ప్రపంచకప్ హాకీలో నేడే టైటిల్ సమరం!

2023 హాకీ ప్రపంచకప్ పురుషుల టైటిల్ సమరానికి భువనేశ్వర్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయింది.

Advertisement
Update:2023-01-29 11:12 IST

ప్రపంచకప్ హాకీలో నేడే టైటిల్ సమరం!

2023 హాకీ ప్రపంచకప్ పురుషుల టైటిల్ సమరానికి భువనేశ్వర్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఈ రోజు జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం కు మాజీ చాంపియన్ జర్మనీ సవాలు విసురుతోంది.....

15వ హాకీ ప్రపంచకప్ పురుషుల టైటిల్ పోరుకు రంగం సిద్ధమయ్యింది. భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న 16 జట్ల ఈ సమరంలో ప్రస్తుత చాంపియన్ బెల్జియం వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరుకోగా..రెండుసార్లు విజేత జర్మనీ 13 సంవత్సరాల విరామం తర్వాత ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

అంతర్జాతీయ హాకీ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం బెల్జియం 2వ ర్యాంకులో ఉంటే..జర్మనీజట్టు నాలుగోర్యాంకులో కొనసాగుతోంది.

సెమీస్ లో సంచలన విజయాలు..

ఫైనల్లో చోటు కోసం జరిగిన సెమీఫైనల్స్ లో గట్టిపోటీ ఎదుర్కొని బెల్జియం, జర్మనీ జట్లు విజేతలుగా నిలిచాయి. మూడుసార్లు విజేత, 13సార్లు సెమీఫైనలిస్ట్ ఆస్ట్ర్రేలియాను జర్మనీ 4-3 గోల్సు తో కంగు తినిపించడం ద్వారా సుదీర్ఘవిరామం తర్వాత టైటిల్ సమరంలో నిలిచింది.

హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో ప్రస్తుత చాంపియన్ బెల్జియం పెనాల్టీ షూటౌట్ ద్వారా నెదర్లాండ్స్ ను 3-2తో అధిగమించింది. ఆట నిర్ణితసమయంలో రెండుజట్లు 2-2 గోల్స్ తో సమఉజ్జీలుగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వరకూ వెళ్ళింది.

నువ్వానేనా అంటున్న జర్మనీ, బెల్జియం...

సమానం బలం కలిగిన బెల్జియం, జర్మనీల పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగే అవకాశం ఉంది. అనుభవం కలిగిన ఎక్కువమంది ఆటగాళ్లున్న బెల్జియంకు ..యువఆటగాళ్లతో కూడిన జర్మనీ సవాలు విసురుతోంది. రెండుజట్ల గోల్ కీపర్లు ప్రతిభావంతులు కావడంతో ఫీల్డ్ గోల్స్ సాధించిన జట్లకే విజయావకాశాలు ఉంటాయి.

మరోపేరు పాకిస్థాన్...

1971లో ప్రారంభమైన పురుషుల ప్రపంచకప్ హాకీ టైటిల్ ను అత్యధికంగా నాలుగుసార్లు పాకిస్థాన్ (1971, 1978, 1981, 1994) గెలుచుకొంది., నెదర్లాండ్స్ ( 1998, 1990, 1973 ),

ఆస్ట్ర్రేలియా (2014, 2010, 1986 ), జర్మనీ ( 2002, 2006 ), భారత్ ( 1975 ), బెల్జియం ( 2018 ) ఉన్నాయి.

బెల్జియం వరుసగా రెండోసారి ట్రోఫీ అందుకొంటుందా?..లేక జర్మనీ మూడోసారి విజేతగా నిలుస్తుందా? ఈరోజు జరిగే టైటిల్ సమరంలో తేలిపోనుంది.

భారత హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో భువనేశ్వర్, రూర్కెలా వేదికలుగా ప్రస్తుత ప్రపంచకప్ ను నిర్వహిస్తున్నారు.

గతంలో ముంబై, న్యూడిల్లీ, భువనేశ్వర్ వేదికలుగా ప్రపంచకప్ కు మూడుసార్లు భారత్ ఆతిథ్యమిచ్చింది.

Tags:    
Advertisement

Similar News