భారత క్రికెట్లో హీరోవర్షిప్‌- గంభీర్ గరంగరం!

భారత క్రికెట్లో వ్యక్తిపూజ, హీరోవర్షిప్ ధోరణి పట్ల క్రికెట్ వ్యాఖ్యాత, బీజెపీ ఎంపి గౌతం గంభీర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా రూపుమాపాలని పిలుపునిచ్చాడు.

Advertisement
Update:2022-09-20 11:52 IST

భారత క్రికెట్లో వ్యక్తిపూజ, హీరోవర్షిప్ ధోరణి పట్ల క్రికెట్ వ్యాఖ్యాత, బీజెపీ ఎంపి గౌతం గంభీర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా రూపుమాపాలని పిలుపునిచ్చాడు....

భారతమాజీ క్రికెటర్, బీజెపీ ఎంపీ, ప్రస్తుత క్రికెట్ ఫైర్ బ్రాండ్ కామెంటీటర్ గౌతం గంభీర్ మరోసారి భారత క్రికెట్ పై తనదైనశైలిలో విరుచుకు పడ్డాడు. ప్రస్తుత భారత క్రికెట్లోని వింతపోకడలు, ఒకరిద్దరు ఆటగాళ్లనే హీరోలుగా చిత్రీకరిస్తూ ఆకాశానికి ఎత్తేయడం, వారికి ఓ బ్రాండ్ ఇమేజ్ ను కల్పించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకేతీరుగా రాణించిన ఇద్దరు క్రికెటర్లను వేర్వేరుగా చూడటం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు.

కొహ్లీని అలా...భువీ ఇలా...

ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొ్ట్టినట్లు చెప్పాడు. ఇటీవలే దుబాయ్ లో ముగిసిన

ఆసియాకప్ సూపర్ -4 రౌండ్ మ్యాచ్ లో అఫ్గనిస్థాన్ పై విరాట్ కొహ్లీ 122 పరుగుల నాటౌట్ స్కోరు సాధిస్తే..భారత ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 4 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన సమయంలో బ్రాడ్ కాస్టర్లు, మీడియా, అభిమానులు ప్రవర్తించిన తీరు పట్ల గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

గత మూడేళ్లుగా శతకం కోసం నానాపాట్లు పడుతున్న విరాట్ కొహ్లీ ఎట్టకేలకు ఓ సెంచరీ సాధిస్తే..దానినే బ్రాడ్ కాస్టర్లు, మీడియా హైలైట్ చేశాయని, అదేమ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టిన బౌలర్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదంటూ మండి పడ్డాడు.

క్రికెట్ లో ఓ బ్యాటర్ సెంచరీ సాధిస్తే ఎంత గొప్పో ..ఓ బౌలర్ 5 వికెట్లు పడగొట్టినా అంతేగొప్పని..అయితే ..అంతగా ప్రాధాన్యం లేని ఓ కంటితుడుపు మ్యాచ్ లో విరాట్ సెంచరీ బాదితో ఆకాశానికి ఎత్తేశారని,దేశమంతా సంబరాలు జరుపుకొన్నంత పని చేశారని, మరోవైపున అదే మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టిన బౌలర్ ఘనతను గుర్తించినవారే లేరంటూ గుర్తు చేశాడు.

హీరోవర్షిప్ తగదు.....

ఒకేమ్యాచ్ లో ఒకేజట్టు తరపున ఒకేతీరుగా రాణించిన ఇద్దరు ఆటగాళ్ల ఘనతను వేర్వేరుగా చూడటానికి...భారత క్రికెట్లో గత కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన హీరోవర్షిప్ సంస్కృతే కారణమని గంభీర్ విశ్లేషించాడు.

1983 ప్రపంచకప్ లో కపిల్ దేవ్ ను, 2007, 2011 ప్రపంచకప్ విజయాలతో ధోనీని, ప్రస్తుతం విరాట్ కొహ్లీని హీరోలుగా చిత్రీకరిస్తూ..మిగిలిన ఆటగాళ్లను చిన్నచూపు చూస్తున్నారంటూ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీనికి..అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ అజ్ఞానంతో రెచ్చిపోయే సోషల్ మీడియాతో పాటు బ్రాడ్ కాస్టర్లు కూడా కారణమంటూ గంభీర్ వాపోయాడు. క్రికెట్లో ఓ జట్టు విజేతగా నిలవడం వెనుక 15మంది ప్లేయర్ల కష్టం, అంకితభావం దాగి ఉంటాయని...అయితే...విజయం ఘనతను ఒకరు లేదా ఇద్దరూ ఆటగాళ్లకు మాత్రమే కట్టబెట్టడం ఎంత వరకూ న్యాయమని నిలదీశాడు.

భారత క్రికెట్లో మాత్రమే కాదు...రాజకీయాలలో సైతం వ్యక్తిపూజ, హీరోవర్షిప్ తగవని గంభీర్ చెప్పాడు. ఈ దుస్సాంప్రదాయాన్ని ఇక ముందు కొనసాగించరాదని, భారత క్రికెట్టే హీరోగా ఉండాలని, ఆటగాళ్లలో ఒకరు లేదా ఇద్దరూ హీరోలుగా చలామణి కారాదంటూ చెప్పుకొచ్చాడు.

విఫలమైనా, సఫలమైనా ఒకే ఆటగాడి గురించి బ్రాడ్ కాస్టర్లు రోజంతా చిలువలుపలువలు చేస్తూ చెప్పడం ద్వారా బ్రాండ్ ను సృష్టిస్తున్నారని..దానికి క్రికెటర్లు కానీ, బీసీసీఐ కానీ కారణంకానేకాదని...కేవలం బ్రాడ్ కాస్టర్లు, సోషల్ మీడియానే కారణమంటూ తేల్చిచెప్పాడు.

బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీని సైతం గంభీర్ విడిచిపెట్టలేదు. డ్రీమ్ లెవెన్ లాంటి ప్రకటనల్లో చైర్మన్ హోదాలో ఉన్న సౌరవ్ గంగూలీ పాల్గొనాల్సిన అసరం ఏమొచ్చిందంటూ నిలదీశాడు. పైస్థాయి నుంచే పొరపాట్లు సవరించుకొంటే కిందిస్థాయిలో పొరపాట్లు జరుగకుండా చూడవచ్చునని సలహా ఇచ్చాడు.

Tags:    
Advertisement

Similar News