112 సంవత్సరాల ప్రపంచ రికార్డు తెరమరుగు!
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 112 సంవత్సరాల క్రితం నమోదైన ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ తెరమరుగు చేసింది. 17 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే రికార్డుల మోత మోగించింది.
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 112 సంవత్సరాల క్రితం నమోదైన ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ తెరమరుగు చేసింది. 17 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే రికార్డుల మోత మోగించింది....
టీ-20 ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్...సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. 17 సంవత్సరాల విరామం తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్...తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
తొలిరోజు ఆటలో 506 పరుగులు
రోజుకు 90 ఓవర్ల చొప్పున ఐదురోజులపాటు సాగే టెస్టు క్రికెట్లో రోజుకు సగటున 300 పరుగుల స్కోరు చేస్తే అది గొప్ప విషయమే. అయితే ..ఇంగ్లండ్ జట్టు మాత్రం రావల్పిండి స్టేడియం వేదికగా పాకిస్థాన్ తో ప్రారంభమైన తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 506 పరుగుల స్కోరుతో సంచలనం సృష్టించింది.
ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడంతో ఇంగ్లండ్ బ్యాటర్ల పరుగుల వేట మొదలయ్యింది.
టాప్ లేపిన టాపార్డర్...
బౌలర్లకు ఏమాత్రం అనువుకాని రావల్పిండి స్టేడియం పిచ్ పైన ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాటర్లు పరుగుల వెల్లువెత్తించారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు టాపార్డర్ బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు.
ఓపెనర్లు జాక్ క్రాలే 122, బెన్ డుకెట్ 107, వికెట్ కీపర్ బ్యాటర్ ఓలీ పోపీ 108, హారీ బ్రూక్ 101 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో ఇంగ్లండ్ 4 వికెట్లకు 506 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది.
సిడ్నీ వేదికగా 112 సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుమ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా తొలిరోజు ఆటలో సాధించిన 6 వికెట్లకు 494 పరుగుల స్కోరే ఇప్పటి వరకూ ప్రపంచ రికార్డుగా ఉంటూ వచ్చింది. అయితే.. శతాబ్దకాలానికి పైగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును రావల్పిండీ టెస్టులో ఇంగ్లండ్ తెరమరుగు చేయటం విశేషం.
ఆరుబంతుల్లో 6 బౌండ్రీల రికార్డు...
బ్యాటర్ల సర్గధామం లాంటి రావల్పిండి పిచ్ పైన ఇంగ్లండ్ టాపార్డర్ ను అదుపు చేయటానికి పాక్ బౌలర్లు నానాపాట్లు పడినా ప్రయోజనం లేకపోయింది. నాలుగు సెంచరీలతో పాటు 73 బౌండ్రీలు, 3 సిక్సర్లు సమర్పించుకోవాల్సి వచ్చింది.
ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు హారీ బ్రూక్...పాక్ తరపున టెస్టు అరంగేట్రం చేసిన స్పిన్నర్ సౌద్ షకీల్ బౌలింగ్ ఒక ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు వరుస బౌండ్రీలతో రికార్డు నెలకొల్పాడు.
టెస్టు చరిత్రలో వరుసగా ఆరుబౌండ్రీలు సాధించిన నాలుగో బ్యాటర్ గా హారీ బ్రూక్ నిలిచాడు. గతంలో ఇదే ఘనత సాధించిన ఆటగాళ్లలో క్రిస్ గేల్, రామ్ నరేశ్ శర్వాన్, సనత్ జయసూర్య ఉన్నారు.
బ్రూక్ కేవలం 80 బాల్స్ లోనే శతకం సాధించడం విశేషం. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 23 పరుగులకే అవుట్ కాగా...పాక్ అరంగేట్రం లెగ్ స్పిన్నర్ జహీద్ మహ్మద్ 160 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
గతంలో రావల్పిండి వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ లో 1187 పరుగులు నమోదు కావడం, ఐదురోజుల ఆటలో కేవలం 14 వికెట్లు మాత్రమే కూలడం విమర్శలకు దారితీసింది.