45 ఏళ్ల క్రికెట్ కామెంట్రీకి ఇయాన్ చాపెల్ స్వస్తి!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను గత 45 సంవత్సరాలుగా తన క్రికెట్ వ్యాఖ్యానంతో అలరిస్తూ వస్తున్న ఆస్ట్ర్రేలియన్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెట్ కామెంటీటర్ ఇయాన్ చాపెల్ రిటైర్ కావాలని నిర్ణయించారు.

Advertisement
Update:2022-08-16 11:38 IST

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులను గత 45 సంవత్సరాలుగా తన క్రికెట్ వ్యాఖ్యానంతో అలరిస్తూ వస్తున్న ఆస్ట్ర్రేలియన్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెట్ కామెంటీటర్ ఇయాన్ చాపెల్ రిటైర్ కావాలని నిర్ణయించారు.

తన క్రికెట్ జీవితంలో 45 సంవత్సరాల క్రితం తొలిసారిగా ఓ క్రికెట్ ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన 78 సంవత్సరాల ఇయాన్ తిరిగి క్రికెట్ వ్యాఖ్యాతగా మరోసారి అల్విదా చెప్పారు.

1964 నుంచి 2022 వరకూ...

క్రికెట్ చరిత్రలోనే తన ఆటతీరు, నాయకత్వ పటిమ, విశ్లేషణాత్మక వ్యాఖ్యానంతో ఆల్ టైమ్ గ్రేట్లలో ఒకరిగా నిలిచిన ఇయాన్ చాపెల్ 1964 నుంచి 1980 వరకూ సేవలు అందించారు.

స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా ఆస్ట్ర్రేలియాకు పలు అద్భుత సిరీస్ విజయాలు అందించిన ఇయాన్ చాపెల్ కు సమర్థవంతమైన నాయకుడిగా, చక్కటి వ్యూహకర్తగా కూడా పేరుంది.

ఆస్ట్ర్రేలియా తరపున సాంప్రదాయటెస్టు క్రికెట్లో ఇయాన్ 5వేల 345 పరుగులతో 42.2 సగటు నమోదు చేశారు. అంతేకాదు 30 టెస్టుల్లో ఆస్ట్ర్రేలియాకు కెప్టెన్ గా వ్యవహరించారు.

1971- 1980 మధ్యకాలంలో ఇయాన్ చాపెల్ 16 వన్డేలలో ఆస్ట్ర్రేలియాజట్టుకు ప్రాతినిథ్యం వహించారు.

క్రికెట్ వ్యాఖ్యాతగా....

1980లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇయాన్ చాపెల్...ఆ వెంటనే చానెల్-9 తరపున క్రికెట్ వ్యాఖ్యాతగా తన రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.

విశ్వవిఖ్యాత కామెంటీటర్లు రిచీ బెనాడ్, బిల్ లారీ, టోనీ గ్రెగ్ తో జట్టుగా క్రికెట్ కామెంటరీని కొత్తపుంతలు తొక్కించారు.

లోతైన విశ్లేషణతో ఇయాన్ తనకుతానే సాటిగా నిలిచారు.

గత 45 సంవత్సరాలుగా సిరీస్ వెంట సిరీస్ కు క్రికెట్ వ్యాఖ్యానం అందిస్తూ తన ప్రస్థానం కొనసాగించారు. గంబీరమైన తన గొంతుకకు ఆస్ట్ర్రేలియన్ పలుకుబడి ఆంగ్లంతో క్రికెట్ కామెంట్రీకే సరికొత్త గ్లామర్ తీసుకు వచ్చారు.



స్కిన్ క్యాన్సర్ తోనే రిటైర్మెంట్...

గత నాలుగున్నర దశాబ్దాలుగా అలుపెరుగని క్రికెట్ కామెంట్రీతో తన వయసును సైతం మరచిపోయిన ఇయాన్ చాపెల్ కు 2019లో స్కిన్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దానికితోడు గుండెపోటు కూడా రావడంతో ఇయాన్ శారీరకంగా కృంగిపోయారు.

క్రికెట్ కామెంటీటర్ గా కొనసాగాలంటే తన శరీరం సహకరించడం లేదని, ప్రయాణాలు చేయటం, మెట్లు ఎక్కడం లాంటి పనులు చేయటమే కష్టమైపోతోందని..వయసు మీద పడటం కూడా తన కామెంట్రీకి అడ్డంకిగా మారిందని, ఇక..రిటైర్మెంట్ తీసుకోడమే మేలని భావించి..ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఇయాన్ చాపెల్ ప్రకటించారు.

ఇయాన్ చాపెల్ క్రికెట్ కామెంట్రీకి, మైక్రోఫోన్ కు దూరమైనా...ఆయన వ్యాఖ్యానం మాత్రం ఆతరం క్రికెట్ అభిమానుల చెవుల్లో పదేపదే ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

ఇయాన్ చాపెల్ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు...గొప్ప క్రికెట్ వ్యాఖ్యాతగా కూడా పేరు తెచ్చుకొన్నారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్నారు.

Tags:    
Advertisement

Similar News