ఇంగ్లండ్ ఆశలు ఆవిరి..'యూరోకింగ్' స్పెయిన్!
2024-యూరోపియన్ ఫుట్ బాల్ విజేతగా స్పెయిన్ రికార్డుస్థాయిలో నాలుగోసారి నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ ఆశల్ని అడియాసలు చేసింది.
2024-యూరోపియన్ ఫుట్ బాల్ విజేతగా స్పెయిన్ రికార్డుస్థాయిలో నాలుగోసారి నిలిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ ఆశల్ని అడియాసలు చేసింది.
ప్రపంచ, యూరోప్ సాకర్ అభిమానులను గత నాలుగువారాలుగా అలరిస్తూ వచ్చిన 2024- యూరోపియన్ కప్ ఫుట్ బాల్ పోటీలు స్పెయిన్ రికార్డు విజయంతో ముగిశాయి.
బెర్లిన్ లోని ఒలింపిక్స్ స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ టైటిల్ పోరులో పవర్ ఫుల్ ఇంగ్లండ్ పై ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన స్పెయిన్ 2-1 గోల్స్ తో సంచలన విజయం సాధించింది.
స్పెయిన్ సరికొత్త రికార్డు....
ప్రపంచ ఫుట్ బాల్ లో రెండో అతిపెద్ద, అత్యంత జనాదరణ పొందిన యూరోపియన్ కప్ ఫుట్ బాల్ పోటీలను యూరోప్ ఖండంలోని అభిమానులు ఓ పండుగలా, వేడుకలా జరుపుకొంటారు.
ప్రస్తుత యూరోకప్ పోటీలకు జర్మనీ ఆతిథ్యమిస్తే మూడుసార్లు విజేత స్పెయిన్ రికార్డుస్థాయిలో నాలుగోసారి టైటిల్ నెగ్గడం ద్వారా సరికొత్త రికార్డుతో తనకు తానేసాటిగా నిలిచింది. యూరోసాకర్ చరిత్రలో నాలుగుసార్లు చాంపియన్ గా నిలిచిన ఏకైకజట్టు స్పెయిన్ మాత్రమే.
బెర్లిన్ స్టేడియంలోని వేలాదిమంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ టైటిల్ సమరం తొలి నిముషం నుంచి మ్యాచ్ ముగిసే వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగింది.
లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ తిరుగులేని విజయాలతో ఫైనల్స్ చేరిన రెండు అత్యుత్తమజట్ల నడుమ జరిగిన ఈ పోరులో ఇంగ్లండ్ అనుభవం, మొండితనం పైన స్పెయిన్ దూకుడు, యువఆటగాళ్ల ఉరకలెత్తే ఉత్సాహానిదే పైచేయిగా నిలిచింది.
ఆట రెండో భాగం 47వ నిముషంలో నికో విలియమ్స్ సాధించిన గోలుతో స్పెయిన్ 1-0తో పైచేయి సాధించింది. అయితే 73వ నిముషంలో కోలే పామర్ చేసిన గోలుతో ఇంగ్లండ్ 1-1తో స్కోరు సమం చేయగలిగింది.
ఆట 87వ నిముషంలో మికెల్ ఓయర్ జబాల్ సాధించిన గోలుతో స్పెయిన్ విజేత కాగలిగింది. 1964లో తొలిసారిగా యూరోటైటిల్ నెగ్గిన స్పెయిన్ ఆ తరువాత 2008, 2012సంవత్సరాలలో చాంపియన్ గా అవతరించగలిగింది.
పాపం! ఇంగ్లండ్....
వరుసగా రెండోసారి యూరోకప్ ఫైనల్స్ చేరినా ఇంగ్లండ్ రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1966 ప్రపంచకప్ తరువాత మరో అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తూ వచ్చిన ఇంగ్లండ్ కు ప్రస్తుత యూరోకప్ ఫైనల్లో సైతం నిరాశ తప్పలేదు. ప్రధానంగా జట్టులోని స్టార్ ప్లేయర్ హారీ కేన్ కు ఈ ఫైనల్ ఓటమి గుండెకోతను మిగిల్చింది.
ఇంగ్లండ్ లోని వేలాదిమంది సాకర్ అభిమానులు తమ జట్టు ఓటమితో విచారంలో పడిపోయారు. ఈ మ్యాచ్ కు ప్రిన్స్ విలియమ్, స్పెయిన్ రాజు ఫిలిప్పీతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
స్పెయిన్ జట్టులోని 17 సంవత్సరాల కుర్రఆటగాడు యమాల్ తన అసాధారణ ఆటతీరుతో అందరినీ ఆకట్టు కొన్నాడు. ఈ ఫైనల్లో స్పెయిన్ తొలిగోలు సాధించడంలో యమాల్ కీలకపాత్ర పోషించాడు.
మొత్తంమీద గత నాలుగువారాలుగా యూరోపియన్ దేశాల సాకర్ అభిమానుల కంటిమీద కునుకు లేకుండా చేసిన 2024 యూరోకప్ లో నాలుగు చాంపియన్ జట్లను కంగు తినిపించడం ద్వారా స్పెయిన్ పుష్కరకాలం విరామం తరువాత విజేతగా నిలువగలిగింది.