ఆఖరి టెస్టుపై భారత్ పట్టు!

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఆఖరి రోజు ఆటలో మరో 8 వికెట్లు పడగొడితే 2-0తో సిరీస్ స్వీప్ సాధించగలుగుతుంది...

Advertisement
Update:2023-07-24 16:00 IST

ఐసీసీ టెస్టు లీగ్‌లో భాగంగా వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండవ(ఆఖరి )టెస్టుపై భారత్ పట్టు బిగించింది. క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియంలో వరుణ దేవుడి దోబూచులాటల నడుమ సాగుతున్న ఈ టెస్టు నెగ్గాలంటే రెండో ఇన్నింగ్స్ లో 365 పరుగులు చేయాల్సిన ఆతిథ్య వెస్టిండీస్ 2 వికెట్లకు 76 పరుగులతో పోరాడుతోంది. ఈ రోజు జరిగే ఆటలో భారత్ మరో 8 వికెట్లు పడగొట్టినా..లేదా వెస్టిండీస్ 269 పరుగులు సాధించినా విజేతగా నిలువగలుగుతాయి.

రోహిత్- ఇషాన్ ధనాధన్ హాఫ్ సెంచరీలు...

వెస్టిండీస్‌ను తొలి ఇన్నింగ్స్ లో 255 పరుగులకే పరిమితం చేసిన భారత్..భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించి 2 వికెట్లకు 181 పరుగుల స్కోరుతో డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ఎదుట 365 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.

అంతకుముందు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 60 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించడంతో కరీబియన్ జట్టు 255 పరుగుల స్కోరుకే ఆలౌటయ్యింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- యశస్వి జైశ్వాల్ రికార్డు భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.

రోహిత్ కేవలం 35 బంతుల్లోనే సుడిగాలి హాఫ్ సెంచరీ సాధించగా..యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనే 52 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. గత 20 సంవత్సరాల టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా, 12.2 ఓవర్లలోనే వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. రోహిత్- యశస్వి జోడీ కేవలం 75 బంతుల్లోనే తమ జట్టుకు 100 పరుగుల స్కోరు అందించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పారు.

అశ్విన్ డబుల్ స్ట్రయిక్...

365 పరుగుల విజయలక్ష్యంతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది. కెప్టెన్ బ్రాత్ వెయిట్ 28, కిర్క్ మెకంజీ పరుగులేవీ చేయకుండా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో చిక్కారు. మరో ఓపెనర్ తేజ్ నారాయణ్ చంద్రపాల్ 24, బ్లాక్ వుడ్ 20 పరుగుల నాటౌట్ స్కోర్లతో పోరాడుతున్నారు. ఆఖరి రోజుఆటలో 90 ఓవర్లలో కరీబియన్ జట్టు మరో 269 పరుగులు సాధించడం కత్తిమీద సాము లాంటిదే.

మరోవైపు..పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనువుగా ఉండడంతో అశ్విన్, జడేజాలకు చేతినిండా పనే అని చెప్పక తప్పదు. వరుణదేవుడు కరుణిస్తే భారత్ విజయం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Tags:    
Advertisement

Similar News