వెస్టిండీస్ లేకుండానే 2023 వన్డే ప్రపంచకప్!
2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ మెయిన్ రౌండ్ కు అర్హత సాధించడంలో వెస్టిండీస్ విఫలమయ్యింది. పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది.
2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ మెయిన్ రౌండ్ కు అర్హత సాధించడంలో వెస్టిండీస్ విఫలమయ్యింది. పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది..
1970 దశకంలో ప్రపంచక్రికెట్ ను శాసించిన రెండుసార్లు విజేత వెస్టిండీస్ పరిస్థితి ఇంతబతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. గత 48 సంవత్సరాలలో తొలిసారిగా..ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించడంలో కరీబియన్ టీమ్ విఫలమయ్యింది.
ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత భీకరమైన జట్టుగా పేరుపొందిన వెస్టిండీస్ కు 1975, 1979 టోర్నీలలో విజేతగా నిలవడంతో పాటు..1983 ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన అరుదైన రికార్డు ఉంది.
చిన్నజట్ల ముందూ దిగదుడుపే...
వెస్టిండీస్ క్రికెట్ ప్రాభవం గత దశాబ్దకాలంగా తగ్గిపోయింది. స్కాట్లాండ్, అఫ్ఖనిస్థాన్, నెదర్లాండ్స్ లాంటి పసికూన జట్ల చేతిలోనూ ఘోరపరాజయాలు చవిచూసే స్థితికి దిగజారిపోయింది.
సర్ గార్ ఫీల్డ్ సోబర్స్, క్లైవ్ లాయిడ్, గార్డన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, వీవియన్ రిచర్డ్స్ , బ్రయన్ లారా లాంటి గొప్పగొప్ప ఆటగాళ్లను అందించిన కరీబియన్ క్రికెట్లో ప్రస్తుతం భూతద్దం పెట్టి వెతికినా మేటి క్రికెటర్లు ఎవ్వరూ కనిపించడం లేదు.
జింబాబ్వేలోని హరారే వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ అర్హత పోటీల బరిలో నిలిచిన కరీబియన్ టీమ్ గ్రూప్ లీగ్ దశలో కనీసం ఒక్క గెలుపు నమోదు చేయలేకపోయింది. చివరకు సూపర్ సిక్స్ తొలిపోరులోనే స్కాట్లాంట్ చేతిలో ఓటమితో రేస్ నుంచి తప్పుకొంది
181 పరుగులకే ఆలౌట్...
పసికూన స్కాట్లాండ్ తో జరిగిన ప్రారంభమ్యాచ్ లో వెస్టిండీస్ కేవలం 43.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. సమాధానంగా స్కాట్లాండ్ మరో 6.3 ఓవర్లు మిగిలిఉండగానే 7 వికెట్ల విజయంతో విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది.
స్కాట్లాండ్ బ్యాటర్లరో మాట్ క్రాస్ 107 బంతుల్లో 74 నాటౌట్, బ్రెండన్ మెక్ మ్యులెన్ 106 బంతుల్లో 69 పరుగుల నాటౌట్ స్కోర్లతో రెండో వికెట్ కు 125 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
గ్రూపు- ఏ లీగ్ లో నెదర్లాండ్స్, జింబాబ్వే జట్ల చేతిలో పరాజయాలు పొందినా నెట్ రన్ రేట్ తో సూపర్ సిక్స్ బెర్త్ దక్కినా వెస్టిండీస్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.
అమెరికాపైన సాధించిన 35 పరుగులు, నేపాల్ పై 101 పరుగుల విజయాలు సాధించినా ప్రయోజనం లేకపోయింది.
భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ మెయిన్ రౌండ్ పోటీలు రెండుసార్లు విజేత వెస్టిండీస్ లేకుండా జరుగబోతున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో కరీబియన్ టీమ్ లేకుండా టోర్నీ జరగనుండడం ఇదే మొదటిసారి.