ఆల్ రౌండర్ల చావుకొచ్చిన ' ఇంపాక్ట్ సబ్ ' నిబంధన!
వినోదం పేరుతో క్రికెట్ ను అబాసుపాలు చేస్తున్న ' ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ' నిబంధనను ఎత్తివేయాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.
వినోదం పేరుతో క్రికెట్ ను అబాసుపాలు చేస్తున్న ' ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ' నిబంధనను ఎత్తివేయాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.
పెద్దమనుషుల క్రీడ క్రికెట్ ఈ మధ్యకాలంలో సాంప్రదాయ నిబంధనలకు తిలోదకాలిచ్చి...వినోదం పేరుతో అమలు చేస్తున్న చిత్రవిచిత్రమైన నిబంధనలతో నవ్వులపాలవుతోంది. క్రికెట్ పవిత్రతనే దెబ్బతీస్తోంది. 11 మంది ఆడాల్సిన క్రికెట్ మ్యాచ్ ను 12 మంది సభ్యులతో ఆడిస్తూ అబాసు పాలవుతోంది.
ప్రయోగాల వేదికగా ఐపీఎల్...
భారత క్రికెట్ బోర్డు గత 17 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ కు నేతిబీర సామెత అతికినట్లు సరిపోతుంది. నేతిబీరలో నెయ్యి ఎంత ఉందో..ఐపీఎల్ టీ-20లో స్వచ్ఛమైన క్రికెట్ సైతం అంతే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
టీ-20 లీగ్ అంటేనే ఫక్తు వ్యాపారం. వ్యాపారంలో లాభాల కోసం ఏదైనా చేసే వ్యాపారిలా ఐపీఎల్ క్రికెట్ బోర్డు మారిపోయింది. వినోదం పేరుతో జనాలను స్టేడియాలకు రప్పించడం కోసం, టీవీల ముందు గుమికూడేలా చేయడం కోసం, బ్రాడ్ కాస్టర్లు రేటింగ్ పెంచుకోడానికి వీలుగా అర్థంపర్థం లేని నిబంధనలతో మర్యాదస్తుల క్రీడ మర్యాదనే మంటగలుపుతున్నారు.
ప్రభావశీలక ఆటగాడి నిబంధన...
క్రికెట్ లో ఓ మ్యాచ్ ప్రారంభానికి ముందే తుదిజట్టులోని 11 మంది ప్రధాన ఆటగాళ్లతో పాటు 12వ ఆటగాడి పేరును ప్రకటించడం సాధారణ విషయం. అయితే..ఐపీఎల్ 16వ సీజన్ నుంచి అమలు చేస్తున్న ' ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ' నిబంధన పుణ్యమా అంటూ 14 మంది ఆటగాళ్లతో జట్టు వివరాలను అందచేయాల్సి వస్తోంది.
బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాలలో ఇంపాక్ట్ సబ్ ల పేర్లను ప్రకటించేలా నిబంధన రూపొందించారు. జట్టు అవసరాలకు అనుగుణంగా..మ్యాచ్ మధ్యలోనే తుదిజట్టులోని ఓ ఆటగాడిని తప్పించి...' ఇంపాక్ట్ సబ్ 'గా వచ్చే బ్యాటర్ లేదా బౌలర్ ను బరిలోకి దింపుతున్నారు.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్, రాయల్ చాలెంజర్స్ తరపున ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ శివం దూబే లాంటి ఆటగాళ్లు ప్రభావశీలక ఆటగాళ్ల జాబితాలో చేరిపోయి తమ అస్థిత్వాన్నే కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
ఆల్ రౌండర్ల పాలిట శాపం...
ఇంపాక్ట్ సబ్ నిబంధన పుణ్యమా అంటూ ఆల్ రౌండర్లు కేవలం బ్యాటింగ్ లేదా బౌలింగ్ కు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. చెన్నై తరపున రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగుతున్న శివం దూబే బౌలింగ్ చేయకుండా బ్యాటింగ్ కు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. ఇంపాక్ట్ సబ్ నిబంధన ప్రకారం..ఆట మధ్యలో బౌలింగ్ కు దిగే బౌలర్ తన కోటా 4 ఓవర్లకు పరిమితమైతే..బ్యాటర్ మిడిల్ ఓవర్ల నుంచి డెత్ ఓవర్ల వరకూ బ్యాటింగ్ కే పరిమితం కావాల్సి వస్తోంది. మీడియం పేస్ బౌలర్ గా ఉన్న శివం దూబే..ఈ నిబంధన కారణంగా బౌలింగ్ కు దూరమైపోడం చర్చనీయాంశంగా మారింది.
బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ తనజట్టుకు ఉపయోగపడాల్సిన శివం దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్ల ప్రతిభను ఇంపాక్ట్ సబ్ హరించి వేస్తోందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేశాడు. తక్షణమే ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశాడు.
బెంగళూరు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ సైతం ఇంపాక్ట్ సబ్ నిబంధన పట్ల తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధనను తొలగించాల్సిందేనంటూ తన కెప్టెన్ రోహిత్ తో గొంతు కలిపాడు. క్రికెట్ వ్యాఖ్యాత, భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ సైతం ' ఇంపాక్ట్ సబ్ ' నిబంధన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.
సబ్ స్టిట్యూట్ బ్యాటర్లు, సబ్ స్టి ట్యూట్ బౌలర్లతో మ్యాచ్ లు జరిగేలా చూడటం దారుణమని, ప్రస్తుత సీజన్లో 200కు పైగా స్కోర్లు సాధించడానికి ' ఇంపాక్ట్ సబ్ ' నిబంధనే కారణమన్న విమర్శలు కూడా లేకపోలేదు.
టీ-20 లీగ్ మ్యాచ్ ల కోసం జీవం లేని పిచ్ లు తయారు చేయటంతో పాటు...' ఇంపాక్ట్ సబ్ ' నిబంధనను అడ్డుపెట్టుకొని బ్యాటింగ్ బలాన్ని మరింతగా పెంచుకోడం..బౌలర్లను తీవ్ర ఒత్తిడిలో పడేస్తోంది.
పునరాలోచనలో ఐపీఎల్ బోర్డు...
మరికొద్ది మాసాలలో జరిగే ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు భారతజట్టును ఎంపిక చేయాలంటే...' ఇంపాక్ట్ సబ్ ' నిబంధన కొత్త సమస్యలను తెచ్చిపెడుతోందని భారత కెప్టెన్ రోహిత్ వాపోయాడు. శివం దూబే బ్యాటర్ గా గొప్పగా ఆడుతున్నాడని..అయితే అతనిలోని బౌలర్ అవసరం భారతజట్టుకు ఉందని, ప్రభావశీలక ఆటగాడిగా కేవలం బ్యాటింగ్ కే పరిమితం చేయడం తో శివం ను జట్టులోకి తీసుకోవాలో ..లేదో అర్ధంకాని పరిస్థితి అని రోహిత్ వివరించాడు.
భారత కెప్టెన్ ఆందోళనను తాము దృష్టిలో ఉంచుకొన్నామని, ' ఇంపాక్ట్ సబ్ ' నిబంధనపై ప్రస్తుత సీజన్ ముగిసిన వెంటనే ఫ్రాంచైజీ యజమానులు, ఇతర ప్రముఖులతో చర్చించి తుదినిర్ణయం తీసుకొంటామని ఐపీఎల్ బోర్డు చైర్మన్ అరుణ్ దుమాల్ స్పష్టం చేయటం విశేషం.