భారత గడ్డపై రేపటి నుంచే హాకీ ప్రపంచకప్!
భారత్ వేదికగా హాకీ ప్రపంచకప్ కు మూడోసారి మరికొద్దిగంటల్లో తెరలేవనుంది
భారత్ వేదికగా హాకీ ప్రపంచకప్ కు మూడోసారి మరికొద్దిగంటల్లో తెరలేవనుంది. భువనేశ్వర్, రూర్కెలా వేదికలుగా 16 దేశాలకు చెందిన అగ్రశ్రేణిజట్లు ఢీ కొంటున్నాయి. 47 సంవత్సరాల ప్రపంచకప్ కలను నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ఆతిథ్య భారత్ పోటీ పడుతోంది....
భారత్ జాతీయ క్రీడ హాకీ. ఒలింపిక్స్ లో అత్యధికంగా 8 బంగారు పతకాలు అందించిన ఏకైక క్రీడ హాకీ మాత్రమే. అయితే..ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన హాకీ ప్రపంచకప్ లో భారత్ ఇప్పటి వరకూ ఒక్కసారి ( 1975 ప్రపంచకప్ లో) మాత్రమే విజేతగా నిలువగలిగింది. ఆ తర్వాత నుంచి మరో టైటిల్ కోసం గత 47 సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉంది. 1971లో తొలి ప్రపంచకప్....
ప్రపంచహాకీలో అత్యంత ప్రధానమైనజట్లలో ఒకటిగా గుర్తింపు ఉన్న భారత్..హాకీ ప్రపంచకప్ కు మూడోసారి ఆతిథ్యమిస్తోంది. గతంలో ముంబై, భువనేశ్వర్ వేదికలుగా రెండుసార్లు ప్రపంచకప్ టోర్నీలు నిర్వహించింది. ప్రస్తుత 2023 ప్రపంచకప్ ను జనవరి 29 వరకూ నిర్వహిస్తోంది.
హాకీ పురుషుల విభాగంలో 1971 నుంచే ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రారంభ ప్రపంచకప్ హాకీలో కాంస్య పతకం మాత్రమే సాధించిన భారత్...ఆ తర్వాత రెండేళ్లకు 1973లో నిర్వహించిన రెండో ప్రపంచకప్ లో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొంది.
1975లో మలేసియా వేదికగా ముగిసిన మూడో ప్రపంచకప్ హాకీ టోర్నీలో...భారత్ తొలిసారిగా ట్రోఫీ అందుకొంది. అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలోని భారతజట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత 1978 నుంచి 2018 వరకూ జరిగిన 11 ప్రపంచకప్ టోర్నీల్లోనూ..భారత్ కు పరాజయాలే ఎదురయ్యాయి.
నాలుగుజట్ల అరుదైన రికార్డు...
1971 నుంచి 2018 వరకూ జరిగిన మొత్తం 14 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న ఘనతను భారత్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్ జట్లు మాత్రమే దక్కించుకోగలిగాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం..ఇప్పటి వరకూ 26 దేశాలజట్లే ప్రపంచకప్ బరిలో నిలువగలిగాయి.
1978 ప్రపంచకప్ లో ఆరో స్థానానికి పడిపోయిన భారత్..1982లో ఐదు, 1986 ప్రపంచకప్ లో 12 స్థానాలకే పరిమితమయ్యింది. 1990 ప్రపంచకప్ లో 10వ స్థానం సంపాదించిన భారత్..1994 ప్రపంచకప్ లో పుంజుకొని 5వ స్థానానికి ఎగబాక గలిగింది.
1998 ప్రపంచకప్ లో నాలుగు, 2002 ప్రపంచకప్ లో 10, 2006 ప్రపంచకప్ లో 11 స్థానాలు సాధించిన భారత హాకీ...2010 టోర్నీలో ఎనిమిది, 2014 ప్రపంచకప్ లో 9 స్థానాలలో నిలువగలిగింది.2018 ప్రపంచకప్ లో 8వ స్థానం సంపాదించింది.
పూల్-డీ లీగ్ లో భారత్ పోటీ...
ప్రస్తుత 15వ ప్రపంచకప్ హాకీ గ్రూప్- డీ లీగ్ లో ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్ జట్లతో భారత్ పోటీపడుతోంది. మరోవైపు..భారత్ విజేతగా నిలిస్తే ఒక్కో ఆటగాడికి కోటిరూపాయల చొప్పున నజరానా ఇస్తామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
ప్రస్తుత చాంపియన్ బెల్జియం, రన్నరప్ నెదర్లాండ్స్ తో పాటు ఆస్ట్ర్రేలియా హాట్ ఫేవరెట్ గా పోటీలో నిలిచాయి. మిడ్ ఫీల్డర్ మన్ దీప్ సింగ్ నాయకత్వంలోని 18 మంది సభ్యుల భారతజట్టు మరోసారి తన అదృష్టం పరీక్షించుకొంటోంది.
2023 ప్రపంచకప్ లో తలపడుతున్న జట్లలో ఆస్ట్ర్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, బెల్జియం, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ, ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్, ఆతిథ్యదేశం హోదాలో భారత్ ఉన్నాయి.
ప్రస్తుత ప్రపంచకప్ కోసం రూర్కెలాలో కేవలం 9 మాసాల వ్యవధిలోనే ప్రపంచ ప్రమాణాలతో కూడిన బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్ ను నిర్మించారు. ఆటగాళ్లు, అధికారులు, శిక్షకుల కోసం 225 గదులను నిర్మించారు. ప్రపంచకప్ లో పాల్గొంటున్న మొత్తం 16 జట్ల ఆటగాళ్లు, సిబ్బంది..బిర్సాముండా స్టేడియంలోనే విడిది చేయటం విశేషం.
హాకీ ఇండియా చైర్మన్ దిలీప్ టిర్కే ప్రపంచకప్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 2018లో జరిగిన హాకీ ప్రపంచకప్ కు తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన ఒడిషా వరుసగా రెండోసారి ఈ మెగాటోర్నీ నిర్వహణకు చొరవచూపడం మరో విశేషం.
రూర్కెలా వేదికగా 20 మ్యాచ్ లు, భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 25 మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. జనవరి 27న సెమీఫైనల్స్, 29న కాంస్య పతకంతో పాటు బంగారు పతకం పోటీలు జరుగుతాయి.
గత కొద్ది సంవత్సరాలుగా నిలకడగా రాణిస్తున్న భారత్ 47 సంవత్సరాల బంగారు కలను సాకారం చేసుకోవాలని కోరుకొందాం.