వార్నర్, మార్ష్ సెంచరీలు, పాక్ పై ఆస్ట్రేలియా కీలక విజయం!

వన్డే ప్రపంచకప్ నాలుగో రౌండ్ పోరులో ఆస్ట్రేలియా కీలక విజయంతో నిలదొక్కుకొంది. పాకిస్థాన్ ను 62 పరుగులతో కంగుతినిపించడం ద్వారా లీగ్ టేబుల్ మొదటి నాలుగు స్థానాలలో నిలిచింది.

Advertisement
Update:2023-10-21 11:00 IST

వార్నర్, మార్ష్ సెంచరీలు, పాక్ పై ఆస్ట్ర్రేలియా కీలక విజయం!

వన్డే ప్రపంచకప్ నాలుగో రౌండ్ పోరులో ఆస్ట్రేలియా కీలక విజయంతో నిలదొక్కుకొంది. పాకిస్థాన్ ను 62 పరుగులతో కంగుతినిపించడం ద్వారా లీగ్ టేబుల్ మొదటి నాలుగు స్థానాలలో నిలిచింది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ లాంటి చిరు జట్లు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి దిగ్గజ జట్లపై సంచలన విజయాలు సాధిస్తే..డూ ఆర్ డై మ్యాచ్ లో ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ పాకిస్థాన్ పై కీలక విజయం సాధించడం ద్వారా సెమీఫైనల్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది.

వార్నర్, మార్ష్ రికార్డు శతకాలు!

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన కీలక 4వ రౌండ్ సమరంలో పరుగులు వెల్లువెత్తాయి. సెమీఫైనల్స్ రేస్ లో నిలవాలంటే నెగ్గితీరాల్సిన ఈపోరులో పాకిస్థాన్ తుదివరకూ పోరాడినా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తప్పలేదు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. కంగారూ జోడీ వార్నర్- మిషెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగిపోయారు.

తొలివికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం!

ప్రస్తుత ప్రపంచకప్ లో మొదటి వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ జోడీగా డేవిడ్ వార్నర్- మిషెల్ మార్ష్ నిలిచారు. పాక్ ఫీల్డర్ల తప్పిదాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొన్న కంగారూ జోడీ శివమెత్తిపోయారు.

మొదటి వికెట్ కు కేవలం 203 బంతుల్లోనే 259 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. సీనియర్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ 124 బంతుల్లో 14 బౌండ్రీలు, 9 సిక్సర్లతో 163 పరుగులు, మార్ష్ 108 బంతుల్లో 10 బౌండ్రీలు, 9 సిక్సర్లతో 121 పరుగులతో భారీ శతకాలు నమోదు చేశారు.

ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ భాగస్వామ్యం కాగా..ఓపెనర్లు శతకాలు బాదడం ఇది రెండోసారి మాత్రమే. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఓపెనింగ్ జోడీ సెంచరీలు నమోదు చేయడం ఇది నాలుగోసారి.

ఆట 13వ ఓవర్ కు మొదటి 100 పరుగులు, 30వ ఓవర్ కు 200వ పరుగులు, 41వ ఓవర్లో 300 పరుగులు సాధించిన ఆస్ట్రేలియాను చివరి 10 ఓవర్లలో పాక్ బౌలర్లు కట్టడి చేయగలిగారు. చివరి 8 వికెట్లను కేవలం 108 పరుగుల తేడాలో పాక్ బౌలర్లు పడగొట్టగలిగారు. వార్నర్ వ్యక్తిగత స్కోర్లు 10, 105 వద్ద ఇచ్చిన క్యాచ్ లను పాక్ ఫీల్డర్లు జారవిడవడంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

డేవిడ్ వార్నర్ అరుదైన శతకం..

తన కెరియర్ లో ఆఖరి వన్డే ప్రపంచకప్ ఆడుతున్న వెటరన్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్ ప్రత్యర్థిగా వరుసగా నాలుగో శతకం బాదడం ద్వారా..భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ సరసన నిలువగలిగాడు.

ప్రపంచకప్ చరిత్రలో మొదటి వికెట్ కు వార్నర్- మార్ష్ జోడీ రెండో అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేయగలిగారు. 2011 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన పోరులో శ్రీలంక జోడీ తిలకరత్నే దిల్షాన్- ఉపుల్ తరంగ మొదటి వికెట్ కు నెలకొల్పిన 282 పరుగుల భాగస్వామ్యమే ఇప్పటికే అత్యుత్తమ రికార్డుగా ఉంది. వన్డే ప్రపంచకప్ లో ఐదో శతకం బాదిన డేవిడ్ వార్నర్ మూడోసారి 150కి పైగా స్కోరు నమోదు చేయడం మరో అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది.

తుదివరకూ పోరాడిన పాక్....

మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 368 పరుగుల భారీస్కోరు చేయాల్సిన పాక్ కు ఓపెనర్లు ఇమాముల్ హక్- అబ్దుల్లా షఫీక్ మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.

127 బంతుల్లో 134 పరుగులు చేర్చిన అనంతరం 71 బంతుల్లో 70 పరుగుల స్కోరుకు ఇమాముల్ హక్, 61 బంతుల్లో 64 పరుగులు సాధించి అబ్దుల్లా షఫీక్ అవుటయ్యారు.

కెప్టెన్ బాబర్ అజమ్ మరోసారి విఫలం కాగా..వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పోరాడిన ఫలితం లేకుండా పోయింది. పాక్ జట్టు చివరకు 305 పరుగుల స్కోరువద్దే ఆగిపోయింది. కంగారూ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఆడం జంపా 53 పరుగులిచ్చి 4 వికెట్లు, స్టోయినిస్ 2 వికెట్లు పడగొట్టారు.

సిక్సర్ల రికార్డు....

రెండుజట్ల బ్యాటర్లు కలసి ఈమ్యాచ్ లో 25 సిక్సర్లు బాదడం విశేషం. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన నాలుగో మ్యాచ్ గా ఈ పోరు రికార్డుల్లో చేరింది.

ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్, మార్ష్ చెరో 9 సిక్సర్లు చొప్పన 18 సిక్సర్లు బాదారు. పాక్ బ్యాటర్లలో షఫీక్ 2, ఇఫ్తీకర్ అహ్మద్ 3 సిక్సర్లు నమోదు చేశారు.

ప్రపంచకప్ చరిత్ర‌లో అత్యధికంగా 2019 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్- అఫ్ఘన్ జట్ల నడుమ జరిగిన పోరులో 33 సిక్సర్లు నమోదయ్యాయి. అదే ఇప్పటికీ అత్యధిక సిక్సర్ల మ్యాచ్ గా ఉంది.

2015 ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్- వెస్టిండీస్ జట్ల నడుమ వెలింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 31 సిక్సర్లు, 2023 ప్రపంచకప్ లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా శ్రీలంక- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగిన పోరులో 31 సిక్సర్లు నమోదయ్యాయి.

ఇప్పటి వరకూ ఆడిన 4 రౌండ్లలో ఆస్ట్రేలియాకు ఇది రెండో గెలుపు కాగా..పాకిస్థాన్ కు 4 రౌండ్లలో రెండో ఓటమి.


Tags:    
Advertisement

Similar News