ప్రపంచరికార్డు సెంచరీకి విరాట్ గురి,నేడు నెదర్లాండ్స్ తో ఢీ!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ పోరును సైతం విజయంతో ముగించడానికి హాట్ ఫేవరెట్ భారత్ సిద్ధమయ్యింది. బెంగళూరు వేదికగా పసికూన నెదర్లాండ్స్ తో ఈ రోజు భారత్ తలపడనుంది.

Advertisement
Update:2023-11-12 10:17 IST

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ పోరును సైతం విజయంతో ముగించడానికి హాట్ ఫేవరెట్ భారత్ సిద్ధమయ్యింది. బెంగళూరు వేదికగా పసికూన నెదర్లాండ్స్ తో ఈ రోజు భారత్ తలపడనుంది...

భారత్ వేదికగా జరుగుతున్న 2023 -ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ దశ ముగింపు దశకు చేరింది. ఇప్పటికే సెమీఫైనల్స్ బెర్త్ లు ఖాయం కావడంతో.. మలిరౌండ్ పోటీలకు ప్రాధాన్యం లేకుండా పోయింది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే 9వ రౌండ్ మ్యాచ్ లో 11వ ర్యాంకర్ నెదర్లాండ్స్ పని పట్టడానికి నంబర్ వన్ ర్యాంక్ టీమ్ భారత్ సిద్ధమయ్యింది.

ప్రపంచ రికార్డులే లక్ష్యంగా....

పసికూన నెదర్లాండ్స్ తో జరిగే ఈ ఆఖరిరౌండ్ మ్యాచ్ లో భారతజట్టుతోపాటు విరాట్ కొహ్లీ సైతం సరికొత్త ప్రపంచ రికార్డులు నమోదు చేసే అవకాశం లేకపోలేదు.

జట్టుగా భారత్, వ్యక్తిగతంగా విరాట్ కొహ్లీ ప్రపంచ రికార్డులకు గురిపెట్టారు.

10 జట్లు, 9 మ్యాచ్ లో రౌండ్ రాబిన్ లీగ్ లో 8 వరుస విజయాలతో ..2003 ప్రపంచకప్ లో సాధించిన తన రికార్డును తానే మరోసారి సమం చేసిన భారత్..వరుసగా 9వ విజయంతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడానికి ఉరకలేస్తోంది.

మార్పులులేని భారతజట్టు...

నెదర్లాండ్స్ తో జరిగే పోరులో సైతం జట్టులో ఏవిధమైన మార్పులు ఉండబోవని భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో 8వ రౌండ్ పోరు ముగిసిన తరువాత భారతజట్టుకు ఆరురోజులపాటు విశ్రాంతి లభించిందని, అందరూ అలసట నుంచి పూర్తిగా తేరుకొన్నారని, కీలక ఆటగాళ్ళకు విశ్రాంతి ఇచే ఆలోచన ఏదీలేదని చీఫ్ కోచ్ వివరించారు.

ఈ నెల 15న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగే సెమీఫైనల్ పోరుకు ముందు తమజట్టుకు తగిన ప్రాక్టీసు అవసరమని, ఫామ్ ను కొనసాగించాలంటే విన్నింగ్ ఫార్ములాతోనే బరిలోకి దిగాలని తేల్చి చెప్పారు.

50వ సెంచరీకి విరాట్ తహతహ!

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా..తన 35వ పుట్టినరోజునాడు 49వ వన్డే శతకం బాదడం ద్వారా మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసిన విరాట్ ..నెదర్లాండ్స్ తో జరిగే ఆఖరిరౌండ్ మ్యాచ్ లో సైతం మూడంకెల స్కోరుతో 50 సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాలన్న లక్ష్యంతో ఉన్నాడు.

రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఆడిన మొదటి 8 రౌండ్ల మ్యాచ్ ల్లో విరాట్ రెండు సెంచరీలు, 80 కి పైగా రెండు స్కోర్లతో 543 పరుగులు సాధించాడు. 600 పరుగుల మైలురాయిని చేరడంతో పాటు...ఐపీఎల్ లో తన హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో సైతం రాణించాలన్న పట్టుదల విరాట్ లో కనిపిస్తోంది.

టాప్ గేర్ లో రోహిత్ శర్మ....

భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం మొదటి 8 రౌండ్ల మ్యాచ్ ల్లో ఓ సెంచరీతో సహా 442 పరుగులతో భీకరమైన ఫామ్ లో కనిపిస్తున్నాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయాలే ప్రధానంగా ఆడుతూ వస్తున్న రోహిత్ ఇప్పటికే 16 సిక్సర్లు, 31 బౌండ్రీలతో దూకుడుమీద కనిపిస్తున్నాడు. పవర్ ప్లే ( మొదటి 10 ) ఓవర్లలో 265 పరుగులతో టాపర్ గా నిలిచిన రోహిత్..డచ్ బౌలర్లపైన సైతం విరుచుకుపడటం, నిలదొక్కుకొంటే ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది.

యువఓపెనర్ శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ సైతం నిలకడగా రాణిస్తున్నారు.

నిప్పులు చెరుగుతున్న పేస్ త్రయం..

భారత ఫాస్ట్ బౌలర్ల త్రయం మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా సైతం కుదురుగా బౌల్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. మహ్మద్ షమీ 16 వికెట్లు, సిరాజ్ 10 వికెట్లు, బుమ్రా 14 వికెట్లతో భారత విజయాలలో ప్రధానపాత్ర వహించారు. స్పిన్ జోడీ జడేజా, కుల్దీప్ సైతం మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొడుతూ తమవంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు.

భారత బౌలింగ్ జోరుకు నెదర్లాండ్స్ జట్టు ఎంత వరకూ తట్టుకోగలదన్నది అనుమానమే.

నెదర్లాండ్స్ ప్రమాదకరమైన జట్టే...!

అంతర్జాతీయ క్రికెట్లో పసికూనగా ఉన్న నెదర్లాండ్స్ కు మేటి జట్లను కంగుతినిపించిన రికార్డు ఉంది. తమదైన రోజున మెరుగైన జట్లకు గట్టిపోటీ ఇచ్చే సత్తా మెండుగా ఉంది.

నమ్మదగిన బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ నాయకత్వంలోని డచ్ జట్టులో భారత సంతతి ఆటగాళ్లు విక్రమ్ సింగ్, తేజ నిడమానూరి, ఆర్యన్ దత్ సైతం కీలకం కానున్నారు.

పాల్ వాన్ మీకీరెన్, వాన్ డెర్ మెర్వీ, వాన్ బీక్, బాస్ డీ లీడీ లాంటి ప్రమాదకరమైన పేస్ బౌలర్లు సైతం డచ్ జట్టులో ఉన్నారు. రౌండ్ రాబిన్ లీగ్ దశలో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికా, శ్రీలంకజట్లను కంగుతినిపించిన నెదర్లాండ్స్ ..ఆఖరి రౌండ్లో సైతం వరుస కుదిరితే భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది.

భారత్ జోరుకు నెదర్లాండ్స్ బేజారేనా?

భారత్ తో పోల్చుకొంటే..నెదర్లాండ్స్ రికార్డు అంతంత మాత్రమే. ప్రపంచకప్ లో భారత్ ప్రత్యర్థిగా గతంలో రెండుమార్లు తలపడిన నెదర్లాండ్స్ ..రెండుకు రెండుసార్లు పరాజయాలు చవిచూసింది.

2003 ప్రపంచకప్ లో పార్ల్ వేదికగా జరిగిన పోరులో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని భారత్ 68 పరుగులతో డచ్ జట్టును చిత్తు చేసింది. ఆ తర్వాత 2011 ప్రపంచకప్ లో సైతం నెదర్లాండ్స్ ను భారత్ అలవోక గా ఓడించింది.

ఈ రోజు జరిగే మ్యాచ్ కు వర్షం ముప్పు ఏమాత్రం లేదని వాతావరణశాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో 45 శాతం ఉక్కబోత ఉంటుందని, 18 శాతం ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించింది. 16 నుంచి 28 డిగ్రీల సెలీషియస్ వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుందని పేర్కొంది.

చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్ల కు అనువుగా ఉండడంతో భారీస్కోరు నమోదు కావడం ఖాయమని క్యూరేటర్ చెబుతున్నారు. భారత్ కు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కితే 350కి పైగా స్కోరు సాధించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

బెంగళూరు స్టేడియం కురుచైన బౌండ్రీలైన్ల తో ఉండడంతో ఫోర్లు, సిక్సర్ల హోరుతో పరుగులజోరు అందుకోనుంది.

నెదర్లాండ్స్ తో పోరులో సైతం భారత్ మరో భారీవిజయంతో రౌండ్ రాబిన్ లీగ్ ను 9కి 9 విజయాలతో ముగించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పుతుందా? భారత రన్ మెషీన్ విరాట్ కొహ్లీ 50వ శతకంతో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేస్తాడా? తెలుసుకోవాలంటే...మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News