ఒకే దెబ్బకు మూడు పిట్టలు, నేడే మూడోటెస్ట్!

ఐసీసీ టెస్‌ లీగ్ లో భాగంగా టెస్ట్ క్రికెట్ మొదటి రెండుర్యాంకుల్లో నిలిచిన ఆస్ట్ర్రేలియా- భారతజట్ల నాలుగుమ్యాచ్ ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో కీలక సమరానికి ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం ముస్తాబయ్యింది.

Advertisement
Update:2023-03-01 09:50 IST

ఒకే దెబ్బకు మూడు పిట్టలు, నేడే మూడోటెస్ట్!

నాలుగుమ్యాచ్ ల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోని కీలక మూడోటెస్టుకు ఇండోర్ లో రంగం సిద్ధమయ్యింది. ఈ మ్యాచ్ లో నెగ్గితే ఆతిథ్య భారత్ ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టిన ఘనతను దక్కించుకోగలుగుతుంది.......

ఐసీసీ టెస్‌ లీగ్ లో భాగంగా టెస్ట్ క్రికెట్ మొదటి రెండుర్యాంకుల్లో నిలిచిన ఆస్ట్ర్రేలియా- భారతజట్ల నాలుగుమ్యాచ్ ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో కీలక సమరానికి ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం ముస్తాబయ్యింది.

మొదటి రెండుటెస్టుల్లో అలవోక విజయాలు సాధించడం ద్వారా ఇప్పటికే సిరీస్ ను ఖాయం చేసుకొన్న భారత్ వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేయటానికి తహతహలాడుతోంది.

ఒక్కగెలుపుతో మూడు ఘనతలు...

నాగపూర్, ఢిల్లీ టెస్టుమ్యాచ్ ల్లో కంగారూ టీమ్ ను మొదటి మూడురోజుల ఆటలోనే చిత్తు చేసిన భారత్..ఇండోర్ టెస్టులో సైతం నెగ్గే పక్షంలో ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్ బెర్త్ ను నేరుగా సొంతం చేసుకోగలుగుతుంది. అంతేకాదు..3-0తో సిరీస్ ను గెలుచుకోడంతో పాటు టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ లో సైతం నిలువగలుగుతుంది.

పరుగుల గనిగా పేరుపొందిన ఇండోర్ హోల్కార్ స్టేడియం పిచ్ కు బ్యాటర్ల స్వర్గధామంగా పేరుంది. దేశంలోని మిగిలిన స్టేడియాలతో పోల్చిచూస్తే కురుచ బౌండ్రీలైన్, మెరుపువేగంతో కూడిన అవుట్ ఫీల్డ్ , లంచ్ విరామం నుంచి భగభగలాడే ఎండవేడిమి వాతావరణంలో ఈ ఐదురోజుల సమరం జరుగనుంది.

ఓపెనర్ గా శుభ్ మన్ గిల్లా..రాహులా?

మొదటి రెండుటెస్టుల్లో విజేతగా నిలిచిన జట్టునే ప్రస్తుత మూడోటెస్టులో సైతం భారత్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే..గత పది టెస్టు ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమై, వైస్ కెప్టెన్సీ హోదాను సైతం కోల్పోయిన కెఎల్ రాహుల్ ను ఓపెనర్ గా కొనసాగిస్తారా? లేక..సూపర్ ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ కు అవకాశమిస్తారా? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.

అసాధారణ ప్రతిభ కలిగిన రాహుల్ కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్నదే భారత టీమ్ మేనేజ్ మెంట్ ఉద్దేశంగా కనిపిస్తోంది. కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా, రెండోడౌన్ విరాట్ కొహ్లీ, మూడో డౌన్ శ్రేయస్ అయ్యర్ భారీస్కోర్లకు గురిపెట్టారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు తమ స్థాయికి తగ్గట్టు ఆడినా ఆస్ట్ర్రేలియాకు కష్టాలు తప్పవు. పైగా..కెప్టెన్ రోహిత్ శర్మను 17వేల అంతర్జాతీయ పరుగులు, విరాట్ కొహ్లీని స్వదేశీ టెస్టు సిరీస్ ల్లో 4వేల పరుగుల రికార్డులు ఊరిస్తున్నాయి.

కంగారూజట్టుకు కొత్త కెప్టెన్.....

సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లో ఘోరపరాజయాలు పొందిన ఆస్ట్ర్రేలియాకు సారథ్యం వహించిన పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోడంతో..జట్టు పగ్గాలను మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కు కంగారూ టీమ్ మేనేజ్ మెంట్ అప్పజెప్పింది. పైగా..కమిన్స్ స్థానంలో మెరుపు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, ఆల్ రౌండర్ కమెరూన్ గ్రీన్ తుదిజట్టులో చేరడం ఖాయం గా కనిపిస్తోంది.

అయితే..ముగ్గురు స్పిన్నర్లను జట్టులో కొనసాగిస్తుందా లేక ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో పాటు తుదిజట్టులోకి అదనపు బ్యాటర్ ను చేర్చుకొంటుందా? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.

కీలకం కానున్న టాస్....

టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ఖాయమనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో 400కు పైగా పరుగులు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి రెండుటెస్టుల్లో టాస్ నెగ్గిన కంగారూ టీమ్ పరాజయాలు చవిచూసింది. టాస్ ఓడినా భారతజట్టు మాత్రం కేవలం మూడురోజుల ఆటలోనే విజేతగా నిలువగలిగింది.

రెండో ఇన్నింగ్స్ లో ఇండోర్ వేదికగా జట్టు ఏదైనా 250కి పైగా లక్ష్యాన్ని చేధించడం అంత తేలికకాదు. దీనికితోడు ఎర్రమట్టితో తయారు చేసిన పిచ్ కాకుండా..నల్లమట్టితో సిద్ధం చేసిన పిచ్ ను ఈమ్యాచ్ కు ఉపయోగించనుండడంతో...పేస్ బౌలర్లతో పాటు స్పిన్ బౌలర్లకు సైతం అనుకూలం కానుంది.

మొదటి రెండుటెస్టులకు భిన్నంగా మ్యాచ్ ఐదురోజులూ పోరు కొనసాగుతుందా? లేక మొదటి మూడు లేదా నాలుగురోజుల్లోనే ఆట ముగిసిపోతుందా? తెలుసుకోవాలంటే

నేటినుంచి మూడురోజులపాటు మ్యాచ్ ను ఆసక్తితో గమనించక తప్పదు.

Tags:    
Advertisement

Similar News