కివీఖేల్ ఖతం, భారత్ కే వన్డే సిరీస్...
కొత్తసంవత్సరంలో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు వరుసగా రెండో వన్డే సిరీస్ గెలుచుకొంది. రాయ్ పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన కీలక రెండోవన్డేలో భారత్ 8 వికెట్లతో అలవోక విజయం సాధించింది.
కొత్తసంవత్సరంలో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు వరుసగా రెండో వన్డే సిరీస్ గెలుచుకొంది. రాయ్ పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన కీలక రెండోవన్డేలో భారత్ 8 వికెట్లతో అలవోక విజయం సాధించింది.
2023 వన్డే ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ సన్నాహాలు టాప్ గేర్ కు చేరుకొన్నాయి. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ న్యూజిలాండ్ తో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికే భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంతో రెండోసిరీస్ ఖాయం చేసుకొంది.
భారత పేసర్ల షో...
రాయపూర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మొట్టమొదటి అంతర్జాతీయ వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.
రాయ్ పూర్ వాతావరణం, వికెట్ పేస్ బౌలర్లకు అనువుగా ఉండడంతో భారత పేసర్ల త్రయం మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, హార్థిక్ పాండ్యా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొన్నారు.
సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్వింగ్ కు మెరుపువేగాన్ని జోడించి న్యూజిలాండ్ టాపార్డర్ ను కకావికలు చేశాడు. ఇన్, అవుట్ స్వింగర్లతో వికెట్ వెంట వికెట్ పడగొట్టి ఉక్కిరిబిక్కిరి చేశాడు.
రెండోఎండ్ లో బౌలింగ్ కు దిగిన మహ్మద్ సిరాజ్ సైతం తనదైన శైలిలో బంతులు విసురుతూ కివీలను కోలుకోనివ్వకుండా చేశాడు. న్యూజిలాండ్ 15 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
భారత్ పై మూడో అత్యల్పస్కోరు..
న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. మిడిలార్డర్ బ్యాటర్లు గ్లెన్ ఫిలిప్స్ 36, బ్రేస్ వెల్ 22, సాంట్నర్ 27 మినహా ఏ ఒక్కఆటగాడు రెండంకెల స్కోరు సాధించలేకపోయాడు.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు, సిరాజ్ , హార్థిక్ పాండ్యా చెరో 2 వికెట్లు, స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.
హిట్ మ్యాన్ ధనాధన్ హాఫ్ సెంచరీ...
109 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ 14.2 ఓవర్లలోనే 72 పరుగులతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.
కెప్టెన్ రోహిత్ శర్మ 51 బంతుల్లోనే 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ కు వన్డే క్రికెట్లో ఇది 48వ అర్థశతకం కావడం విశేషం.
శుభ్ మన్ గిల్ 53 బంతుల్లో 40 పరుగుల నాటౌట్ స్కోరు సాధించగా..విరాట్ కొహ్లీ 11 పరుగులకు అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
భారత్ 20.1 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని చేరి 8 వికెట్ల విజయంతో సిరీస్ ఖాయం చేసుకోగలిగింది.
భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరి వన్డే ఇండోర్ వేదికగా మంగళవారం జరుగనుంది.
2023 సీజన్ లో శ్రీలంకపై తొలిసిరీస్ ను 3-0తో సాధించిన భారత్ ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ లో సైతం 2-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.