్ తో 146 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. మరోవైపు.. మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఎనలేని ఏకాగ్రతతో ఆడి 227 బంతుల్లో 14 బౌండ్రీలతో 95 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు.

నాలుగో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో ఆస్ట్ర్రేలియా 3 వికెట్ల నష్టానికి 327 పరుగుల స్కోరుతో తొలిరోజు ఆటను విజయవంతంగా ముగించగలిగింది.

అంతకుముందు..డాషింగ్ ఓపెనర్ ఉస్మాన్‌ ఖవాజా డకౌటయ్యాడు. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బౌండ్రీలతో 43, వన్ డౌన్ మార్నుస్ లబుషేన్ 26 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు.

భారత బౌలర్లలో షమీ, సిరాజ్, శార్దూల్ తలో వికెట్ పడగొట్టారు. తొలిరోజుఆట మొదటి సెషన్ లో మాత్రమే భారత్ పైచేయి సాధిస్తే..మిగిలిన రెండు సెషన్లలో ఆస్ట్ర్రేలియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

రెండోరోజు ఆటలో భారత బౌలర్లు పుంజుకొని బౌల్ చేయకపోతే..ఆస్ట్ర్రేలియా 500కు పైగా స్కోరుతో మ్యాచ్ పై పట్టు బిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాతావరణాన్ని బట్టే తుదిజట్టు ఎంపిక..

తమ తుదిజట్టులో జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు కల్పించకపోడాన్ని భారత బౌలింగ్ కోచ్ పరస్ మాంబ్రే గట్టిగా సమర్థించుకొన్నాడు. అశ్విన్ లాంటి చాంపియన్ బౌలర్ ను పక్కనపెట్టడం బాధాకరమేనని..కేవలం పిచ్, వాతావరణ పరిస్థితులను బట్టి తుదిజట్టులోకి నలుగురు ఫాస్ట్ బౌలర్లను తీసుకోవాల్సి వచ్చిందని, అదనపు పేసర్ అవసరం కారణంగానే..అదనపు స్పిన్నర్ అశ్విన్ కు చోటు కల్పించలేకపోయామని..తొలిరోజు ఆట ముగిసిన అనంతరం భారత బౌలింగ్ కోచ్ తెలిపాడు.

అశ్విన్ ను కాదని తప్పు చేశారు...రికీ పాంటింగ్

టెస్టు లీగ్ లో భాగంగా మొత్తం 13 టెస్టులు ఆడి 61 వికెట్లు పడగొట్టిన జాదూ బౌలర్ అశ్విన్ ను పక్కన పెట్టి భారత్ పెద్దతప్పే చేసిందని ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చెప్పాడు.

తుదిజట్టులో అశ్విన్ ఉండి ఉంటే..తన అనుభవానికి తెలివితేటల్ని జోడించి ఒకటి లేదా రెండు వికెట్లు పడగొట్టి ఉండేవాడేనని, తెలివైన బౌలర్ అశ్విన్ ను పక్కన పెట్టడం కంటే తెలివితక్కువ నిర్ణయం మరొకటి లేదని తేల్చి చెప్పారు.

భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి సైతం.. పిచ్, వాతావారణంతో సంబంధం లేకుండా..తుదిజట్టులో అశ్విన్ కు చోటు కల్పించాల్సిందేనని కొద్దిరోజుల క్రితమే సలహా ఇచ్చినా ..భారత టీమ్ మేనేజ్ మెంట్ పెడచెవిన పెట్టింది.

రెండోరోజుఆటలో..భారత బౌలర్లు తమ బౌలింగ్ తీరును మెరుగు పరచుకోకుంటే..మ్యాచ్ ను ఆస్ట్ర్రేలియాకు అప్పజెప్పినట్లే అవుతుంది.

Tags:    
Advertisement

Similar News