భారత్ ఇంటికి..ఫైనల్లో ఇంగ్లండ్!
టీ-20 ప్రపంచకప్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ పోటీ ముగిసింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో చెత్త బౌలింగ్‌తో భారత్ చిత్తుగా ఓడింది.
ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరుకోవాలన్న భారత ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఫైటింగ్ హాఫ్ సెంచరీలు సాధించినా..బౌలర్ల వైఫల్యంతో భారత్ ఇంటిదారి పట్టక తప్పలేదు. అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన ఏకపక్ష పోరులో రెండో ర్యాంకర్ ఇంగ్లండ్ 10 వికెట్లతో భారత్‌ను చిత్తు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌కు `ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్` అవార్డు దక్కింది.
భారత్‌కు ఇంగ్లండ్ పగ్గాలు..
ఈ నాకౌట్ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్లు రోహిత్, రాహుల్, రెండో డౌన్ సూర్యకుమార్ యాదవ్‌లను కట్టడి చేయడంలో ఇంగ్లండ్ బౌలర్లు సఫలమయ్యారు.
రాహుల్ 5, రోహిత్ 27, సూర్యకుమార్ 14 పరుగులకే అవుట్ కావడంతో మాజీ కెప్టెన్ విరాట్, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బాధ్యతాయుతంగా ఆడి స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలతో భారత్ కు 168 పరుగుల స్కోరు అందించారు. విరాట్ 40 బాల్స్ లో 4 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 50 పరుగులు, హార్ధిక్ పాండ్యా 33 బంతుల్లో 4 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 63 పరుగుల స్కోరు సాధించారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో విరాట్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
సూర్యకుమార్‌కు స్పిన్‌తో చెక్...
భారత స్టార్ బ్యాటర్, 360 స్ట్రోక్ మేకర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఇంగ్లండ్ ముందుగా ప్రకటించిన విధంగానే ఓ వ్యూహం ప్రకారం పెవిలియన్ దారి పట్టించింది. మొదటి 9 బంతుల్లోనే ఓ బౌండ్రీ, ఓ సిక్సర్‌తో జోరు మీదున్న సూర్యను లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ పడగొట్టాడు. రషీద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కోసం ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
హేల్స్- బట్లర్ ఫటాఫట్...
168 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 170 పరుగుల స్కోరుతో అలవోక విజయం సాధించింది. భారత కెప్టెన్ ఆరుగురు బౌలర్లను ఉపయోగించినా ఏ ఒక్కరూ ప్రభావం చూపలేకపోయారు.
బట్లర్ 49 బాల్స్ లో 9 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 80, హేల్స్ లో 47 బాల్స్ లో 4 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 86 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలిచారు భారత పేసర్లు, స్పిన్నర్లు గంపగుత్తగా విఫలమయ్యారు. కనీసం ఒక్క వికెట్ పడగొట్టకుండా భారత్ విఫలం కావడం ఇదే మొదటిసారి.
ఇంగ్లండ్ విజయంలో ప్రధాన పాత్ర వహించిన అలెక్స్ హేల్స్‌కు `ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్` అవార్డు దక్కింది. ఈ నెల 13న మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఫైనల్లో 2వ ర్యాంకర్ ఇంగ్లండ్‌తో 4వ ర్యాంకర్ పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.