భారత మాజీ కోచ్ కు ఆర్థిక కష్టాలు!

భారత క్రికెట్ మాజీ చీఫ్ కోచ్ గ్రెగ్ చాపెల్ అవసానదశలో ఆర్థికకష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. 75 ఏళ్ల వయసులో అరకొర ఆదాయంతో భార్యతో కలసి కాలవెళ్లదీస్తున్నాడు.

Advertisement
Update:2023-10-27 08:55 IST

భారత క్రికెట్ మాజీ చీఫ్ కోచ్ గ్రెగ్ చాపెల్ అవసానదశలో ఆర్థికకష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. 75 ఏళ్ల వయసులో అరకొర ఆదాయంతో భార్యతో కలసి కాలవెళ్లదీస్తున్నాడు.

భారత క్రికెట్ వివాదాస్పద కోచ్, ఆస్ట్ర్రేలియా దిగ్గజ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ జీవితచరమాంకంలో తన భార్యతో కలసి ఆర్థికకష్టాలు పడుతున్నాడు. అతిశయం, ఆత్మాభిమానం ఆభరణాలుగా భావించే 75 సంవత్సరాల గ్రెగ్ చాపెల్ కోసం అతని స్నేహితులు సహాక నిధిని సమకూర్చడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

భారత స్టార్లతో గ్రెగ్ చాపెల్ గిల్లికజ్జాలు...

గ్రెగ్ చాపెల్ ఎంత గొప్ప క్రికెటరో..ప్రతిభావంతుడైన శిక్షకుడో..అంత వివాదాస్పదమైన వ్యక్తి కూడా. తలబిరుసు, అతిశయం, ఆధిపత్యధోరణితో సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ లాంటి భారత స్టార్ ప్లేయర్లతోనే గిల్లికజ్జాలు పెట్టుకొన్నాడు.

2005 నుంచి 2007 వరకూ భారత క్రికెట్ జట్టు కోచ్ గా పగ్గాలు చేపట్టిన గ్రెగ్ చాపెల్ కు రాహుల్ ద్రావిడ్ అంటే చెప్పలేని ఇష్టం. ద్రావిడ్ ను దువ్వుతూ..మాస్టర్ సచిన్, సౌరవ్ గంగూలీ లాంటి పలువురు సీనియర్ స్టార్లను దూరం పెట్టడం, జట్టులో రాజకీయాలు చేయడం వంటి పనులతో వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. చివరకు భారత జట్టు సభ్యులే తిరుగుబాటు చేసే పరిస్థితి రావడంతో కోచ్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

2007 ప్రపంచకప్ లో భారత్ వైఫల్యానికి గ్రెగ్ చాపెల్ కోచ్ గా ప్రధాన కారణంగా నిలిచాడు.

అలనాటి కంగారూ సూపర్ స్టార్...

1970 దశకంలో తన సోదరులు ఇయాన్ చాపెల్, ట్రెవర్ చాపెల్ లతో కలసి దశాబ్దకాలం పాటు ఆస్ట్ర్రేలియా క్రికెట్ కు అసమాన సేవలు అందించిన రికార్డు గ్రెగ్ చాపెల్ కు ఉంది.

ప్రతిభావంతుడైన బ్యాటర్ గా, గడుసుపిండంగా గ్రెగ్ చాపెల్ కు పేరుంది. 1984 జనవరిలో తన చిట్టచివరి టెస్టుమ్యాచ్ ఆడిన గ్రెగ్ చాపెల్ కంగారూ సూపర్ స్టార్లలో ఒకడిగా వెలుగొందాండు.

తన టెస్టు కెరియర్ లో 87 మ్యాచ్ లు ఆడి 24 సెంచరీలతో సహా 7వే 110 పరుగులు సాధించిన మొనగాడు గ్రెగ్ చాపెల్. ఆస్ట్ర్రేలియా క్రికెట్ బోర్డుపై తిరుగుబాటు చేసి కెర్రీ ప్యాకర్ పోటీ క్రికెట్లో చేరడం ద్వారా గ్రెగ్ చాపెల్ తన కెరియర్ చివరి దశలో భారీమూల్యమే చెల్లించాడు.

