నేడే భారత్- ఆస్ట్ర్రేలియా ప్రపంచకప్ ' బ్లాక్ బస్టర్ ' ఫైట్!

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో బ్లాక్ బస్టర్ సూపర్ సండే ఫైట్ కి చెన్నై చెపాక్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

Advertisement
Update:2023-10-08 10:47 IST

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో బ్లాక్ బస్టర్ సూపర్ సండే ఫైట్ కి చెన్నై చెపాక్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్ర్రేలియాకు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ సవాలు విసురుతోంది...

భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ అరుదైన రికార్డులతో జోరందుకొంది.10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే సూపర్ సండే ఫైట్ లో ఆతిథ్య భారత్ తో ఐదుసార్లు ప్రపంచ విజేత ఆస్ట్ర్రేలియా ఢీ అంటే ఢీ అంటోంది. ప్రస్తుత ప్రపంచకప్ లో రెండుజట్లకూ ఇదే తొలిమ్యాచ్ కావడంతో గెలుపు ఎవరిదన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హాట్ ఫేవరెట్ గా భారత్...

స్పిన్ బౌలర్ల అడ్డా చెపాక్ స్టేడియం వేదికగా ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పోరులో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంటే...ఇషాన్ కిషన్ ను తుదిజట్టులోకి తీసుకోవాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

కళ్లు చెదిరే ఫామ్ లో ఉన్న గిల్ లాంటి ఓపెనర్ లేకపోడం తమకు తీరని లోటేనని, జ్వరం నుంచి అతను త్వరగా కోలుకోవాలని తాను భావిస్తున్నానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. జట్టులోని మిగిలిన 14 మంది సభ్యులు నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో ఉన్నారని స్పష్టం చేశాడు. తాను భారత జట్టుకెప్టెన్ గా కాకుండా..ఓ మనిషిగా ఆలోచిస్తున్నానని, ఎవరికైనా ఆరోగ్యం తరువాతే క్రికెట్ అని, దానికి శుభ్ మన్ గిల్ సైతం మినహాయింపు కాదని అన్నాడు.

ముగ్గురు స్పిన్నర్లతో భారత్ పోటీ...

చెపాక్ స్లోపిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో..భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్ల వ్యూహంతో కంగారూల పని పట్టడానికి సిద్ధమయ్యింది. వెటరన్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 8 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి ప్రపంచకప్ లో పాల్గొనబోతున్నాడు.

చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాలతో కలసి ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ కు సవాలు విసరనున్నాడు.

మహ్మద్ సిరాజ్ , జస్ ప్రీత్ బుమ్రాలతో పాటు హార్థిక్ పాండ్యా..పేస్ త్రయంగా వికెట్ల వేటకు దిగనున్నారు.

పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో భారత్...

ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ జట్టుగా ఉన్న భారత్...బ్యాటింగే ప్రధానబలంగా పోటీలో నిలిచింది. కెప్టెన్ రోహిత్ 2015 ప్రపంచకప్ లో మాదిరిగానే అద్భుతమైన ఫామ్ లో ఉండడం, వన్ డౌన్ లో విరాట్ కొహ్లీ, రెండో డౌన్లో శ్రేయస్ అయ్యర్, మూడో డౌన్లో కెఎల్ రాహుల్, ఆ తర్వాత హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లతో భారత బ్యాటింగ్ ఆర్డర్ భీకరంగా కనిపిస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సమతూకంతో ఉన్న భారత్ స్థాయికి తగ్గట్టుగా ఆడితే కంగారూజట్టుకు కష్టాలు తప్పవు.

ఆస్ట్ర్రేలియాకు అసలుసిసలు సవాల్...

ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆడిన గత 6 వన్డేలలో 5 పరాజయాలు చవిచూసిన ఆస్ట్ర్రేలియా ప్రస్తుతం అయోమయంలో చిక్కుకొంది. మిషెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ , లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టోయినిస్, మాక్స్ వెల్ లాంటి ప్రపంచ మేటి బ్యాటర్లున్నా నిలకడలేమితో కొట్టిమిట్టాడుతోంది.

లెగ్ స్పిన్నర్ ఆడం జంపా, ఆఫ్ స్పిన్నర్ మాక్స్ వెల్ లతో పాటు కెప్టెన్ కమిన్స్, హేజిల్ వుడ్, మిషెల్ స్టార్క్, గ్రీన్, మిషెల్ మార్షలతో కూడిన పేస్ ఎటాక్ తో భారత్ ను ఓ పట్టుపట్టాలని భావిస్తోంది.

వర్షం ముప్పులేనట్లే....

చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు వానముప్పులేనేలేదని వాతావరణ శాఖ ప్రకటించింది. చిరుజల్లులు పడే అవకాశం కేవలం 10 శాతం మాత్రమే ఉందని, భరించలేని ఉక్కబోత ఖాయమని తెలిపింది.

చెపాక్ వేదికగా జరిగిన గత ఐదు వన్డేలలో సగటున 270 కి పైగా స్కోర్లు మాత్రమే నమోదయ్యాయి.ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొని ప్రత్యర్థి ఎదుట 280 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

స్పిన్ బౌలర్లే మ్యాచ్ విన్నర్లు గా నిలుస్తారని గ్రౌండ్ గత రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి.

స్మిత్ కు పాండ్యా, విరాట్ కు జంపా దడ...

ఆస్ట్ర్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను భారత వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా 75 బంతుల్లో ఐదుసార్లు అవుట్ చేసిన రికార్డు కీలకం కానుంది. అంతేకాదు..భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీకి సైతం కంగారూ లెగ్ స్పిన్నర్ ఆడం జంపా నుంచి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే విరాట్ ను జంపా 5సార్లు అవుట్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ రాహుల్ లను నాలుగేసి సార్లు అవుట్ చేసిన రికార్డు సైతం ఆడం జంపాకు ఉంది.

అయితే..చెపాక్ వేదికగా ఆడిన వన్డేలలో సెంచరీ సాధించిన ఘనత ప్రస్తుత భారత బ్యాటర్లలో కేవలం విరాట్ కొహ్లీకి మాత్రమే ఉంది. మిడిల్ ఓవర్లలో 39 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్..భారత బౌలింగ్ ఎటాక్ కే కీలకం కానున్నాడు.

ఆస్ట్ర్రేలియా 83- భారత్ 56...

ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్ర్రేలియా, రెండుసార్లు విశ్వవిజేత భారత్ ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే..ఇప్పటి వరకూ ఆడిన 149 వన్డేలలో ఆస్ట్ర్రేలియాకు 83 విజయాలు, భారత్ కు 56 విజయాలు ఉన్నాయి.

గత మూడుసంవత్సరాల కాలంలో మాత్రం ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా భారత్ కే ఎక్కువ విజయాలున్నాయి. ఈ డూ ఆర్ డై సమరంలో తొలిగెలుపు ఏ జట్టును వరిస్తుందో తెలుసుకోవాలంటే..ఆదివారం రాత్రి వరకూ వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News