ఇంగ్లండ్ తో మహిళా టెస్టులో భారత్ పట్టు!
ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టుమ్యాచ్ లో భారీవిజయానికి భారత్ గట్టి పునాది వేసుకొంది. 473 పరుగుల ఆధిక్యంతో పట్టు బిగించింది.
ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టుమ్యాచ్ లో భారీవిజయానికి భారత్ గట్టి పునాది వేసుకొంది. 473 పరుగుల ఆధిక్యంతో పట్టు బిగించింది.
స్వదేశీ గడ్డపై తొమ్మిదేళ్ల విరామం తరువాత తొలిసారిగా టెస్టుమ్యాచ్ ఆడుతున్న భారత మహిళాజట్టు రెండోరోజుఆట ముగిసే సమయానికే భారీఆధిక్యంతో విజయానికి మార్గం సుగమం చేసుకొంది.
నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటి్ల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఈ నాలుగురోజుల మ్యాచ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 186 పరుగులతో ఓవరాల్ గా తన ఆధిక్యాన్ని 473 పరుగులకు పెంచుకోగలిగింది.
దీప్తి డబుల్..ఇంగ్లండ్ కు ట్రబుల్...
తొలిరోజు ఆటలో 7వికెట్లకు 410 పరుగుల స్కోరు సాధించిన భారత్..రెండోరోజు ఆటను కొనసాగించి 428 పరుగుల భారీస్కోరుకు ఆలౌటయ్యింది. ఆల్ రౌండర్ దీప్తి శర్మ 113 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, ఓ సిక్సర్ తో 67 పరుగుల స్కోరుకు వెనుదిరిగింది. భారత బ్యాటర్లలో నలుగురు హాఫ్ సెంచరీలు సాధించగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ 49 పరుగుల స్కోరుకు రనౌటయ్యింది.
పూజా వస్త్రకర్ 10 పరుగులతో నాటౌట్ గా మిగిలింది. ఇంగ్లీష్ బౌలర్లలో లారెన్ బెల్, ఈకెల్ స్టీన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
136 పరుగులకే ఇంగ్లండ్ ప్యాకప్...
భారత్ భారీస్కోరుకు సమాధానంగా తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం 36.3 ఓవర్లలో 136 పరుగులకే పేకమేడలా కూలిపోయింది. భారత స్పిన్నర్ దీప్తి శర్మ స్పిన్ జాదూలో ఇంగ్లండ్ బ్యాటర్లు గల్లంతయ్యారు. దీప్తి 5.3 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీ, బౌలింగ్ లో 5 వికెట్లు పడగొట్టిన రెండో ఆల్ రౌండర్ గా రికార్డుల్లో చేరింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్కీవియర్ బ్రంట్ 59 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. స్నేహ రాణా 2 వికెట్లు, రేణుకా సింగ్, పూజా వస్త్రకర్ చెరో వికెట్ పడగొట్టారు.
1985లో న్యూజిలాండ్ పై శుభాంగీ కులకర్ణీ 79 పరుగుల స్కోరు సాధించడంతో పాటు 99 పరుగులకే 6 వికెట్లు పడగొడితే..38 సంవత్సరాల విరామం తరువాత ఇంగ్లండ్ పై దీప్తి శర్మ 67 పరుగుల స్కోరుతో పాటు 5వికెట్లు పడగొట్టడం ద్వారా శుభాంగీ సరసన నిలిచింది.
292 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆథిక్యత..
ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే ఆలౌట్ చేయడంతో భారత్ కు 292 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 42 ఓవర్లలో 6 వికెట్ల నష్టానకి 186 పరుగుల స్కోరుతో నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 44, పూజా వస్త్రకర్ 17 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో ఉన్నారు.
ఓపెనర్లు స్మృతి మందన 26, షెఫాలీ వర్మ 33, జెమీమా 27, దీప్తి శర్మ 20 పరుగులకు వెనుదిరిగారు. 473 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో మూడోరోజు ఆటను భారత్ కొనసాగించి ప్రత్యర్థి ఎదుట 500 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచే అవకాశం ఉంది.
ఇప్పటి వరకూ ఇంగ్లండ్ తో ఆడిన 14 టెస్టుల్లో ఒక్క ఓటమి మాత్రమే చవిచూసిన భారత్ ప్రస్తుత ఈ టెస్టులో భారీవిజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.