రేపటి నుంచే భారత్- న్యూజిలాండ్ వన్డే వార్!
భారత్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా టాప్ ర్యాంకర్ న్యూజిలాండ్, 3వ ర్యాంకర్ భారత్ జట్ల తీన్మార్ సిరీస్ కు కివీల్యాండ్ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.
భారత్ వేదికగా వచ్చే ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా టాప్ ర్యాంకర్ న్యూజిలాండ్, 3వ ర్యాంకర్ భారత్ జట్ల తీన్మార్ సిరీస్ కు కివీల్యాండ్ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. అక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగే తొలివన్డేలో రెండుజట్లూ ఢీకోనున్నాయి...
2022 టీ-20 ప్రపంచకప్ ముగియడంతోనే...అగ్రశ్రేణిజట్లన్నీ 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలు మొదలు పెట్టాయి. ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా మారాయి. ఓ వైపు కంగారూగడ్డపై ఇంగ్లండ్-ఆస్ట్ర్రేలియాజట్లు తలపడుతుంటే...కివీగడ్డపై న్యూజిలాండ్ తో భారత్ మూడుమ్యాచ్ ల సిరీస్ లో పోటీపడనుంది.
భారతజట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం..
న్యూజిలాండ్ తో జరిగే మూడుమ్యాచ్ ల వన్డే్ సిరీస్ లో భారతజట్టుకు డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఓపెనర్ రాహుల్ లకు విశ్రాంతి నివ్వడంతో జట్టులో పలువురు యువఆటగాళ్లకు చోటు కల్పించారు.
ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలిపోరు అక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికగా శుక్రవారం ( భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ) ప్రారంభంకానుంది.
సిరీస్ లోని రెండో వన్డే 27న హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగానూ, మూడో వన్డే, 30న క్ర్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ గ్రౌండ్స్ వేదికగా జరుగనున్నాయి.
సంజు, ఉమ్రాన్ కు చోటు దొరికేనా?
కివీస్ తో ముగిసిన మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో కనీసం ఒక్కమ్యాచ్ ఆడే అవకాశం దక్కని డాషింగ్ బ్యాటర్ సంజు శాంసన్, యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కనీసం వన్డే సిరీస్ లోనైనా తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు.
జట్టులోని ఇతర ఆటగాళ్లలో శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చహాల్, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్ ఉన్నారు.
టీ-20 సిరీస్ లో పాల్గొన్న వెటరన్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఓపెనర్ ఇషాన్ కిషన్ స్వదేశానికి పయనమయ్యారు.
పవర్ ఫుల్ టీమ్ తో కివీస్...
స్వదేశీ పిచ్ లపైన అత్యంత ప్రమాదకరమైన జట్టుగా పేరుపొందిన టాప్ ర్యాంకర్ న్యూజిలాండ్ కు కేన్ విలియమ్స్ సన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఫిన్ అలెన్, డేవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిషెల్, మైకేల్ బ్రేస్ వెల్, జేమ్స్ నీషమ్, మైకేల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ, ఆడం మిల్నీ, మాట్ హెన్రీ, టామ్ లేథమ్ లతో కివీస్ దళం బలమైనజట్టుగా కనిపిస్తోంది.వన్డే సిరీస్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారం కోసం దూరదర్శన్ స్పోర్ట్స్ ఛానెల్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.