టీ-20 విజయాలలో పాక్ ను మించిన భారత్
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో అత్యధిక అంతర్జాతీయ విజయాలు సాధించిన జట్టుగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో అత్యధిక అంతర్జాతీయ విజయాలు సాధించిన జట్టుగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. పాక్ జట్టు గతేడాది నెలకొల్పిన రికార్డును భారత్ అధిగమించింది...
అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో టాప్ ర్యాంకర్ భారత్ తన దూకుడు కొనసాగిస్తోంది. ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్ర్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ ను 2-1తో నెగ్గడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.
21 విజయాలతో సరికొత్త రికార్డు..
టీ-20 ఫార్మాట్లో గతేడాది 20 మ్యాచ్ లు నెగ్గడం ద్వారా రెండోర్యాంకర్ పాకిస్థాన్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును భారత్ ప్రస్తుత సీజన్లో అధిగమించింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన ఆఖరి, మూడో మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల విజయం సాధించడం ద్వారా..ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక విజయాలు సాధించినజట్టుగా నిలిచింది. ప్రస్తుత ఏడాదిలో భారత్ కు ఇది 21వ గెలుపు కావడం విశేషం. ఇప్పటి వరకూ పాకిస్థాన్ పేరుతో ఉన్న 20 విజయాల రికార్డు ను భారత్ 21 విజయాలతో తెరమరుగు చేసింది.
ఈ నెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడుమ్యాచ్ ల సిరీస్ లో భారత్ విజయాలు సాధించగలిగితే తన రికార్డును తానే అధిగమించుకొనే అవకాశం ఉంది.
చేజింగ్ కింగ్ భారత్...
టీ-20 ఫార్మాట్లో చేజింగ్ విజయాలు సాధించడంలో భారత్ తనకుతానే సాటిగా నిలిచింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లో భారత్ మొత్తం 14సార్లు
చేజింగ్ కు దిగడం ద్వారా 13సార్లు విజేతగా నిలిచింది.లక్ష్యచేధనలో ఒక్కసారి మాత్రమే విఫలమయ్యింది.
హైదరాబాద్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన మ్యాచ్ లో 186 పరుగుల టార్గెట్ ను చేరుకోడం ద్వారా నాలుగో అత్యుత్తమ చేజింగ్ రికార్డును చేరుకోగలిగింది. ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా 2013లో రాజ్ కోట వేదికగా 202, 2016లో సిడ్నీ వేదికగా 198, 2020లో సిడ్నీ వేదికగానే 195 పరుగుల లక్ష్యాలను చేధించిన ఘనత భారత్ కు ఉంది
కొహ్లీని మించిన రోహిత్...
టీ-20 ఫార్మాట్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత కెప్టెన్ రికార్డు ఇప్పటికీ మహేంద్రసింగ్ ధోనీ పేరుతోనే చెక్కుచెదరకుండా ఉంది. ధోనీ కెప్టెన్ గా భారత్ 42 టీ-20 మ్యాచ్ ల్లో విజయాలు సాధించింది.
అయితే...మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న 32 విజయాల రికార్డును..ప్రస్తుత హైదరాబాద్ మ్యాచ్ విజయం ద్వారా రోహిత్ శర్మ (33) అధిగమించాడు. అత్యధిక టీ-20 విజయాలు సాధించిన భారత కెప్టెన్ల వరుసలో రోహిత్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.