భారత మహిళలకూ ఇక హాకీ లీగ్!

భారత మహిళల కోసం ప్రత్యేకంగా ఓ హాకీలీగ్ ను ప్రారంభించనున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.

Advertisement
Update: 2024-08-26 08:07 GMT

భారత మహిళల కోసం ప్రత్యేకంగా ఓ హాకీలీగ్ ను ప్రారంభించనున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.

జనాభా పరంగా ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలలో ఒకటైన భారత్ లో పలు రకాల క్రీడల కోసం ప్రత్యేకంగా లీగ్ లను నిర్వహిస్తూ వస్తున్నారు. ఫుట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, కుస్తీ, టేబుల్ టెన్నిస్ ..ఇలా ప్రతిక్రీడకూ ప్రత్యేకంగా ఓ లీగ్ అంటూ ఉంది. జాతీయక్రీడ హాకీలో సైతం పురుషులకు మాత్రమే ఇప్పటి వరకూ ప్రో లీగ్ నిర్వహిస్తూ వస్తున్నారు.

అయితే..మహిళా విభాగంలో సైతం త్వరలో ఓ లీగ్ ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కే అధికారికంగా ప్రకటించారు.

హాకీలీగ్ తో యువక్రీడాకారులకు ఊతం..

మహిళలకు సైతం ఇండియా హాకీ లీగ్ ను నిర్వహించడం ద్వారా ప్రమాణాలను మెరుగుపరచవచ్చునని దిలీప్ టిర్కే చెప్పారు. హాకీ లీగ్ ద్వారా ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు తమ సత్తా చాటుకొనే అవకాశం దక్కుతుందని, అంతర్జాతీయ క్రీడాకారులతో కలసి దేశవాళీ క్రీడాకారులు ఆడటంతో ఎంతో నేర్చుకోగలుగుతారని చెప్పారు.

భారతజట్టులో చోటు దక్కించుకోడానికి గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు హాకీ లీగ్ ఓ వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు.

ఒడిషా ప్రభుత్వానికి హ్యాట్సాఫ్.....

జాతీయక్రీడ హాకీని గత కొద్దిసంవత్సరాలుగా సాకుతూ వచ్చిన ఒడిషా ప్రభుత్వానికి జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లుగా హాకీ ఇండియాకు ఒడిషా ప్రభుత్వం దన్నుగా నిలుస్తూ వచ్చిందని, 100 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసిందని గుర్తు చేశారు.

భువనేశ్వర్, రూర్కెలా నగరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియాలను, మౌలిక సదుపాయాలను కల్పించడంతో పలు అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించే అవకాశం దక్కిందని గుర్తు చేశారు. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారతజట్టు సభ్యులకు 15 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి అందించడం వెనుక ఒడిషా ప్రభుత్వం ప్రముఖపాత్ర పోషించింది.

గత నాలుగేళ్లలో రెండు ఒలింపిక్ పతకాలు...

అంతర్జాతీయ హాకీలో భారత పురుషులజట్టు గత ఐదేళ్లుగా అత్యంత నిలకడగా రాణిస్తూ వస్తోందని, 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్ తో పాటు ఆసియా క్రీడల్లోనూ భారత్ పతకాలు సాధించడం ద్వారా ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకొందని దిలీప్ టిర్కే కొనియాడారు.

1980 మాస్కో ఒలింపిక్స్ లో చివరిసారిగా పతకం గెలుచుకొన్న భారత్ ఆ తరువాత మరో ఒలింపిక్స్ పతకం కోసం 41 సంవత్సరాలపాటు నిరీక్షించాల్సి వచ్చిందని, మిడ్ ఫీల్డర్ మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో టోక్యో ఒలింపిక్స్ కాంస్యం, హర్మన్ ప్రీత్ నేతృత్వంలో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాలు సాధించిన ఘనత భారతజట్టుకు మాత్రమే దక్కుతుందని అన్నారు.

భారత్ కు 2028 ఒలింపిక్స్ కీలకం....

వచ్చేనాలుగు సంవత్సరాలు భారత పురుషుల, మహిళల హాకీకి ఎంతో కీలకమని..2028 ఒలింపిక్స్ కు ముందు జరిగే ఆసియాక్రీడలు, ప్రపంచ హాకీ పోటీలు భారత హాకీకి అత్యంత ప్రధానమని, హాకీ ఇండియా లీగ్ ల ద్వారా క్రీడాకారులకు తగిన ప్రాక్టీసుతో పాటు ప్రమాణాలు మెరుగుపడటానికి ఉపయోగపడుతుందని దిలీప్ టిర్కే తెలిపారు.

దశాబ్దాల చరిత్ర కలిగిన ఒలింపిక్స్ చరిత్రలో 8 బంగారు పతకాలు సాధించిన ఒకే ఒక్కజట్టు భారత్ మాత్రమేనని, భారత హాకీకి గొప్పవారసత్వం ఉందని, ఆ పరంపరను కొనసాగించాల్సిన బాధ్యత హాకీ ఇండియాపైన ఎంతో ఉందని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News