వన్డే కెప్టెన్ గా గత ఆరేళ్లలో రోహిత్ తొలి ఓటమి!

విశాఖ వన్డేలో భారత్ ఘోరపరాజయంతో వన్డేజట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మ గత ఆరేళ్ల కాలంలో తొలి ఓటమి చవిచూశాడు.

Advertisement
Update:2023-03-19 21:07 IST

విశాఖ వన్డేలో భారత్ ఘోరపరాజయంతో వన్డేజట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మ గత ఆరేళ్ల కాలంలో తొలి ఓటమి చవిచూశాడు.

వన్డే టాప్ ర్యాంకర్ భారత్, రెండోర్యాంకర్ ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. ముంబై వేదికగా ముగిసిన లోస్కోరింగ్ తొలివన్డేలో భారత్ 5 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సాధిస్తే...స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి -ఆంధ్రక్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండోవన్డేలో కంగారూ టీమ్ 10 వికెట్లతో నెగ్గడం ద్వారా 1-1తో సిరీస్ ను సమం చేయగలిగింది.

37 ఓవర్లలోనే ముగిసిన మ్యాచ్......

100 ఓవర్లపాటు సాగాల్సిన విశాఖ వన్డే కేవలం 37 ఓవర్ల ముచ్చటగా ముగిసిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలిపోయింది.

సమాధానంగా ఆస్ట్ర్రేలియా 118 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండానే కేవలం 11 ఓవర్లలోనే సాధించడం ద్వారా 10 వికెట్ల అలవోక విజయం సాధించింది.

ఆస్ట్ర్రేలియా ఓపెనింగ్ జోడీ మిషెల్ మార్ష్- ట్రావిస్ హెడ్ అజేయ హాఫ్ సెంచరీలతో మొదటి వికెట్ కు సెంచరీభాగస్వామ్యంతో పరుగుల మోత మోగించారు.

కంగారూ ఓపెనర్ల ముందు భారత బౌలర్లు తేలిపోయారు.

మార్ష్ 36 బంతుల్లో 66, హెడ్ 30 బంతుల్లో 51 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా నిలిచారు.

కెప్టెన్ గా రోహిత్ కు తొలిషాక్...

2021 డిసెంబర్ లో విరాట్ కొహ్లీ నుంచి భారత వన్డేజట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మకు ఇదే తొలి పరాజయం కావడం విశేషం.

ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డేకి..తన బావమరిది వివాహం కారణంగా దూరంగా ఉన్న రోహిత్..విశాఖ వన్డేలో తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకొన్నాడు.

పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న వాతావరణంలో కీలక టాస్ ఓడటంతోనే భారత్ ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది.

కెప్టెన్ రోహిత్ 13, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఒకే ఒక్కపరుగుకు వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండోసారి డకౌట్ కాగా విరాట్ కొహ్లీ పోరాడి ఆడి 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

రాహుల్, శుభ్ మన్ గిల్ సైతం దారుణంగా విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ 29 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ 117 పరుగుల స్కోరుతో పరువు దక్కించుకోగలిగింది.

తొమ్మిది వరుస విజయాల తర్వాత..

విరాట్ నుంచి వన్డే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకొన్న రోహిత్ వరుసగా తొమ్మిది విజయాలు నమోదు చేశాడు. ప్రస్తుత ఏడాదిలో స్వదేశంలో ఆడిన ఆరుకు ఆరు వన్డేలలోనూ భారత జట్టుకు కెప్టెన్ గా రోహిత్ విజయాలు అందించాడు.

శ్రీలంకతో తీన్మార్ వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన భారత్ ఆతర్వాత న్యూజిలాండ్ తో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో సైతం అజేయంగా నిలిచింది.

భారత వన్డేజట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా రోహిత్ కు గత ఆరేళ్లలో ఇదే స్వదేశీ తొలివన్డే పరాజయం కావడం విశేషం.

చివరిసారిగా 2017 సిరీస్ లో భారత జట్టు స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఓటమి ఎదుర్కొన్న రోహిత్ ఆ తర్వాత ఆడిన అన్ని వన్డేలలోనూ అజేయంగా నిలవడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

భారతజట్టు తాత్కాలిక కెప్టెన్ గా 10 మ్యాచ్ లు ఆడిన రోహిత్ కు 8 విజయాల రికార్డు ఉంది.

భారత వన్డే జట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా గత డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రమే సిరీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ ను రోహిత్ నాయకత్వంలో భారత్ 2-1తో గెలుచుకోగలిగింది.

సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరివన్డే చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈనెల 22న జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News