నేడే ఆఖరి టీ-20, సిరీస్ స్వీప్ కు భారత్ గురి!

బెంగళూరు వేదికగా ఈ రోజు జరిగే ఆఖరి మ్యాచ్ లోనూ నెగ్గడం ద్వారా భారత్ సిరీస్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

Advertisement
Update:2024-01-17 10:24 IST

ప్రపంచకప్ కు సన్నాహకంగా భారత్- అప్ఘన్ జట్ల మధ్య జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ ముగింపు దశకు చేరింది. బెంగళూరు వేదికగా ఈ రోజు జరిగే ఆఖరి మ్యాచ్ లోనూ నెగ్గడం ద్వారా భారత్ సిరీస్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

2024- టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా టాప్ ర్యాంకర్ భారత్, 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ జట్ల నడుమ జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ షో బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి చేరింది.

ఏకపక్షంగా సాగుతున్న ఈ సిరీస్ లో ఇప్పటికే మొదటి రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా 2-0తో పైచేయి సాధించిన ఆతిథ్య భారత్ 3-0 విజయంతో విజేతగా నిలవాలని భావిస్తోంది.

తుదిజట్టులో మూడు మార్పులు...

రోహిత్ శర్మనాయకత్వంలోని భారతజట్టు ఈ ఆఖరి పోరు కోసం తుదిజట్టులో మూడుమార్పులతో పోటీకి దిగనుంది. మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ అవకాశం దక్కని వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ ఆవేశ్ ఖాన్ లకు అవకాశమివ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన అక్షర్ పటేల్ మరోసారి కీలకపాత్ర పోషించనున్నాడు. అయితే..వరుసగా రెండుమ్యాచ్ ల్లో డకౌట్లుగా వెనుదిరిగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భారీస్కోరుతో సిరీస్ ను ముగించాలన్న కసితో ఉన్నాడు.

ధోనీ రికార్డును అధిగమించే చాన్స్....

టీ-20 ఫార్మాట్లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును గత మ్యాచ్ విజయంతో సమం చేసిన రోహిత్ శర్మ...ఈరోజు జరిగే పోటీలో సైతం నెగ్గితే 42 విజయాలతో సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. ఇప్పటికే 150 టీ-20 మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్..డాషింగ్ ఓపెనర్ గా ఓ భారీ ఇన్నింగ్స్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

పరుగుల గని బెంగళూరు...

సిరీస్ లోని ఈ ఆఖరి పోరుకు వేదికగా ఉన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి భారీస్కోర్ల వేదికగా పేరుంది. బ్యాటింగ్ కు అనువుగా ఉండే ఇక్కడి పిచ్ పైన పరుగుల వర్షం కురవటం ఖాయమని, రెండుజట్లలోని స్ట్ర్రోక్ మేకర్లకు చేతినిండా పనేనని క్యూరేటర్ చెబుతున్నారు.

టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్నజట్టు ఒత్తిడిలేకుండా ఆడగలిగితే 180 నుంచి 200 వరకూ పరుగులు సాధించే అవకాశం లేకపోలేదు. ఇంగ్లండ్ తో 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు ముందు జరుగుతున్న ఈ చివరి టీ-20 మ్యాచ్ ను భారత స్టార్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు.

బెంగళూరు వేదికగా 2017 తర్వాత నుంచి జరిగిన టీ-20 మ్యాచ్ ల్లో పేస్ బౌలర్లు 32 వికెట్లు పడగొడితే స్పిన్నర్లు 15 వికెట్లు మాత్రమే సాధించగలిగారు. భారతజట్టు చివరిసారిగా బెంగళూరు వేదికగా ఆస్ట్ర్రేలియాతో ఆడిన మ్యాచ్ లో 160 పరుగుల స్కోరును కాపాడుకోగలిగింది. స్పిన్ జోడీ అక్షర్ పటేల్, రవి బిష్నోయ్ ఆ మ్యాచ్ లో భారత్ ను విజేతగా నిలిపారు.

అప్ఘనిస్థాన్ కు కనీసం ఒక్క గెలుపైనా?

లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ లేని లోటుతో సతమతమవుతున్న 10వ ర్యాంకర్ అఫ్ఘనిస్థాన్ కనీసం ఆఖరి మ్యాచ్ లోనైనా విజయం సాధించడం ద్వారా ఓదార్పు పొందాలని ఆశిస్తోంది. అయితే..పవర్ ఫుల్ భారతజట్టును ఎదుర్కొనడం శక్తికి మించిన భారమే అయినా స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే గట్టిపోటీ ఇవ్వగలమని అప్ఘన్ కోచ్ జోనాథన్ ట్రాట్ అంటున్నారు.

అప్ఘన్ స్పిన్ త్రయం ముజీబుర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీలపైనే జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. బ్యాటింగ్ లో గుర్జాబ్, ఇబ్రహీం జడ్రాన్, గుల్బుద్దీన్ నైబ్,అజం తుల్లా ఓమర్ జియా పూర్తిస్థాయిలో రాణించగలిగితే భారత బౌలర్లకు పరీక్ష తప్పదు.

ఒకవేళ ఈరోజుమ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గితే ముందుగా బ్యాటింగ్ ఎంచుకొనే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు మంచుబెడదలేనట్లే.

స్వదేశంలో భారత్ ఆడిన గత 15 టీ-20 సిరీస్ ల్లో అజేయంగా నిలవడమే కాదు..రోహిత్ శర్మ నాయకత్వంలో వరుసగా 13 సిరీస్ లు నెగ్గడం విశేషం.

Tags:    
Advertisement

Similar News