రోహిత్ దన్నుతో హార్థిక్ పాండ్యా షో!
ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ గా వెలవెలబోయిన హార్థిక్ పాండ్యా..టీ-20 ప్రపంచకప్ లో మాత్రం భారత వైస్ కెప్టెన్ గా మెరుపులు మెరిపిస్తున్నాడు.
ఐపీఎల్ లో ముంబై కెప్టెన్ గా వెలవెలబోయిన హార్థిక్ పాండ్యా..టీ-20 ప్రపంచకప్ లో మాత్రం భారత వైస్ కెప్టెన్ గా మెరుపులు మెరిపిస్తున్నాడు.
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్-ఏ లీగ్ పోటీలను అజేయంగా ముగించిన టాప్ ర్యాంకర్ భారత్..రెండోదశ సూపర్-8 రౌండ్ బరిలోకి ఎనలేని ఆత్మవిశ్వాసంతో దిగనుంది.
ఐదు ( భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా )జట్ల గ్రూపు లీగ్ లో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్ల పై విజయాలు సాధించడం ద్వారా 6 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ భారత్ సూపర్-8 రౌండ్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. కెనడాతో ఫ్లారిడా వేదికగా జరగాల్సిన ఆఖరి గ్రూప్ లీగ్ పోటీ రద్దు కావడం నిరాశ కలిగించినా..సూపర్ -8 రౌండ్ పైన దృష్టి కేంద్రీకరించింది.
బౌలర్ గా హార్థిక్ పాండ్యా హిట్.....
న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్, వాతావరణం..పేస్, స్వింగ్ బౌలర్లకు అనువుగా ఉండడం, భారత్ తన గ్రూపులీగ్ లోని మొదటి 3 మ్యాచ్ లూ..న్యూయార్క్ స్టేడియం వేదికగానే ఆడటం భారత వైస్ కెప్టెన్ కమ్ పేస్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు బాగా కలసి వచ్చింది.
స్వదేశీ బ్యాటింగ్ పిచ్ లపై ముగిసిన ఐపీఎల్ -17వ సీజన్ పోటీలలో ముంబై కెప్టెన్ కమ్ ఆల్ రౌండర్ గా హార్థిక్ పాండ్యా దారుణంగా విఫలమైనా...తేలిపోయినా..రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని భారత టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం అక్కున చేర్చుకొంది.
ప్రపంచకప్ కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులజట్టులో పాండ్యాకు వైస్ కెప్టెన్ పదవి ఇచ్చి పెద్దపీట వేసింది. పైగా..కెప్టెన్ రోహిత్ శర్మ సైతం పాండ్యాకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించడంతో పాటు వెనుదన్నుగా ఉండడం ద్వారా ఆత్మవిశ్వాసం నింపాడు.
3 మ్యాచ్ ల్లో 7 వికెట్లతో టాప్...
జస్ ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ లాంటి ప్రపంచ మేటి ఫాస్ట్ , స్వింగ్ బౌలర్లున్న భారత జట్టు తరపున గ్రూప్ లీగ్ దశలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ ఘనతను మాత్రం హార్థిక్ పాండ్యా సొంతం చేసుకోగలిగాడు.
ఐర్లాండ్ తో జరిగిన ప్రారంభ గ్రూప్ లీగ్ మ్యాచ్ లో 24 పరుగులిచ్చి 2 వికెట్లు, పాకిస్థాన్ తో జరిగిన కీలకపోరులో 27 పరుగులిచ్చి 3 వికెట్లు, అమెరికాతో 3వ రౌండ్ పోరులో 14 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా పాండ్యా పుంజుకోగలిగాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన నిర్ణయాత్మక సమరం 17వ ఓవర్లో బౌలింగ్ కు దిగడం ద్వారా పాండ్యా తన సత్తా ఏపాటిదో చాటుకోగలిగాడు. పేస్ బౌలింగ్ కు అనువుగా ఉన్న పిచ్ ను, వాతావరణాన్ని పాండ్యా నూటికి నూరుశాతం సద్వినియోగం చేసుకొని ఆశించిన ఫలితాలు రాబట్టగలిగాడు.
ఫామ్ ఈజ్ టెంపరరీ..క్లాస్ ఈజ్ పెర్మినెంట్
భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే...హార్థిక్ పాండ్యాకు హ్యాట్సాఫ్ చెప్పాడు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రపంచకప్ లో స్థాయికి తగ్గట్టుగా రాణించగలగడం తనకు సంతృప్తినిచ్చిందని అన్నాడు.
'ఫామ్ ఈజ్ టెంపరరీ..క్లాస్ ఈజ్ పెర్మినెంట్' అన్నమాటకు పాండ్యా అతికినట్లు సరిపోతాడని, ఐపీఎల్ సమయంలో పాండ్యా తన బౌలింగ్ లయను అందుకోలేకపోయాడని..అయితే..ప్రపంచకప్ లో మాత్రం తనకు అందని ద్రాక్షలా మిగిలిన లయను పట్టుకోగలిగాడని కితాబిచ్చారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ..కీలక సమయాలలో పాండ్యాకు తగిన అవకాశమిచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపాడని కొనియాడారు.
భారత్ మరోసారి టీ-20 ప్రపంచకప్ టైటిల్ సాధించాలంటే హార్థిక్ పాండ్యా ఆల్ రౌండర్ గా రాణించడం అనివార్యమని చెప్పారు.
నలుగురు ఆల్ రౌండర్లూ కీలకమే...
ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో భారత్ ఆశించిన లక్ష్యాలు సాధించాలంటే తుదిజట్టులోని నలుగురు ఆల్ రౌండర్లూ కీలకమేనని పరస్ అభిప్రాయపడ్డారు. హార్థిక్ పాండ్యా, శివం దూబే పేస్ ఆల్ రౌండర్లుగా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండర్లుగా జట్టుకు కీలకమని చెప్పారు.
ఈ నలుగురు ఆల్ రౌండర్లనూ తుదిజట్టులో కొనసాగించడం ఖాయమని, నెట్ సెషన్స్ లో పాండ్యా విపరీతంగా శ్రమించాడని, దాని ఫలితమే మూడు మ్యాచ్ ల్లో 7 వికెట్లు సాధించడం అని తెలిపారు.
సూపర్- 8 రౌండ్ దశలో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ హార్థిక్ సత్తా చాటుకోవాల్సి ఉందని పరస్ మాంబ్రే అన్నారు. ప్రపంచకప్ రెండోదశ సూపర్ - 8 రౌండ్లో ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అప్ఘనిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ లాంటి గట్టి జట్లతో భారత్ తలపడాల్సి ఉంది.