వన్డే ప్రపంచకప్ ప్రసారాలతో నిండామునిగిన డిస్నీస్టార్!

2023 వన్డే ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల తో డిస్నీస్టార్ నెట్ వర్క్ కు 144 శాతం మేర నష్టాలు వచ్చినట్లు ప్రకటించారు. 315 మిలియన్ డాలర్లు అంటే 2583 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ బయటపెట్టింది.

Advertisement
Update:2024-02-09 12:47 IST

భారత్ వేదికగా జరిగిన 2023 - ఐసీసీ వన్డే ప్రపంచకప్ బ్రాడ్ కాస్టర్ గా డిస్నీ స్టార్ స్పోర్ట్స్ భారీనష్టాలను చవిచూసింది. వీక్షకుల సంఖ్య పెరిగినా రాబడి మాత్రం గణనీయంగా తగ్గిపోయింది.

క్రికెట్ ప్రసారహక్కులు సైతం ఓ జూదంలా మారిపోయాయి. ఐసీసీ లేదా బీసీసీఐ నిర్వహించే ప్రపంచకప్, ఐపీఎల్ టోర్నీల ప్రసారహక్కుల కోసం గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ పెరిగిపోతోంది. ప్రసారహక్కుల వేలం రేస్ లో డిస్నీస్టార్, సోనీ నెట్ వర్క్, వైకోమ్-జియో సినిమా సంస్థలు తీవ్రంగా పోటీపడటం సాధారణ విషయంగా మారిపోయింది. చివరకు ప్రసారహక్కుల పోరు సైతం ఓ జూదం స్థాయికి చేరిపోయింది.

వన్డే ప్రపంచకప్ తో భారీనష్టాలు...

భారత్ వేదికగా గతేడాది ముగిసిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారహక్కులను రికార్డు మొత్తంతో డిస్నీస్టార్ సంస్థ దక్కించుకొంది. భారత్ వేదికగా 2011 తరువాత జరుగుతున్న ఈ ప్రపంచకప్ ప్రత్యక్షప్రసారాలను పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకోగలమని అంచనా వేసింది.

2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ భారతగడ్డపై 48 మ్యాచ్ లుగా సాగిన ఈటోర్నీ డిజిటల్, టీవీ ప్రసారహక్కులను డిస్నీస్టార్ సొంతం చేసుకొన్నా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయింది.

టీఆర్పీ రేటింగ్ రికార్డుస్థాయిలో పెరిగినా ప్రకటనల ద్వారా వచ్చిన రాబడి మాత్రం తగ్గిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా 1350 కోట్ల రూపాయల ఆదాయం రాగా..2023 ప్రపంచకప్ లో 2000 కోట్ల నుంచి 2200 కోట్ల ఆదాయం ఉంటుందని అంచనావేశారు.

భారీనష్టాన్ని తెచ్చిన ' ఉచితం'...

గత సీజన్ ఐపీఎల్ మ్యాచ్ ల ను జియో సినిమా ద్వారా ఉచితంగా ప్రసారం చేయటం ద్వారా స్టార్ నెట్ వర్క్ ను రిలయన్స్ గ్రూపు దెబ్బ కొట్టగలిగింది. అయితే..దానికి ప్రతిగా..డిస్నీస్టార్ నెట్ వర్క్ సైతం 2023 వన్డే ప్రపంచకప్ ను హాట్ స్టార్ ద్వారా ఉచితంగా ప్రసారం చేయటం భారీనష్టాన్ని తెచ్చి పెట్టింది.

2023 వన్డే ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల తో డిస్నీస్టార్ నెట్ వర్క్ కు 144 శాతం మేర నష్టాలు వచ్చినట్లు ప్రకటించారు. 315 మిలియన్ డాలర్లు అంటే 2583 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ బయటపెట్టింది.

క్రీడాప్రసారాల విభాగంలో స్టార్ ఇండియా ఆదాయం 71 శాతం మేర పెరిగింది. 399 మిలియన్ డాలర్ల రాబడి వచ్చింది. అయితే నిర్వహణ వ్యయం మాత్రం 129 మిలియన్ డాలర్ల నుంచి 315 మిలియన్ డాలర్లకు పెరగడంతో భారీగా నష్టం వచ్చినట్లు ఆ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

మొత్తం మీద...భారత్ వేదికగా పుష్కరకాలం విరామం తరువాత జరిగిన వన్డే ప్రపంచకప్ విజయవంతమైనా..బ్రాడ్ కాస్టర్ డిస్నీస్టార్ కు మాత్రం భారీనష్టాలను మిగిల్చాయి.

Tags:    
Advertisement

Similar News