ఐపీఎల్ లో రేటు జాస్తి...ఆట నాస్తి!

కొచ్చీ వేదికగా ముగిసిన 2023 సీజన్ ఐపీఎల్ వేలంలో రికార్డుల మోత మోగింది.

Advertisement
Update:2022-12-26 11:07 IST

కొచ్చీ వేదికగా ముగిసిన 2023 సీజన్ ఐపీఎల్ వేలంలో రికార్డుల మోత మోగింది. గత 15 సీజన్లలో ఎన్నడూ లేనంతగా విదేశీ ఆల్ రౌండర్ల కోసం పలు ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు కుమ్మరించాయి. అయితే రేటు కు తగ్గ ఆట తక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి....

ఐపీఎల్ 2023 సీజన్ వేలం కొత్తపుంతలు తొక్కింది. గత 15 సీజన్ల వేలం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత సీజన్ వేలంలో విదేశీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లకు ధర పలికింది.

కొచ్చీ వేదికగా జరిగిన వేలంలో ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ ను రికార్డుస్థాయిలో 18 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు మొహాలీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక వేలం రికార్డు కావడం విశేషం.

ఇక..ఆస్ట్ర్రేలియా యువఆల్ రౌండర్ కమెరాన్ గ్రీన్ కు ముంబై ఫ్రాంచైజీ 17 కోట్ల 50 లక్షలు, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు చెన్నై ఫ్రాంచైజీ 16 కోట్ల 25 లక్షలు, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ నికోలస్ పూరన్ కు లక్నో ఫ్రాంచైజీ 16 కోట్ల రూపాయల భారీ ధరకు సొంతం చేసుకొన్నాయి. ప్రస్తుత సీజన్ వేలంలో ఏకంగా నలుగురు విదేశీ క్రికెటర్లకు 16 కోట్ల రూపాయలకు పైగా ధర దక్కడం మరో రికార్డు.

ఇంగ్లండ్‌ యువ ఆటగాడు హ్యరీ బ్రూక్‌ కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీ 13.25 కోట్లు వెచ్చించింది. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా మూడు శతకాలతో అదరగొట్టిన బ్రూక్‌పై హైదరాబాద్‌ భారీ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్‌ వేలం చరిత్రలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒక ఆటగాడి కోసం వెచ్చించిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. మయాంక్‌ అగర్వాల్‌ (రూ.8.25 కోట్లు)ను కూడా సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసుకుంది. అంతగా గుర్తింపు లేని జమ్మూ-కాశ్మీర్ యువ ఆటగాడు వివ్రాంత్‌ శర్మ కోసం హైదరాబాద్‌ రూ. 2.60 కోట్లు వెచ్చించడం గమనార్హం.

రేటు టాప్..ఆట ఫ్లాప్...

ఆటగాళ్లకు భారీగా రేటు చెల్లించినంత మాత్రాన వారి ఆటకు గ్యారెంటీ ఏదీలేదని గత 15 సీజన్ల గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. 2008 నుంచి 2022 ఐపీఎల్ సీజన్ వరకూ ఒక్కసారి మాత్రమే రేటుకు తగ్గ ఆటను ముంబై ఫ్రాంచైజీ దక్కించుకోగలిగింది.

2013 సీజన్లో ముంబై ఫ్రాంచైజీ...ఆస్ట్ర్రేలియా స్పిన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కు 10 లక్షల డాలర్ల వేలం ధర చెల్లించింది. ఆ సీజన్లో మాక్స్ వెల్ అంచనాలకు తగ్గట్టుగా రాణించడంతో ముంబై ఇండియన్స్ రేటు కు తగ్గ ఆటను రాబట్టుకోగలిగింది.

అయితే..మిగిలిన 14 సీజన్లలోనూ వేలం ద్వారా రికార్డు ధరను దక్కించుకొన్న ఆటగాళ్లంతా స్థాయికి తగ్గట్టుగా రాణించలేక చతికిలబడిపోడంతో..ఆయా ఫ్రాంచైజీల పరిస్థితి కుంటిగుర్రాల మీద పందెం కాసిన చందంగా మారింది.

2014 సీజన్లో యువరాజ్ సింగ్ కు మొహాలీ ఫ్రాంచైజీ 14 కోట్లు, 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ 16 కోట్లు, 2016లో షేన్ వాట్సన్ కు బెంగళరూ 9 కోట్ల 50 లక్షలు, 2017లో బెన్ స్టోక్స్ కు పూనే సూపర్ జెయింట్స్ 14 కోట్ల 50 లక్షలు, 2018లో స్టోక్స్ కు జైపూర్ ఫ్రాంచైజీ 12 కోట్ల 50 లక్షలు, 2019లో వరుణ్ చక్రవర్తి, జయదేవ్ ఉనద్కత్ లకు కోల్ కతా, జైపూర్ ఫ్రాంచైజీలు 8 కోట్ల 40 లక్షలు, 2020లో పాట్ కమిన్స్ కు కోల్ కతా 15 కోట్ల 50 లక్షలు, 2021లో క్రిస్ మోరిస్ కు జైపూర్ ఫ్రాంచైజీ 16 కోట్ల 25 లక్షల రూపాయలు,

2022 సీజన్లో ఇషాన్ కిషన్ కు ముంబై ఫ్రాంచైజీ 15 కోట్ల 25 లక్షల రూపాయల రికార్డు ధరను చెల్లించినా..ఆయా క్రికెటర్ల నుంచి ఆశించినస్థాయిలో ఆటను రాబట్టుకోలేక దారుణంగా విఫలమయ్యాయి.

గత సీజన్లో ఇషాన్ కిషన్ కు రికార్డుస్థాయిలో 15 కోట్ల 25 లక్షల ధర చెల్లించిన ముంబై ఇండియన్స్ చివరకు 10వ స్థానానికి పడిపోవడం గమనార్హం.

మరి 2023 సీజన్ వేలంలో కళ్లు చెదిరే మొత్తాలను దక్కించుకొన్న సామ్ కరెన్, కామెరూన్ గ్రీన్, హ్యారీ బ్రూక్, నికోలస్ పూరన్ రేటుకు తగ్గట్టుగా ఆడి తమ ఫ్రాంచైజీలకు న్యాయం చేస్తారా? పైసా వసూల్ అనుకొనేలా చేయగలరా? అనుమానమే. ఏమాత్రం గ్యారెంటీలేదు. అందులోలేశమైనంతైనా సందేహంలేదు..

Tags:    
Advertisement

Similar News