విదేశీ టీ-20 లీగ్ ల్లో భారత మాజీ కెప్టెన్ జోరు!
భారత జూనియర్ ప్రపంచకప్ హీరో ఉన్ముక్త్ చంద్ ఇంటఓడినా రచ్చగెలువగలుగుతున్నాడు. ఐపీఎల్ లో అవకాశం లేక విదేశీలీగ్ ల తలుపుతడుతూ తన ఉనికిని కాపాడుకోగలుగుతున్నాడు.
భారత జూనియర్ ప్రపంచకప్ హీరో ఉన్ముక్త్ చంద్ ఇంటఓడినా రచ్చగెలువగలుగుతున్నాడు. ఐపీఎల్ లో అవకాశం లేక విదేశీలీగ్ ల తలుపుతడుతూ తన ఉనికిని కాపాడుకోగలుగుతున్నాడు..
ప్రపంచీకరణ పుణ్యమా అంటూ వివిధ దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించే టీ-20 లీగ్ లు పలువురు నవతరం ఆటగాళ్లకు జీవనోపాథిగా మారాయి. వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి, నవతరం క్రికెటర్లు భారత క్రికెట్ బోర్డు నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తలుపులు తడుతుంటే..స్వదేశీలీగ్ లో తగిన అవకాశాలు, ప్రోత్సాహం కరువైన పలువురు భారత యువక్రికెటర్లు విదేశీలీగ్ ల వైపు మొగ్గుచూపుతున్నా
గతంలో జూనియర్ ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారతజట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఢిల్లీ బ్యాటర్ ఉన్ముక్త్ చంద్ గత సీజన్లో ఆస్ట్ర్రేలియా బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు తరపున బరిలో నిలిచాడు. బిగ్ బాష్ లీగ్ లో పాల్గొన్న భారత తొలి ఆటగాడిగా 29 సంవత్సరాల ఉన్ముక్త్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.
బీబీఎల్ టు బీపీఎల్.....
గతేడాది బిగ్ బాష్ లీగ్ లో పాల్గొన్న ఉన్ముక్త్ చంద్ ..2023 సీజన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనటానికి చట్టో గ్రామ్ చాలెంజర్స్ తో కాంట్రాక్టు కుదుర్చుకొన్నాడు.
ఆల్ రౌండర్ శువగత హోమ్ నాయకత్వంలోని చట్టో గ్రామ్ చాలెంజర్స్ జట్టులో అఫిఫ్ హుస్సేన్, కర్టిస్ కాంఫెర్ లాంటి ఆటగాళ్లున్నారు. బీపీఎల్ టైటిల్ ను ఇప్పటి వరకూ
చట్టోగ్రామ్ ఒక్కసారీ నెగ్గలేదని, ప్రస్తుత సీజన్లో ఆలోటును పూడ్చుకోవడంలో తనవంతు పాత్ర పోషిస్తానని ఉన్ముక్త్ చంద్ చెప్పాడు.
ధాటిగా ఆడే ఓపెనర్ గా పేరున్న ఉన్ముక్త్ కు ఐపీఎల్ లో తగిన అవకాశాలు, ప్రోత్సాహం దక్కక పోడంతో గతంలో అమెరికాకు వలస వెళ్లాడు. అమెరికా క్రికెట్ లీగ్ లో పాల్గొంటూ వచ్చిన ఉన్ముక్త్ 2021 సీజన్లో స్వదేశానికి తిరిగి వచ్చాడు.
గతంలో తనకు బీసీసీఐ కాంట్రాక్టు ఉన్న కారణంగా విదేశీ లీగ్ ల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదని..ప్రస్తుతం తాను బీసీసీఐ కాంట్రాక్టు క్రికెటర్ కాకపోడంతో విదేశీలీగ్ ల్లో పాల్గొనగలుగుతున్నానని చెప్పాడు.
2022 సీజన్లో బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనగలగడంతో పలువురు ప్రముఖ స్టార్లతో కలసి ఆడే అరుదైన అవకాశం తనకు దక్కిందని ఉన్ముక్త్ వివరించాడు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో చట్టో గ్రామ్ ఫ్రాంచైజీని టైటిల్ విన్నర్ గా నిలపడమే తన లక్ష్యమని ప్రకటించాడు.
ప్రొఫెషనల్ క్రికెటర్లుగా రాటుదేలాలంటే..విదేశీ లీగ్ ల్లో పాల్గొని తీరాల్సిందేనన్నది తన అనుభవం, వ్యక్తిగత అభిప్రాయమని వివరించాడు. ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా సిల్హౌట్ స్ట్ర్రయికర్స్ తో జరిగే మ్యాచ్ ద్వారా ఉన్ముక్త్ చంద్ బీపీఎల్ లో అరంగేట్రం చేయనున్నాడు.
ఆస్ట్ర్రేలియన్ బిగ్ బాష్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ల్లో పాల్గొన్న భారత తొలి క్రికెటర్ ఎవరంటే ఉన్ముక్త్ చంద్ అని చెప్పక తప్పదు.