ఆసియా చాంపియన్స్ ట్రోఫీహాకీలో భారత్ బోణీ!

2023- ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ భారీవిజయంతో టైటిల్ వేటను ప్రారంభించింది. చైనా 7-2 గోల్స్ తో చిత్తు చేసింది.

Advertisement
Update:2023-08-04 12:15 IST

ఆసియా చాంపియన్స్ ట్రోఫీహాకీలో భారత్ బోణీ!

2023- ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ భారీవిజయంతో టైటిల్ వేటను ప్రారంభించింది. చైనా 7-2 గోల్స్ తో చిత్తు చేసింది.

చైనా వేదికగా జరిగే ఆసియాక్రీడలకు సన్నాహకంగా జరుగుతున్న 2023- ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో మాజీ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది.

చెన్నై లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈటోర్నీలో ఆసియాలోని టాప్ ర్యాంక్ జట్లన్నీ పోటీపడుతున్నాయి.

భారత జోరుకు చైనా బేజారు..

ఆసియా అత్యుత్తమజట్లు భారత్, జపాన్, పాకిస్థాన్, కొరియా, మలేసియా, చైనాజట్ల నడుమ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో జరుగుతున్న ఈటోర్నీ ప్రారంభమ్యాచ్ లో మాజీ చాంపియన్ భారత్ 7-2 గోల్సుతో చైనాను చిత్తు చేసింది.

ఏకపక్షంగా సాగిన ఈపోరులో ఆతిథ్య భారత్ ఆట ముదటి భాగం ముగిసే సమయానికే 6-2 గోల్స్ స్కోరుతో పైచేయి సాధించింది. ఆట మూడో క్వార్టర్ లో మరో గోలు చేయటం ద్వారా భారత్ తన ఆధిక్యాన్ని 7-2కు పెంచుకోగలిగింది.

ఆట ఆఖరి క్వార్టర్లో రెండుజట్లకూ పలుమార్లు గోల్స్ చేసే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాయి.

హర్మన్ ప్రీత్, వరుణ్ షో..

భారత్ తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్ చెరో రెండుగోల్స్ సాధించారు. ఆట మొదటి క్వార్టర్ 5, 8 నిముషాలలో లభించిన పెనాల్టీకార్నర్లను కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోల్స్ గా మలచి 2-0 ఆధిక్యాన్ని అందించాడు.

వరుణ్ ఆట 19, 30 నిముషాలలో గోల్స్ సాధించగా..15వ నిముషంలో సుఖ్ జీత్ సింగ్, 16వ నిముషంలో ఆకాశ్ దీప్ సింగ్, 40వ నిముషంలో మన్ దీప్ సింగ్ తలోగోలు సాధించారు.

చైనా ఆటగాళ్లలో వెన్ హ్యూ ఆట 18వ నిముషంలోనూ, జీషెంగ్ గావో ఆట 25వ నిముషంలోను గోల్స్ నమోదు చేశారు. రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా జరిగే రెండోమ్యాచ్ లో జపాన్ తో భారత్ తలపడనుంది. ఆగస్టు 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ పోటీపడాల్సి ఉంది.

మూడుసార్లు విజేత భారత్..

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో భారత్ మూడుసార్లు విజేతగా నిలిచింది. 2011, 2016లో చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ గా నిలిచిన భారత్ 2018 పాకిస్థాన్ తో కలసి సంయుక్త విజేతగా నిలిచింది.

2021 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో సెమీస్ దశలోనే జపాన్ చేతిలో ఓటమి పొందిన భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత టోర్నీలో మాత్రం బంగారు పతకం సాధించగలమన్న ధీమా భారతజట్టులో కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News