సంజుపోరాటం వృథా- తొలివన్డేలో భారత్ ఓటమి!
దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 9 పరుగుల ఓటమితో ప్రారంభించింది.
దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 9 పరుగుల ఓటమితో ప్రారంభించింది. వానదెబ్బతో 40 ఓవర్లకు కుదించిన ఈ పోరులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ 86 పరుగుల అజేయ స్కోరుతో తుదివరకూ పోరాడినా ఫలితం లేకపోయింది...
భారత్- దక్షిణాఫ్రికాజట్ల మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు వరుణదేవుడు స్వాగతం పలికాడు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా జరిగిన తొలివన్డేను..వర్షం కారణంగా 50 ఓవర్లకు బదులుగా 40 ఓవర్లకు కుదించి నిర్వహించారు.
వాతావరణం, వికెట్ బౌలర్లకు అనువుగా ఉండడంతో ..ముందుగా కీలక టాస్ నెగ్గిన భారత కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు. ఓపెనర్లు మలాన్- డికాక్ సఫారీజట్టుకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చినా..కెప్టెన్ బవుమా, రెండోడౌన్ మర్కరమ్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.
డికాక్ 48, మలన్ 22 పరుగులకు అవుట్ కావడంతో జట్టును మిడిలార్డర్ ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్- క్లాసెన్ అజేయభాగస్వామ్యంతో ఆదుకొన్నారు. క్లాసెన్ 74, మిల్లర్ 75 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగుల స్కోరు సాధించింది.
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు, స్పిన్నర్లు బిష్నోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
సంజు-శార్దూల్ పోరాటం..
250 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్లు శుభ్ మన్ గిల్, కెప్టెన్ శిఖర్ ధావన్ ల వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.
యువఆటగాళ్లు రితురాజ్- ఇషాన్ కిషన్ మూడో వికెట్ కు 40 పరుగుల భాగస్వామ్యం జోడించినా వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ మరి కోలుకోలేకపోయింది.
రితురాజ్ 19, ఇషాన్ 20 పరుగులకు అవుటయ్యారు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 బాల్స్ లో 8 బౌండ్రీలతో 50 పరుగులకు దొరికిపోడంతో భారత్ ను ఆదుకొనే భారం మిడిలార్డర్ జోడీ సంజు శాంసన్- శార్దూల్ ఠాకూర్ లపైన పడింది.
ఈ ఇద్దరూ 6వ వికెట్ కు భారీభాగస్వామ్యం నమోదు చేసినా శార్దూల్ 33 పరుగులకు అవుట్ కావడంతో..ఆ వెంటనే భారత్ మరో రెండు లోవర్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది.
ఓవైపు వికెట్లు పడిపోతున్నా...వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజు శాంసన్ కేవలం 63 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 86 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడంతో భారత్ 40 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేసి...విజయానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడ 2, ఎంగిడి 3వికెట్లు పడగొట్టారు.
సిరీస్ లోని రెండో వన్డే రాంచీ వేదికగా అక్టోబర్ 9న జరుగుతుంది.