పడిలేచిన కెరటం హార్థిక్ పాండ్యా!

కుప్పకూలిన చోటే లేచి నిలబడాలి, పరాజయం ఎదురైన చోటే విజేతగా నిలవాలి. ఈ మాటల్ని నిజం చేసిన మొనగాడు హార్థిక్ పాండ్యా. దుబాయ్ వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన ఆసియాకప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో పాండ్యా విన్నింగ్ సిక్సర్ తో భారత్ ను విజేతగా నిలపడం క్రికెట్ చరిత్రలోనే ఓ అపూర్వఘట్టంగా నిలిచిపోతుంది.

Advertisement
Update:2022-08-30 11:49 IST

కుప్పకూలిన చోటే లేచి నిలబడాలి, పరాజయం ఎదురైన చోటే విజేతగా నిలవాలి. ఈ మాటల్ని నిజం చేసిన మొనగాడు హార్థిక్ పాండ్యా. దుబాయ్ వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన ఆసియాకప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో పాండ్యా విన్నింగ్ సిక్సర్ తో భారత్ ను విజేతగా నిలపడం క్రికెట్ చరిత్రలోనే ఓ అపూర్వఘట్టంగా నిలిచిపోతుంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన 2022 ఆసియాకప్ గ్రూప్- ఏ లీగ్ తొలిమ్యాచ్ కు వేదికగా నిలిచిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓ అసాధారణ ఘట్టం చోటు చేసుకొంది.

ఇదే వేదికగా 2018 ఆసియాకప్ టోర్నీలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడుతూ భారత ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా వెన్నెముక గాయంతో కుప్పకూలిపోయాడు. లేచినిలబడే పరిస్థితి లేకపోడంతో స్ట్ర్రెచర్ పై పాండ్యాను ఆస్పత్ర్రికి తరలించారు....

కట్ చేస్తే..నాలుగేళ్ల విరామం తర్వాత..అదే దుబాయ్ స్టేడియం వేదికగా..పాకిస్థాన్ ప్రత్యర్థిగా జరిగిన 2022 ఆసియాకప్ లీగ్ పోటీలో..అదే హార్ధిక్ పాండ్యా ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు.

బౌలర్ గా 3 వికెట్లు పడగొట్టడం ద్వారా పాకిస్థాన్ ను కుప్పకూల్చిన పాండ్యా..ఆ తర్వాత చేజింగ్ లో భారతజట్టు గెలుపు భారాన్ని తన భుజం పైన వేసుకొన్నాడు. తీవ్రఒత్తిడి ఎదురైనా భారీసిక్సర్ తో తనజట్టును విజేతగా నిలిపాడు. 33 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను సగర్వంగా అందుకొన్నాడు.

అప్పుడు...ఇప్పుడు డీకెనే....

హార్థిక్ పాండ్యా తో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ కు చిత్రమైన అనుబంధమే ఉంది. ఈ ఇద్దరికీ మెరుపువేగంతో పరుగులు సాధించడంలో స్పెషలిస్టులుగా, మ్యాచ్ ను గొప్పగా ముగించే నమ్మదగిన మ్యాచ్ ఫినిషర్లుగా పేరుంది. మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగడం, క్లిష్టసమయాలలో కూల్ కూల్ గా ఆడుతూ జట్టును విజేతగా నిలపడంలో దినేశ్ కార్తీక్ కు, హార్థిక్ పాండ్యాకు మంచి రికార్డే ఉంది.

అయితే...దుబాయ్ స్టేడియంలో నాలుగేళ్ల క్రితం హార్థిక్ పాండ్యా వెన్నెముక గాయంతో కుప్పకూలిన సమయంలో దినేశ్ కార్తీకే పక్కనే ఉండి సపర్యలు చేస్తూ, ధైర్యవచనాలు చెబుతూ ఊరట కలిగించాడు.

అంతేకాదు...నాలుగేళ్ల తర్వాత..అదే దుబాయ్ స్టేడియంలో హార్థిక్ పాండ్యా విన్నింగ్ సిక్సర్ బాదిన సమయంలో నాన్ స్ట్ర్రయికర్ గా దినేశ్ కార్తీకే ఉండటం విశేషం. హార్థిక్ పాండ్యా విజయానికి అవసరమైన సిక్సర్ బాదిన వెంటనే..దినేశ్ కార్తీక్ తనదైన శైలిలో అభివాదం చేశాడు.

