జాతీయ ఖో-ఖో ` బంగారం' వివేక వర్ధని..!
జాతీయ అండర్ -17 ఖో-ఖో బాలికల విభాగంలో హైదరాబాద్ మెరుపుతీగ వివేకవర్ధని బంగారు పతకం సాధించి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.
భారత గ్రామీణ క్రీడ ఖో-ఖోలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలు మాత్రమే కాదు..హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ నగరంలో పుట్టి పెరిగిన బాలికలు సైతం జాతీయస్థాయిలో రాణించగలరని, బంగారు పతకం సాధించగలరని 14 సంవత్సరాల వివేకవర్ధని చాటి చెప్పింది.
2023 జాతీయ ఖో-ఖో బంగారు విజేతగా..
దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో, ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఆడే ఖో-ఖో క్రీడలో రాణించాలంటే శారీరక పటుత్వంతో పాటు.. మెరుపువేగంతో దూసుకు పోయే నేర్పు, ఓర్పు ఉండితీరాలి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో పుట్టిపెరిగిన బాలికలే ఖో-ఖో క్రీడలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. అయితే.. పట్టణప్రాంతాలలో పుట్టి పెరిగిన బాలికలు.. అందునా ఓ వైద్య కుటుంబానికి చెందిన వారు బ్యాడ్మింటన్ లేదా టెన్నిస్ లాంటి ఖరీదైన క్రీడల వైపే మొగ్గుచూపడం సర్వసాధారణం. అయితే.. దానికి భిన్నంగా హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమార్తెగా ఉండి.. శారీరక శ్రమ ఎంతగానో అవసరమైన, అత్యంత నిరాడంబరమైన ఖో-ఖో క్రీడను ఎంచుకొన్న వివేకవర్ధని తనజట్టుకు నాయకత్వం వహించడమే కాదు.. జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించింది. తన రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.
గోవా వేదికగా విజయపరంపర..
గోవాలోని కాలన్ గోట్ వేదికగా మార్చి నెల 25, 26, 27 తేదీలలో జరిగిన షాహీద్ భగత్ సింగ్ జాతీయ అండర్ -17 బాలికల విభాగంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు పోటీపడ్డాయి. అయితే..14 ఏళ్ల వివేకవర్ధని నాయకత్వంలోని మన రాష్ట్ర జట్టు సెమీఫైనల్లో మహారాష్ట్ర, ఫైనల్లో తమిళనాడు జట్లను ఓడించడంలో ప్రధానపాత్ర వహించింది. రాష్ట్ర జట్టును జాతీయ విజేతగా నిలపడంతో పాటు బంగారు పతకం సైతం అందుకొంది.
తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తండ్రి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కెవీకె రెడ్డి ప్రోత్సాహంతోనే తాను ఖో-ఖో క్రీడలో రాణించగలుగుతున్నట్లు వివేకవర్ధని చెబుతోంది. కరాటేలో కూడా జాతీయ స్థాయిలో రాణించిన వివేకవర్ధని కొన్ని కారణాల వల్ల నేషనల్స్ ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయింది. బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ధనికవర్గాల క్రీడలు ఆడే స్థాయి ఉన్నా గ్రామీణ క్రీడ ఖో-ఖో నే ఎంచుకొని రాణిస్తున్న బంగారు కొండ వివేకవర్ధనిని అభినందించి తీరక తప్పదు.