వెయిట్ లిఫ్టింగ్ లో జెర్మీ, అచింట షో.. పతకాల పట్టిక 6వ స్థానంలో భారత్

బ్యాడ్మింటన్ మిక్సిడ్ సెమీస్ కు భారత్ అలవోకగా చేరుకొంది. స్క్వాష్ పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాలలో భారత క్రీడాకారుల విజయపరంపర కొనసాగుతోంది.

Advertisement
Update:2022-08-01 08:56 IST

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్ మూడోరోజు పోటీలలోనూ భారత వెయిట్ లిఫ్టర్ల బంగారు వేట కొనసాగింది. యువలిఫ్టర్లు జెర్మీ లాల్ రినుంగా, అచింట షీయూలీ తమ తమ విభాగాలలో బంగారు పతకాలు సాధించడం ద్వారా భారత్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. పురుషుల హాకీ, మహిళల క్రికెట్లో సైతం భారతజట్లు తొలివిజయాలు నమోదు చేశాయి. బ్యాడ్మింటన్ మిక్సిడ్ సెమీస్ కు భారత్ అలవోకగా చేరుకొంది. స్క్వాష్ పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాలలో భారత క్రీడాకారుల విజయపరంపర కొనసాగుతోంది.

జెర్మీ గోల్డెన్ లిఫ్ట్..

కామన్వెల్త్ గేమ్స్ మహిళ వెయిట్ లిఫ్టింగ్ తొలిరోజు పోటీలలో మీరాబాయి చాను బంగారు పతకంతో బోణీ కొడితే..మూడోరోజు పోటీల పురుషుల విభాగంలో భారత కుర్రాళ్లు 19 సంవత్సరాల జెర్మీ, అచింటా స్వర్ణపతకాలతో అదేజోరు కొనసాగించారు. పురుషుల 67 కిలోల విభాగంలో మేఘాలయ కుర్రాడు..మొత్తం మూడు విభాగాలలోనూ 300 కిలోల బరువు ఎత్తడం ద్వారా గేమ్స్ సరికొత్త రికార్డుతో బంగారు పతకం సాధించాడు. కంబైన్డ్ స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాలలో జెర్మీ సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.

అచింట అదరహో!

పురుషుల 73 కిలోల విభాగంలో బెంగాల్ కుర్రాడు అచింట షీయూలీ అంచనాలకు మించి రాణించడం ద్వారా మొత్తం 313 కిలోల సరికొత్త రికార్డుతో స్వర్ణపతకం సాధించాడు. స్నాచ్ విభాగంలో 143 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 170 కిలోల రికార్డులు నమోదు చేశాడు. అచింట విజయంతో భారత్ మొదటి మూడురోజుల పోటీలు ముగిసే సమయానికి కేవలం వెయిట్ లిఫ్టింగ్ ద్వారానే ఆరు పతకాలు సాధించినట్లయ్యింది. ఇందులో మూడు గోల్డ్‌, రెండు సిల్వ‌ర్‌, ఓ బ్రాంజ్ పతకం ఉన్నాయి.

ఈత ఫైనల్లో నటరాజన్..

పురుషుల ఈత బ్యాక్ స్ట్రోక్ 50 మీటర్ల విభాగంలో శ్రీహరి నటరాజన్ ఫైనల్స్ కు అర్హత సాధించాడు. మరో ఏడుగురు అత్యుత్తమ స్విమ్మర్లతో మెడల్ రౌండ్లో తలపడనున్నాడు. పురుషుల హాకీ గ్రూప్ లీగ్ తొలిమ్యాచ్ లో భారత్ భారీవిజయం నమోదు చేసింది. హాకీలో ఆఫ్రికా పసికూన ఘనాను 11-0 గోల్స్ తో చిత్తు చేసి పతకం వేటను మొదలు పెట్టింది. పురుషుల హాకీ బంగారు పతకం రేసులో ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ , మలేసియా లాంటి మేటిజట్లతో భారత్ తలపడాల్సి ఉంది.



బ్యాడ్మింటన్ సెమీస్ లో భారత్..

బాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ విభాగం సెమీఫైనల్స్ కు భారతజట్టు అలవోకగా చేరుకొంది. క్వార్టర్ ఫైనల్ రౌండ్ పోరులో దక్షిణాఫ్రికాను భారత్ 3-0తో చిత్తు చేసింది. మహిళల, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ అంశాలతో కూడిన మిక్సిడ్ టీమ్ విభాగం మొదటి మూడుమ్యాచ్ ల్లోనూ భారత క్రీడాకారులు నెగ్గడంతో ఆఖరి రెండు పోటీలు ఆడకుండానే భారత్ మెడల్ రౌండ్ చేరగలిగింది.

క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ గోశాల్..

స్క్వాష్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత స్టార్ ప్లేయర్ సౌరవ్ గోశాల్ చేరుకొన్నాడు. కెనడా ఆటగాడు డేవిడ్ బెలార్జియన్ వరుస సెట్లలో చిత్తు చేయడం ద్వారా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్ లో జోత్స్న చిన్నప్ప సైతం క్వార్టర్స్ కు అర్హత సంపాదించింది.

క్రికెట్లో తొలివిజయం..

కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా క్రికెట్ గ్రూప్- ఏ లీగ్ పోరులో భారత్ తొలివిజయం నమోదు చేసింది. బర్మింగ్ హామ్ యూనివర్శిటీ గ్రౌండ్స్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన రెండోరౌండ్ పోరులో భారత్ 8 వికెట్ల అలవోక విజయం నమోదు చేసింది. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది. గ్రూప్ లీగ్ ఆఖరిరౌండ్ పోరులో బార్బడోస్ ను భారత్ ఓడించగలిగితినే నాకౌట్ రౌండ్ చేరే అవకాశం ఉంది.

పతకాల పట్టిక 6వ స్థానంలో భారత్..

కామన్వెల్త్ గేమ్స్ మొదటి మూడురోజుల పోటీలు ముగిసే సమయానికి పతకాల పట్టిక 6వ స్థానంలో భారత్ నిలిచింది. భారత్ మొత్తం మూడు స్వర్ణ, 2 రజత, 1 కాంస్య పతకాలు సాధించింది. ఈ పతకాలన్నీ వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో సాధించినవే కావడం విశేషం. ఇక..ఆస్ట్ర్రేలియా 52 పతకాలు, ఇంగ్లండ్ 34, న్యూజిలాండ్ 18 పతకాలతో మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికా, కెనడా నాలుగు, ఐదు స్థానాలలో నిలిచాయి. స్కాట్లాండ్ 7, మలేసియా8, నైజీరియా 9, వేల్స్ 10 స్థానాలలో ఉన్నాయి. ప్రస్తుత ఈ గేమ్స్ 11 రోజులపాటు జరుగనున్నాయి.

Tags:    
Advertisement

Similar News