ఐపీఎల్ 2022లో పాండ్యా విశ్వరూపం!

వెన్నెముక గాయంతో ఆటకు దూరమైన పాండ్యా శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకొన్నాడు. అయితే..పూర్తిస్థాయిలో రాణించలేకపోడంతో భారతజట్టులో పాండ్యాకు

చోటే దండుగ అంటూ విమర్శలు వచ్చాయి. కేవలం బ్యాటింగ్ కే పరిమితం కావడం, వరుస వైఫల్యాలతో పాండ్యా పనైపోయిందనే అందరూ అనుకొన్నారు. కానీ..పాండ్యా మాత్రం పూర్తి ఫిట్ నేస్ పై దృష్టి పెట్టాడు. జిమ్ లో గంటల తరబడి గడుపుతూ పూర్వపుస్థాయి ఫిట్ నెస్ ను సంపాదించాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ పూర్వపు స్థాయిని చేరుకొన్నాడు.

2022 ఐపీఎల్ లో కొత్తగా చేరిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టు పగ్గాలు అందుకోడంతోనే హార్థిక్ పాండ్యా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆల్ రౌండర్ గా తనజట్టుకు ముందుండి విజయపథంలో నడిపించాడు. తొలి ప్రయత్నంలోనే గుజరాత్ టైటాన్స్ ను విజేతగా నిలిపాడు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా

ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకొన్న పాండ్యా...ఈసారి మాత్రం గుజరాత్ టైటాన్స్ సారథిగా ఐపీఎల్ కప్ ను అందుకొన్నాడు.



టీ-20లో నంబర్ వన్ ఆల్ రౌండర్..

2019లో జరిగిన ఓ టీవీ షోలో మహిళల పై అనుచిత వాఖ్యలు చేసి బీసీసీఐ సస్పెన్షన్ కు గురైన 28 సంవత్సరాల హార్థిక్ పాండ్యా క్రొయేషియాకు చెందిన తన స్నేహితురాలు నటాషా ద్వారా వివాహం కాకుండానే తండ్రి హోదా సంపాదించాడు. ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే తన సహజీవనాన్ని వివాహబంధంగా మార్చుకొన్నాడు.

విధి వెక్కిరించినా...వివాదాలు చుట్టుముట్టినా పాండ్యా మాత్రం పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. విమర్శకులకు తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో తగిన రీతిలో సమాధానం చెప్పడం ద్వారా భారతజట్టులో తన స్థానం మరింత పదిలం చేసుకోగలిగాడు. హార్థిక్ పాండ్యా లేకపోతే ప్రస్తుత భారత వన్డే, టీ-20 జట్లు లేవన్న పరిస్థితి కల్పించాడు.

నాలుగేళ్ల క్రితం తీవ్రంగా గాయపడిన తన కెరియర్ ను తిరిగి గాడిలో పడేటట్లుగా చేయడం వెనుక భారతజట్టు ఫిజియో నితిన్ పటేల్, ట్రెయినర్ సోహమ్ దేశాయ్ ల శ్రమ ఎంతో ఉందని పాండ్యా గుర్తు చేసుకొన్నాడు.

2022 ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బ్యాటర్ గా 487 పరుగులు, బౌలర్ గా 15 మ్యాచ్ ల్లో 8 వికెట్లు పడగొట్టడం ద్వారా దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ కు భారత జట్టులో తిరిగి చోటు సంపాదించగలిగాడు.

2016లో భారత టీ-20, వన్డే ,2017లో భారత టెస్ట్ జట్టు క్యాప్ లు అందుకొన్న హార్థిక్ పాండ్యా...ఇప్పటి వరకూ భారత్ తరపున 11 టెస్టులు ఆడి 532 పరుగులు, 17 వికెట్లు, 66 వన్డేలలో 1, 267కు పైగా పరుగులు, 63వికెట్లు, 68 టీ-20 మ్యాచ్ ల్లో 867కు పైగా పరుగులు, 53 వికెట్లు సాధించాడు.

ప్రస్తుత ఆసియాకప్ తో పాటు..ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ లో జరిగే టీ-20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవాలంటే..హార్థిక్ పాండ్యా అత్యుత్తమంగా రాణించితీరక తప్పదు.

Tags:    
Advertisement

Similar News