ఫీల్డింగ్ అంటే అంత అలుసా..భారత కెప్టెన్ కు చురకలు!

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యమే కారణమని, ప్రస్తుత కెప్టెన్ కు ఫీల్డింగ్ అంటే ఏమాత్రం లెక్కలేదంటూ భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఫీల్డర్ అజయ్ జడేజా చురకలు అంటించాడు.

Advertisement
Update:2022-11-02 12:08 IST

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యమే కారణమని, ప్రస్తుత కెప్టెన్ కు ఫీల్డింగ్ అంటే ఏమాత్రం లెక్కలేదంటూ భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఫీల్డర్ అజయ్ జడేజా చురకలు అంటించాడు...

క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా...బ్యాటింగ్, బౌలింగ్ కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ఫీల్డింగ్ కు సైతం అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఒక్క క్యాచ్, ఒక్క రనౌట్ మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేస్తుంది. కీలక సమయంలో ఓ క్యాచ్ జారవిడిచినా...ఓ రనౌట్ చేజార్చుకొన్నా పరాజయం చవిచూడక తప్పదు. అందుకే క్రికెట్లో ..క్యాచెస్ విన్స్ మ్యాచెస్ ..అన్ననానుడి స్థిరపడిపోయింది.

క్యాచ్ లు విడిచి పెట్టినజట్టు, ఫీల్డింగ్ ను పట్టించుకోని కెప్టెన్ భారీమూల్యం చెల్లించుకోక తప్పదని నిరూపితమవుతూ వస్తోంది.

రోహిత్ పై జడేజా విమర్శలు...

ప్రపంచకప్ సూపర్ -12 గ్రూపు-2 లీగ్ లో భాగంగా పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్లో భారత్ ఫీల్డింగ్ వైఫల్యాలతోనే ఓటమి మూటకట్టుకోడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రధానంగా సూపర్ ఫీల్డర్ గా పేరున్న విరాట్ కొహ్లీ ఓ తేలిక క్యాచ్ ను జారవిడవడం, సునాయాసంగా చేయాల్సిన రనౌట్ ను కెప్టెన్ రోహిత్ శర్మ చేయలేకపోడం

భారత ఓటమికి ప్రధాన కారణమని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

ప్రస్తుత భారత కెప్టెన్ కు ఫీల్డింగ్ అంటే ఏమాత్రం లెక్కలేదని, బ్యాటింగ్, బౌలింగ్ లకు ఇస్తున్న ప్రాధాన్యత ఫీల్డింగ్ కు ఇవ్వడం లేదంటూ భారత మాజీ కెప్టెన్, క్రికెట్ కామెంటీటర్ అజయ్ జడేజా మండిపడ్డాడు.

భారతజట్టుకు విరాట్ కొహ్లీ కెప్టెన్ గా ఉన్నంత కాలం ఫీల్డింగ్ విభాగంలో సైతం అత్యుత్తమంగా ఉందని, ఫీల్డింగ్ లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకే జట్టులో చోటు కల్పిస్తూ వచ్చారని అజయ్ జడేజా గుర్తు చేశాడు.

అశ్విన్, షమీ..దొందూదొందే!

ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ..అసలు ఫీల్డింగ్ ను ఏమాత్రం పట్టించుకోడంలేదని, బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల పట్ల చూపుతున్న శ్రద్ధ ఫీల్డింగ్ పైన చూపడం లేదంటూ అజయ్ జడేజా విమర్శించాడు.

లోస్కోరింగ్ మ్యాచ్ ల్లో ఫీల్డింగ్ ఎంతో కీలకమని, ఓ క్యాచ్ జారవిడిచినా మ్యాచ్ ను చేజార్చుకోక తప్పదని, పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన కీలక పోరులో అదే జరిగిందని వివరించాడు.

సఫారీ మ్యాచ్ విన్నర్ మర్కరమ్ 35 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్న సమయంలో ఇచ్చిన క్యాచ్ ను విరాట్ కొహ్లీ విడిచి పెట్టాడని, ఆ వెంటనే దొరికిన రనౌట్ అవకాశాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఉపయోగించుకోలేకపోయాడని..భారత్ ఓటమికి అదే ప్రధానకారణమని విశ్లేషించాడు.

తన దృష్టిలో..ఆసియా ( భారత్, పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ ) జట్లు ఫీల్డింగ్ లో ఎంతగానో వెనుకబడి ఉన్నాయని, ఫీల్డింగ్ ప్రాముఖ్యతను ఏమాత్రం గుర్తించడం లేదంటూ వాపోయాడు.

ప్రస్తుత భారతజట్టులో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలను పరమచెత్త ఫీల్డర్లుగా అజయ్ జడేజా అభివర్ణించాడు. ఈ ఇద్దరూ గొప్పబౌలర్లే కావచ్చు...ఫీల్డింగ్ లో మాత్రం

భారతజట్టుకే భారమంటూ మండిపడ్డాడు. షమీ, అశ్విన్ లాంటి వారి నుంచి గొప్పఫీల్డింగ్ ను ఆశించలేమంటూ తేల్చి చెప్పాడు.

ఫీల్డింగ్ కారణంకాదు- గవాస్కర్..

దక్షిణాఫ్రికా చేతిలో భారత్ పరాజయానికి ఫీల్డింగ్ వైఫ్యలం కారణం కానేకాదని మరో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. క్యాచ్ లు, రనౌట్లు చేజార్చుకోడం ఆటలో భాగమని, భారతజట్టు ఓటమి కంటే ఫీల్డింగ్ కంటే...ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగే కారణమంటూ గవాస్కర్ తన విశ్లేషణను చేశారు.

అపారఅనుభవం ఉన్న అశ్విన్ లాంటి బౌలర్ తన కోటా 4 ఓవర్లలో 43 పరుగులు ఇవ్వటమే జట్టు పరాజయానికి కారణమని తేల్చి చెప్పారు. అశ్విన్ పొదుపుగా బౌల్ చేసి..సఫారీహిట్టర్లను కట్టడి చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, మిగిలిన బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌల్ చేసినా..సీనియర్ బౌలరే విఫలమయ్యాడంటూ చెప్పుకొచ్చారు.

మొత్తం మీద..భారత ఓటమికి కారణాలను ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నా...బ్యాటింగ్ లో టాపార్డర్ వైఫల్యాన్ని ఎత్తిచూపక పోడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News