ట్రస్టుతో సేవలు అందిస్తున్నా ఆర్థిక అగచాట్లు...

ఆస్ట్ర్రేలియాలో గూడులేని నిరుపేదల కోసం గ్రెగ్ చాపెల్ ఫౌండేషన్ నిధులు సేకరిస్తూ సేవలు అందిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం ట్రస్టును నిర్వహించే వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలకు నిధులలోని కొంత మొత్తాన్ని వాడుకొనే వెసలుబాటు ఉన్నా..అందులోని డాలర్ ముట్టుకోని వ్యక్తిత్వం గ్రెగ్ చాపెల్ ది కావడంతో అవసానదశలో కష్టాలు మొదలయ్యాయి.

75 సంవత్సరాల లేటు వయసులో భార్య జూడీతో కలసి చాలీచాలని ఆదాయంతో గ్రెగ్ రోజులు గడుపుతున్నాడు. ఇరుగుపొరుగు, స్నేహితుల నుంచి ఆర్థికసాయం పొందటానికి ఏమాత్రం ఆసక్తిలేని గ్రెగ్ చాపెల్ కష్టాలను చూసి..అతని సోదరులు ఇయాన్ ,ట్రెవర్ తో పాటు స్నేహితులు నిధుల సేకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

2 లక్షల 50వేల డాలర్లు సేకరణే లక్ష్యంగా....

గ్రెగ్ చాపెల్ తన భార్య జూడీతో కలసి జీవితంలోని చివరిరోజుల్ని నిశ్చింతగా గడపడం కోసం 2లక్షల 50వేల డాలర్ల నిధిని సేకరించడానికి పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇటీవలే మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా గ్రెగ్ చాపెల్ సహాయక లంచ్ కార్యక్రమాన్ని భారీస్థాయిలో నిర్వహించారు. ఆన్ లైన్ ద్వారా కూడా నిధులు సేకరించడం మొదలు పెట్టారు.

తన కోసం నిధులు సేకరించడానికి గ్రెగ్ చాపెల్ సుముఖంగా లేడని, అయితే..అవసానదశలో ఆర్థికంగా సమస్యలు లేకుండా జీవించడానికి తగిన నిధులు తామే సేకరిస్తున్నామని గ్రెగ్ స్నేహితుల బృందం ప్రతినిధి తెలిపాడు.

మిగిలిన క్రికెటర్ల మాదిరిగా అవసానదశలో దర్జాగా, విలాసవంతంగా, నిశ్చింతంగా జీవించాల్సిన వయసులో గ్రెగ్ చాపెల్ చాలీచాలని ఆదాయంతో గుట్టుగా బ్రతకడం తమను కలచి వేసిందని చెప్పారు.

గ్రెగ్ చాపెల్ తో కలసి ఆడిన మిగిలిన క్రికెటర్లకు రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్ మ్యాచ్ లు నిర్వహించుకొనే అవకాశం దక్కింది. గ్రెగ్ కు ఆ అవకాశం లేకపోడంతో ప్రస్తుతం ఆర్థికసమస్యలతో ఉక్కిరిబిక్కిరువుతున్నట్లు తెలిపారు.

నిశ్చింతగా గడుపుతాం- గ్రెగ్

తమ తరానికి చెందిన క్రికెటర్లలో చాలామంది తమ అవసాన దశలో ఆర్థికసమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇది తనొక్కడి సమస్యే కాదని గ్రెగ్ గుర్తు చేసుకొన్నారు.

నేటితరం క్రికెటర్లకు ఉన్న అవకాశాలు తమరోజుల్లో లేవని వాపోయారు.

తన కుటుంబం కోసం స్నేహితులు సేకరిస్తున్న నిధులతో జీవితంలో చివరిరోజుల్ని తాను, తన భార్య నిశ్చింతగా గడుపుతామని గ్రెగ్ చాపెల్ ప్రకటించారు.

ఏది ఏమైనా..రాబడి ఉన్నప్పుడే ఆదాచేసుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ విషయంలో నేటితరం భారత క్రికెటర్లను చూసి ఎంతైనా నేర్చుకోవాలి.

Tags:    
Advertisement

Similar News