అయ్యారే! రెండోవన్డేలో భారత్ భలేగెలుపు!

దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ విజయావకాశాలను ఆతిథ్య భారత్ సజీవంగా నిలుపుకొంది.

Advertisement
Update:2022-10-10 11:18 IST

దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ విజయావకాశాలను ఆతిథ్య భారత్ సజీవంగా నిలుపుకొంది. నెగ్గితీరాల్సిన రెండోవన్డేలో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చెలరేగిపోడంతో భారత్ 7 వికెట్ల అలవోక విజయంతో సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది...

భారత్- దక్షిణాప్రికాజట్ల మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. రాంచీలోని జార్కండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన కీలక రెండోవన్డేలో భారత్ 7 వికెట్ల విజయం సాధించడం ద్వారా సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి 1-1తో సమఉజ్జీగా నిలువగలిగింది.

టాస్ నెగ్గి మ్యాచ్ ఓడిన దక్షిణాఫ్రికా

లక్నో వేదికగా ముగిసిన తొలివన్డే విజయంతో 1-0తో సిరీస్ లో పైచేయి సాధించిన సఫారీటీమ్...నిర్ణయాత్మక రెండోవన్డేలో కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంది. వన్ డౌన్ ఆటగాడు హెండ్రిక్స్ 74, రెండోడౌన్ బ్యాటర్ మర్కరమ్ 79 పరుగుల స్కోర్లు సాధించడంతో 50 ఓవర్లలో 7 వికెట్లకు 278 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది. స్టార్ ఆటగాళ్లు డికాక్ 5, క్లాసెన్ 30 పరుగులకే వెనుదిరిగారు.

భారత బౌలర్లలో పేసర్ సిరాజ్ 3 వికెట్లు, సుందర్. షాబాజ్, కుల్దీప్, శార్ధూల్ తలో వికెట్ పడగొట్టారు.

ఇషాన్- అయ్యర్ షో....

279 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే కెప్టెన్ శిఖర్ ధావన్13, శుభ్ మన్ గిల్ 28 వికెట్లు నష్టపోయింది. అయితే ..వన్ డౌన్ ఆటగాడు ఇషాన్ కిషన్, రెండో డౌన్ శ్రేయస్ అయ్యర్ మూడో వికెట్ కు భారీభాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు.

48 పరుగులకే 2 వికెట్లు నష్టపోయిన భారత్ ను 34.3 ఓవర్లలో 209 పరుగులకు తీసుకెళ్లారు. యువఆటగాడు ఇషాన్ కిషన్ 84 బాల్స్ లో 4 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 93 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో భారత్ మూడో వికెట్ నష్టపోయింది.

మరోవైపు ..వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌండ్రీల వెల్లువతో చెలరేగిపోయాడు. కేవలం 103 బాల్స్ లోనే మెరుపుసెంచరీ సాధించాడు. అయ్యర్- సంజు శాంసన్ జోడీ నాలుగో వికెట్ కు 74 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ కు 45.5 ఓవర్లలోనే 7 వికెట్ల విజయం అందించారు.

శ్రేయస్ అయ్యర్ 111 బాల్స్ లో 15 ఫోర్లతో 113 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. సంజు శాంసన్ ఒక్కో ఫోర్, సిక్సర్ తో 30 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో పోర్టుయిన్, రబాడా, పార్నెల్ తలో వికెట్ పడగొట్టారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిరీస్ లోని ఆఖరివన్డే...న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అక్టోబర్ 11న జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News