భారత టీ-20 జట్టులో హైదరాబాద్ కుర్రాడు!

వెస్టిండీస్ తో జరిగే పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో హైదరాబాద్ యువబ్యాటర్ తిలక్ వర్మకు చోటు దక్కింది.

Advertisement
Update:2023-07-06 11:15 IST

తిలక్ వర్మ

వెస్టిండీస్ తో జరిగే పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో హైదరాబాద్ యువబ్యాటర్ తిలక్ వర్మకు చోటు దక్కింది. మొత్తం 15 మంది సభ్యుల జట్టును సెలెక్షన్ కమిటీ కొత్త చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రకటించారు....

2024 టీ-20 ప్రపంచకప్ కు బీసీసీఐ..ప్రస్తుత కరీబియన్ సిరీస్ తో మొదలు పెట్టింది. వెస్టిండీస్ తో జరిగే 5 మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే 15 మంది సభ్యులజట్టులో ఎక్కువమంది యువఆటగాళ్లకు చోటు కల్పించింది.

ఈ జట్టుకు హార్థిక్ పాండ్యా కెప్టెన్ గాను, మిస్టర్ 360 స్ట్ర్రోక్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గాను వ్యవహరిస్తారు.

ఆరుగురికి విశ్రాంతి, సంజూకు పిలుపు...

గతంలో భారత టీ-20 జట్టులో కీలక సభ్యులుగా ఉన్న ఆరుగురిని ఎంపిక సంఘం పక్కన పెట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, అశ్విన్ లకు విశ్రాంతినిచ్చింది.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, డాషింగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాలలతో పాటు..హైదరాబాద్ కమ్ ముంబై ఇండియన్స్ యువబ్యాటర్ తిలక్ వర్మకు తొలిసారిగా టీ-20 జట్టులో చోటు కల్పించారు.

సిరాజ్ తర్వాత తిలక్ వర్మకే చోటు...

భారత టీ-20 జట్టులో పేసర్ మహ్మద్ సిరాజ్ తర్వాత చోటు దక్కించుకొన్న ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. ఐపీఎల్ -15, 16 సీజన్ టోర్నీలలో ముంబై ఇండియన్స్ తరపున నిలకడగా రాణిస్తూ వచ్చిన హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మను ఎంపిక సంఘం కరుణించింది.

క్లీన్‌ హిట్టింగ్‌తో మిడిలార్డర్‌లో పరుగుల మోత మోగిస్తూ వచ్చిన తిలక్ వర్మ తన బ్యాటింగ్ శైలితో అందరినీ ఆకట్టుకొన్నాడు.

మరోవైపు ముంబై ఆటగాడు, 21 సంవత్సరాల యశస్వి జైశ్వాల్ సైతం తొలిసారిగా భారత టీ-20 జట్టులోచోటు దక్కించుకొన్నాడు. ఐపీఎల్ -16లో 625 పరుగులతో

వీరవిహారం చేసిన యశస్వి ఇప్పటికే భారత టెస్టు, వన్డే జట్లలో సైతం చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.

ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్ సైతం తిరిగి భారత జట్టులో చోటు సంపాదించగలిగాడు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన రింకూసింగ్‌, జితేశ్‌శర్మకు జట్టులో చోటు దక్కలేదు. షమీ, సిరాజ్‌, బుమ్రా లేకుండానే భారత్‌ బరిలోకి దిగనుంది.

ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్ తో 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ ప్రారంభంకానుంది.

ఇదీ భారత టీ-20 జట్టు

హార్దిక్‌పాండ్యా(కెప్టెన్‌), సూర్యకుమార్‌యాదవ్‌(వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌కిషన్‌, శుభ్ మన్ గిల్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌వర్మ, సంజు శాంసన్‌, అక్షర్‌పటేల్‌, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌యాదవ్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అవేశ్‌ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌.

భారతజట్టులో చోటు దక్కని ఆటగాళ్లలో రాహుల్ త్రిపాఠీ, దీపక్ హుడా, ప్రథ్వీ షా, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివం మావీ ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News