ఆరో గెలుపుతో ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ భారత్ చేరుకొంది. రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా ఆరో గెలుపుతో లీగ్ టేబుల్ టాపర్ గా నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ భారత్ చేరుకొంది. రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా ఆరో గెలుపుతో లీగ్ టేబుల్ టాపర్ గా నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది.
సొంతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతోంది. మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో ఆరుకు ఆరుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా రోహిత్ సేన విజయాల డబుల్ హ్యాట్రిక్ తో నాకౌట్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.
'హిట్ మ్యాన్' సూపర్ హిట్!
బ్యాటింగ్ కు అంతగా అనువుకాని బౌలర్ల అడ్డా లక్నో ఏక్నా స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో జరిగిన 6వ రౌండ్ పోరులో ఆతిథ్య భారత్ కు ఎదురేలేకపోయింది.
బ్యాటింగ్,బౌలింగ్ విభాగాలలో అత్యుత్తమంగా రాణించడం ద్వారా గత టోర్నీ విజేత ఇంగ్లండ్ ను 100 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ లోస్కోరింగ్ షోలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
రోహిత్- రాహుల్ కీలక భాగస్వామ్యం...
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా గత రెండుదశాబ్దాల కాలంలో వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో భారత్ నెగ్గడం ఇదే మొదటిసారి. ఈ కీలకపోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ ను ఇంగ్లండ్ బౌలర్లు దెబ్బ మీద దెబ్బ కొడుతూ తీవ్రఒత్తిడిలో పడవేశారు.
యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 9, వన్ డౌన్ విరాట్ కొహ్లీ డకౌట్ కాగా..రెండో నంబర్ శ్రేయస్ అయ్యర్ 4 పరుగులకే వెనుదిరగడంతో భారత్ మొదటి 11 ఓవర్లలోనే 40 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. అయితే ..కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ 4వ వికెట్ కు 91 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు.
రోహిత్ వీలు చిక్కినప్పుడల్లా భారీషాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. మరోవైపు రాహుల్ 58 బంతుల్లో 3 బౌండ్రీలతో 39 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో భారత్ నాలుగో వికెట్ నష్టపోయింది.
6వ నంబర్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తో కలసి రోహిత్ 5వ వికెట్ కు 33 పరుగుల మరో కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు.
రోహిత్ 101 బంతుల్లో 10 బౌండ్రీలు, 3 భారీసిక్సర్లతో 87 పరుగుల స్కోరుకు లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత నుంచి లోయర్ ఆర్డర్ ఆటగాళ్లతో కలసి సూర్యకుమార్ తన పోరాటం కొనసాగించాడు.
సూర్య 47 బంతుల్లోనే 4 ఫోర్లు, ఓ సిక్సర్ తో 49 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో...జట్టు భారం టెయిల్ ఎండర్లపైన పడింది. బుమ్రా ( 16 ), కుల్దీప్ యాదవ్ ( 9 ) తమవంతుగా కీలక పరుగులు సాధించడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగుల స్కోరు సాధించగలిగింది.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 33 పరుగులిచ్చి 2 వికెట్లు, డేవిడ్ విల్లీ 45 పరుగులిచ్చి 3 వికెట్లు, స్పిన్నర్ రషీద్ 35 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు.
నిప్పులు చెరిగిన భారత పేసర్లు...
మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 230 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు భారత పేస్ జోడీ బుమ్రా-షమీ ఫ్లడ్ లైట్ల వెలుగులోనే చుక్కలు చూపించారు.
ఓపెనర్లు బెయిర్ స్టో- మలన్ మొదటి వికెట్ కు 30 పరుగుల భాగస్వామ్యం అందించిన తరువాత వికెట్ల పతనం ప్రారంభమయ్యింది.
ఫాస్ట్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బౌలింగ్ తో వీరవిహారం చేశారు. పవర్ ప్లే ( మొదటి 10 ) ఓవర్లలోనే చెరో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ను కోలుకోనివ్వకుండా చేశారు.
స్పిన్ జాదూ కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ బాల్ తో ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేయడంతో వరుసగా ఆరో గెలుపు భారత్ ఖాయమైపోయింది. మిడిలార్డర్ బ్యాటర్ లైమ్ లివింగ్ స్టోన్ 46 బంతుల్లో 2 బౌండ్రీలతో 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరకు ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలి..100 పరుగుల ఘోరపరాజయం చవిచూసింది. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ 2, జడేజా1 వికెట్ పడగొట్టారు.
ఆరుగురు ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు క్లీన్ బౌల్డ్ చేయడం మరో అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.
గత 20 ఏళ్లలో ఇదే తొలిగెలుపు...
గత రెండుదశాబ్దాల కాలంలో ఇంగ్లండ్ పై వన్డే ప్రపంచకప్ లో భారత్ కు ఇదే తొలివిజయం కావడం విశేషం. ప్రస్తుత ఈ మ్యాచ్ వరకూ రెండుజట్లూ 1996 నుంచి తొమ్మిదిసార్లు తలపడితే 4-4 విజయాలతో సమఉజ్జీగా నిలిచాయి. మరోమ్యాచ్ టైగా ముగిసింది.
డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ వేటకు దిగిన ఇంగ్లండ్ కు గత ఆరురౌండ్లలో ఇది 5వ ఓటమి కాగా..వరుసగా నాలుగో పరాజయం. 1992 ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఆస్ట్ర్రేలియా వరుసగా నాలుగు పరాజయాలు పొందిన తరువాత..అదే చెత్త రికార్డును ఇంగ్లండ్ ప్రస్తుత ప్రపంచకప్ లో మూటగట్టుకోవాల్సి వచ్చింది.
35 ఓవర్లకు ముందే మూడుసార్లు ఆలౌట్....
రౌండ్ రాబిన్ లీగ్ గత మూడురౌండ్ల మ్యాచ్ ల్లో ఇంగ్లండ్ 35 ఓవర్లకు ముందే ఆలౌట్ కావడం మరో రికార్డు. దక్షిణాఫ్రికాపై 22 ఓవర్లలో 170 పరుగులకు, శ్రీలంకపై 25.4 ఓవర్లలో 156 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లండ్ ను భారత్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ చేయగలిగింది.
మొదటి 10 రౌండ్లలో ఆరుకు ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా భారత్ లీగ్ టేబుల్ టాపర్ గా సెమీస్ చేరిన తొలిజట్టుగా నిలిచింది. 7వ రౌండ్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడాల్సి ఉంది. చివరి రెండురౌండ్లలో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో భారత్ పోటీపడనుంది.