వన్డే ప్రపంచకప్ లో హార్థిక్ పాండ్యా 'రికార్డ్ డబుల్' !
2023- ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆల్ టైమ్ గ్రేట్ యువరాజ్ సింగ్ సరసన చోటు సంపాదించాడు.
2023- ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆల్ టైమ్ గ్రేట్ యువరాజ్ సింగ్ సరసన చోటు సంపాదించాడు.
భారత్ ఆతిథ్యంలో నాలుగోసారి జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లో భారత స్టార్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా.. రౌండ్ రాబిన్ లీగ్ మొదటి రెండు రౌండ్ల మ్యాచ్ ల్లోనే పలు అరుదైన రికార్డులు నెలకొల్పారు.
న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అఫ్ఘనిస్థాన్ తో జరిగిన రెండోరౌండ్ పోటీలో భారత్ 8 వికెట్ల విజయం సాధించడంలో ప్రధాన ఆటగాళ్లంతా తమవంతు పాత్ర పోషించారు.
అఫ్ఘన్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో మిగిలిన బౌలర్లతో కలసి వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తనవంతుగా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆట 13వ ఓవర్లోనే అఫ్ఘన్ కీలక బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ను పడగొట్టడంతో పాటు..అజమ్ తుల్లా ఓమరాజీ- హస్మతుల్లా షాహీదల 121 పరుగుల భాగస్వామ్యాన్ని వేరు చేయడంలో సఫలమయ్యాడు.
ఈ క్రమంలో ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ టోర్నీలలో 30 వికెట్లు, 500 పరుగుల డబుల్ సాధించిన భారత రెండో ఆల్ రౌండర్ గా రికార్డుల్లో చేరాడు. ఐసీసీ వన్డే, ఐసీసీ టీ-20, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలలో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించడం ద్వారా గతంలో లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇదే ఘనతను సొంతం చేసుకొన్నాడు.
2016 నుంచి 2023 వరకూ..
హార్థిక్ పాండ్యా 2016, 2021, 2022 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీలతో పాటు 2019, 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలలోనూ పాల్గొన్నాడు. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సైతం హార్థిక్ భారత్ కు ప్రాతినిథ్యం వహించాడు.
యువరాజ్ సింగ్ మాత్రం 2000, 2002, 2009, 2006 చాంపియన్స్ ట్రోఫీ, 2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్, 2007, 2009, 2010, 2012, 2014, 2016 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో భారతజట్టు సభ్యుడిగా పాల్గొన్నాడు.
2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలలో విజేతగా నిలిచిన భారతజట్టులో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. 2011 వన్డే ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ద చాంపియన్షిప్ అవార్డును యువరాజ్ సాధించాడు. 2002 చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారతజట్టులో యువీ కూడా సభ్యుడే.
మాస్టర్ ను మించిన నయామాస్టర్...
అప్ఘన్ తో ముగిసిన మ్యాచ్ లో అజేయ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా నయామాస్టర్ విరాట్ కొహ్లీ ..మాస్టర్ సచిన్ రికార్డును అధిగమించాడు. వన్డే, టీ-20 టోర్నీలలో కలసి 2 వేల 279 పరుగులు సాధించడం ద్వారా మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న 2, 278 పరుగుల రికార్డును తెరమరుగు చేశాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 2,193, క్రిస్ గేల్ 2,151, మహేల జయవర్థనే 2,116 పరుగులతో ఆ తర్వాతి స్థానాలలో నిలిచారు.
మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న నాలుగు అరుదైన రికార్డులను విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ కలసి అధిగమించడం విశేషం.