పాండ్యా ఆల్ రౌండ్ షో.. ప్రపంచకప్ సెమీఫైనల్స్ లో భారత్!

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు టాప్ ర్యాంకర్ భారత్ దూసుకెళ్లింది. సూపర్ -8 రౌండ్లో వరుసగా రెండో గెలుపుతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

Advertisement
Update: 2024-06-23 04:45 GMT

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు టాప్ ర్యాంకర్ భారత్ దూసుకెళ్లింది. సూపర్ -8 రౌండ్లో వరుసగా రెండో గెలుపుతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

హాట్ ఫేవరెట్ భారత్ మరోసారి టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ బెర్త్ సాధించింది. టైటిల్ కు రెండు విజయాల దూరంలో మాత్రమే నిలిచింది. కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2024 టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్లో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

భారత బ్యాటర్ల వీరవిహారం....

అంటీగా సర్ వివియన్ రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన సూపర్-8 రెండోరౌండ్ పోరులో భారత్ 50 పరుగుల తేడాతో 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.

సెమీస్ చేరాలంటే నెగ్గితీరాల్సిన ఈపోరులో కీలక టాస్ నెగ్గి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోడంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగుల భారీస్కోరు సాధించింది.

ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- విరాట్ కొహ్లీ పవర్ ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకొని మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. 3.4 ఓవర్లలోనే 39 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. రోహిత్ 11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 23 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

విరాట్ మాత్రం 28 బంతుల్లోనే ఓ ఫోరు, 3 సిక్సర్లతో 37 పరుగుల స్కోరుతో తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

మిడిల్ ఓవర్లలో పంత్ ఫటాఫట్..

భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 6 పరుగులకే అవుట్ కావడంతో..మిడిల్ ఓవర్లలో పరుగుల రాబట్టే బాధ్యతను వీరబాదుడు జోడీ రిషభ్ పంత్- శివం దూబే తీసుకొన్నారు.

రిషభ్ 24 బాల్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36, శివం దూబే 24 బంతుల్లోనే 3 సిక్సర్లతో 34 పరుగులు సాధించారు. డెత్ ఓవర్లలో హార్ఖిక్ పాండ్యా మెరుపులు మెరిపించడం ద్వారా అజేయ హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ 20 ఓవర్లలో 196 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

భారత వైస్ కెప్టెన్ పాండ్యా 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బ్యాటింగ్ ఆర్డర్ 6వ నంబర్ స్థానంలో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా హార్థిక్ పాండ్యా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ పాండ్యా 141 స్ట్ర్రయిక్ రేటుతో 89 పరుగులు సాధించడంతో పాటు 8 వికెట్లు పడగొట్టాడు. హార్థిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

బంగ్లా బౌలర్లలో టాంజిమ్ హసన్, రిషాద్ ఖాన్ చెరో 2 వికెట్లు, సకీబుల్ 1 వికెట్ పడగొట్టారు.

పవర్ ప్లేలో భారత బౌలర్ల పవర్...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 197 పరుగుల స్కోరు చేయాల్సిన బంగ్లాదేశ్ ను భారత బౌలర్లు పవర్ ప్లే దశ నుంచి మిడిల్ ఓవర్ల వరకూ సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు.

ఓపెనర్లు లిట్టన్ దాస్ 13, టాంజిద్ హసన్ 29, వన్ డౌన్ సాంటో 40 పరుగులు, రిషాద్ హుస్సేన్ 24 పరుగులు సాధించినా..ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో బంగ్లాజట్టు 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో బూమ్ బూమ్ బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు, అర్షదీప్ 2 వికెట్లు, కుల్దీప్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు, పాండ్యా ఓ వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ 50 పరుగుల భారీవిజయంతో సెమీఫైనల్స్ నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

సూపర్ -8 తొలిరౌండ్ పోరులో 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ ను 47 పరుగులతో ఓడించిన భారత్..9వ ర్యాంకర్ బంగ్లాను 50 పరుగులతో చిత్తు చేయడం విశేషం.

బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా టీ-20 ప్రపంచకప్ లో భారత్ కు ఇది వరుసగా 5వ గెలుపు.

ఓ రోజు విరామం తరువాత..సూపర్- 8 ఆఖరిరౌండ్ పోరులో రెండో ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో భారత్, బంగ్లాదేశ్ తో అప్ఘనిస్థాన్ తలపడనున్నాయి.

Tags:    
Advertisement

Similar News