వన్డే ప్రపంచకప్ లో అతిపెద్ద సంచలనం!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పై పసికూన అప్ఘనిస్థాన్ అనూహ్య విజయం సాధించింది.

Advertisement
Update:2023-10-16 08:38 IST

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పై పసికూన అప్ఘనిస్థాన్ అనూహ్య విజయం సాధించింది.

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 12 మ్యాచ్ ల అనంతరం అతిపెద్ద సంచలనాన్ని అప్ఘనిస్థాన్ నమోదు చేసింది. వరుస పరాజయాల నుంచి తేరుకొని డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పై 69 పరుగుల అతిపెద్ద విజయం సాధించింది.

14 పరాజయాల తరువాత....

2015 నుంచి ప్రపంచకప్ టోర్నీలలో వరుసగా 14 పరాజయాలు చవిచూసిన అప్ఘనిస్థాన్ 15వ మ్యాచ్ లో తొలి విజయం నమోదు చేసింది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రస్తుత చాంపియన్ ఇంగ్లండ్ తో జరిగిన కీలక పోరులో అప్ఘనిస్థాన్ అంచనాలకు మించి రాణించడం ద్వారా విజయం సొంతం చేసుకొంది.

రౌండ్ రాబిన్ లీగ్ మొదటి రెండురౌండ్ల పోరులో శ్రీలంక, భారత్ జట్ల చేతిలో పరాజయాలు చవిచూసిన అప్ఘనిస్థాన్ మూడోరౌండ్ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయింది.

గుర్బాజ్, అలీకిల్ బ్యాటింగ్ షో...

ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ కు సెమీస్ సంకటంగా మారిన ఈ కీలక పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన అప్ఘనిస్థాన్ కు ఓపెనింగ్ జోడీ గుర్బాజ్- ఇబ్రహీం జడ్రాన్ సెంచరీ భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.

మొదటి వికెట్ కు 114 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం జడ్రాన్ 28 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహ్మత్ 3, షాహీదీ 14, అజంతుల్లా 19 పరుగులకే వెనుదిరిగినా ..మిడిలార్డర్ బ్యాటర్ అలీకిలీతో కలసి గుర్బాజ్ చెలరేగిపోయాడు.

గుర్బాజ్ 57 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలీకిలీ 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులతో భారీస్కోరుకు మార్గం సుగమం చేశాడు. లోయర్ ఆర్డర్లో స్పిన్ జోడీ ముజీబుర్ రెహ్మాన్ 28, రషీద్ ఖాన్ 23 పరుగులతో మెరుపులు మెరిపించడంతో అప్ఘనిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది. ఒకదశలో 6 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసిన అప్ఘనిస్థాన్ ఆ తర్వాత లోయర్ ఆర్డర్ జోరుతో పుంజుకోగలిగింది.

ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 3, మార్క్ వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.

40.3 ఓవర్లలోనే కుప్పకూలిన ఇంగ్లండ్

మ్యాచ్ నెగ్గాలంటే 285 పరుగుల స్కోరు చేయాల్సిన ఇంగ్లండ్ ప్రత్యర్థి స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనలేక 40.3 ఓవర్లలో కేవలం 215 పరుగుల స్కోరుకే కుప్పకూలింది.

ఇంగ్లండ్ బ్యాటర్లలో హారీ బ్రూక్ 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 66 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ మలన్ 32 పరుగులతో రెండో అతిపెద్ద స్కోరర్ గా నిలిచాడు.

అప్ఘనిస్థాన్ స్పిన్ త్రయం రషీద్ ఖాన్, ముజీబుర్, నబీ కలసి 8 వికెట్లు పడగొట్టడం విశేషం. రషీద్ 37 పరుగులిచ్చి 3, నబీ 16 పరుగులిచ్చి 2 వికెట్లు, ముజీబుర్ 51 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు.

అప్ఘనిస్థాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇంగ్లండ్ పై ఇదే తొలిగెలుపు...

అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న అప్ఘనిస్థాన్ జట్టుకు వన్డేలలో ఇంగ్లండ్ పై ఇదే తొలిగెలుపు. వన్డే క్రికెట్లో అప్ఘనిస్థాన్ సాధించిన అతిపెద్ద విజయం కూడా ఇదే.

ప్రపంచకప్ టోర్నీలో ప్రత్యర్థి స్పిన్నర్లకు ఇంగ్లండ్ 8 వికెట్లు సమర్పించుకోడం కూడా ఇదే మొదటిసారి.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మూడు రౌండ్లలో ఇంగ్లండ్ కు ఇది రెండో ఓటమి కాగా..అప్ఘనిస్థాన్ కు తొలి గెలుపు.

Tags:    
Advertisement

Similar News