పాపం!పూజారా..వందో టెస్టులో డకౌట్!
భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారాకు వందోటెస్టు చేదుఅనుభవంగా మిగిలింది.
భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారాకు వందోటెస్టు చేదుఅనుభవంగా మిగిలింది. ఢిల్లీ టెస్టులో ఏడు బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగాల్సి వచ్చింది...
టెస్టు క్రికెట్లో వందో మ్యాచ్ ఆడే అరుదైన అవకాశం అతికొద్దిమందికి మాత్రమే దక్కుతుంది. జీవితకాలంలో కనీసం ఒక్కటెస్టు ఆడినా జన్మధన్యమైనట్లుగానే... బ్యాట్ లేదా బంతి పట్టిన ప్రతి క్రికెటరూ భావించడం సహజం.
ఇక..మ్యాచ్ వెంట మ్యాచ్ ఆడుతూ వందోటెస్టు మ్యాచ్ వరకూ వచ్చిన ఆటగాడు అత్యుత్తమంగా రాణించడం ద్వారా..శతటెస్టుమ్యాచ్ ను చిరస్మరణీయంగా మిగుల్చుకోవాలని భావించడమూ అంతే సహజం.
అయితే..వందో టెస్టుమ్యాచ్ ఆడిన భారత 13వ క్రికెటర్ గా న్యూఢిల్లీ టెస్టు ద్వారా రికార్డుల్లో చేరిన నయావాల్ చతేశ్వర్ పూజారా..ఖాత తెరవకుండానే పెవీలియన్ దారి పట్టాల్సి వచ్చింది..
భారత రెండో క్రికెటర్ పూజారా...
భారత టెస్టు చరిత్రలో వందోమ్యాచ్ ఆడుతూ డకౌటైన రెండో క్రికెటర్ గా పూజారా నిలిచాడు. ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టు ద్వారా..తన వందోటెస్టు బరిలోకి పూజారా దిగాడు.
టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పూజారా తన తండ్రి, భార్య, కుమార్తెతో కలసి జ్ఞాపిక అందుకొన్నాడు. తన కెరియర్ మొదటి 99 టెస్టుల్లో 19 శతకాలు , 7వేలకు పైగా పరుగులు సాధించిన పూజారా..వందోటెస్టును వంద పరుగుల స్కోరుతో ముగించాలని కోరుకొన్నాడు. అయితే..తాను ఒకటి తలస్తే..విధిరాత మరొకటి తలచినట్లుగా పరిస్థితి తయారయ్యింది.
టెస్టుమ్యాచ్ రెండోరోజున ఓపెనర్ రాహుల్ అవుట్ కావడంతో బ్యాటింగ్ కు దిగిన పూజారా..ఏడు బంతులు ఎదుర్కొని..చివరకు ఆస్ట్ర్రేలియా ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు.
ఆరుగురు క్రికెటర్లకు చేదుఅనుభవం...
తన కెరియర్ లో వందో టెస్టుమ్యాచ్ ఆడుతూ పరుగులేవీ చేయకుండా డకౌటైన భారత రెండో క్రికెటర్ గా పూజారా రికార్డుల్లో చేరాడు. భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ తన వందోటెస్టు ఆడుతూ డకౌట్ అయ్యాడు.
టెస్టు చరిత్రలో వందో టెస్టు ఆడుతూ డకౌటైన ఆరో బ్యాటర్ గా పూజారా నిలిచాడు. ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్, ఇంగ్లండ్ ఓపెనర్ అలీస్టర్ కుక్ , న్యూజిలాండ్ మాజీ కెప్టెన్లు బ్రెండన్ మెకల్లమ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తమ వందో టెస్టుమ్యాచ్ ఆడుతూ డకౌట్లుగా వెనుదిరిగినవారిలో ఉన్నారు.
వందోటెస్టు ఆడుతూ శతకాలు బాదిన క్రికెటర్లు సైతం లేకపోలేదు.